Ukraine Crisis: రష్యా.. ఫేస్‌బుక్‌.. పోటాపోటీ ఆంక్షలు!

ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో రష్యాను నిలువరించేందుకు అమెరికాతోపాటు యూరప్‌ దేశాలు ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాట్‌ఫాంలపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించడంతోపాటు ఆదాయ మార్గాలను కట్టడి చేస్తున్నట్లు ప్రముఖ సామాజిక...

Published : 26 Feb 2022 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో రష్యాను నిలువరించేందుకు అమెరికాతోపాటు యూరప్‌ దేశాలు ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాట్‌ఫాంలపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించడంతోపాటు ఆదాయ మార్గాలను కట్టడి చేస్తున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా వెల్లడించింది. రష్యా మీడియా అనుబంధ సంస్థలకూ ఈ ఆంక్షలను వర్తింపజేస్తున్నట్లు మెటా సెక్యూరిటీ పాలసీ హెడ్‌ నథానియల్ గ్లీచెర్ ట్విటర్‌లో తెలిపారు. ఈ ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని, వారాంతం వరకు కొనసాగుతాయని చెప్పారు. అంతకుముందు.. తమ దేశంలో ‘ఫేస్‌బుక్‌’ వినియోగంపై పాక్షిక పరిమితులు విధిస్తున్నట్లు రష్యా అధికార వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ మీడియాను సెన్సార్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి.

ఈ ఆంక్షలను ఎత్తివేయాలని తాము చేసిన డిమాండ్‌ను పట్టించుకోలేదని, అందుకే ఫేస్‌బుక్‌ వినియోగంపై పరిమితులు విధించామని రష్యా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు వరుసగా మూడో రోజూ కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్‌ను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకొనేందుకు రష్యా సేనలు యత్నిస్తుండగా.. ఉక్రెయిన్‌ దళాలు ప్రతిఘటిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఈ నగరంలో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు స్థానికంగా 35 మంది పౌరులు చనిపోయినట్లు కీవ్‌ నగర మేయర్‌ తెలిపారు. అయితే, రష్యన్‌ బలగాలను ఎదుర్కొనేందుకు తమ పోరు కొనసాగుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇందుకోసం పశ్చిమ దేశాలు తమకు ఆయుధాలను పంపిస్తున్నాయని తాజాగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని