SpaceX: ఉక్రెయిన్‌ భారం మోయలేము.. పెంటగాన్‌కు స్టార్‌లింక్‌ లేఖ..!

ఉక్రెయిన్‌ దళాలకు ఇంటర్నెట్‌ మరింత కష్టం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో మౌలిక వసతులు దెబ్బ తిన్న ఆ దేశానికి ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది.

Published : 14 Oct 2022 21:49 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌ దళాలకు ఇంటర్నెట్‌ మరింత కష్టమయ్యే అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో మౌలిక వసతులు దెబ్బ తిన్న ఆ దేశానికి ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. రష్యాపై పోరాటంలో ఆ దేశ సైన్యానికి, ప్రజలకు ఇది కీలక వనరుగా మారింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఇప్పటి వరకు దాదాపు 20,000 స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ యూనిట్లను విరాళంగా ఇచ్చింది. ఉక్రెయిన్‌ కోసం దాదాపు 80 మిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు ఇటీవల ఎలాన్‌ మస్క్‌ తన ట్విటర్‌లో వెల్లడించారు. ఏడాది చివరి నాటికి ఈ ఖర్చు 100 మిలియన్‌ డాలర్లను దాటేస్తుందని పేర్కొన్నాడు. 

ఈ నేపథ్యంలో గత నెల స్పేస్‌ఎక్స్‌ నుంచి పెంటగాన్‌కు వెళ్లిన ఓ లేఖను అమెరికా పత్రిక సీఎన్‌ఎన్‌ వెలుగులోకి తెచ్చింది. తమ స్వచ్ఛంద సాయం ముగింపునకు వచ్చిందని.. పెంటగాన్‌ ప్రతినెలా పదుల మిలియన్ల డాలర్లను వెచ్చిస్తేనే సర్వీసుల కొనసాగింపు సాధ్యమవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌కు స్టార్‌ లింక్‌ సేవలకు నిధుల బాధ్యతలను పెంటగాన్‌ తీసుకోవాలని కోరింది. ఈ ఏడాది మిగిలిన సమయానికి 120 మిలియన్‌ డాలర్లు ఖర్చుకానుండగా.. వచ్చే 12 నెలలకు 400 మిలియన్‌ డాలర్లకు పైగా అవుతుందని అంచనావేసింది. ‘‘ఉక్రెయిన్‌కు ఇక టర్మినల్స్‌ విరాళం ఇచ్చే స్థితిలో మేము లేము. ప్రస్తుతం ఉన్న వాటికి నిర్వహణకు ఎన్నాళ్లు నిధులు వెచ్చిస్తామో చెప్పలేము’’ అని స్పేస్‌ ఎక్స్‌ గవర్నమెంట్ సేల్స్‌ విభాగం డైరెక్టర్‌ పెంటగాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు ఇటీవల మస్క్‌ ఓ శాంతి ప్రణాళికను ప్రతిపాదించి విమర్శల పాలయ్యారు. తన శాంతి ప్రణాళికలో భాగంగా పలు ప్రతిపాదనలతో ట్వీట్లు చేశారు. ‘1) రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలి. ఒకవేళ ప్రజల తీర్పు ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాన్ని వీడాలి. 2) 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. 3) ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి’ అని ట్విటర్లో ఓటింగ్‌ పెట్టారు. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన మరిచిపోక ముందే తాజాగా స్టార్‌ లింక్‌ లేఖ వెలుగుచూడటం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని