Modi: ఉక్రెయిన్‌ యుద్ధంలో ఎవ్వరూ గెలవలేరు.. అందరిదీ ఓటమే..!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో ప్రతిఒక్కరు నష్టపోవడం తప్పితే ఎవ్వరూ విజయం సాధించలేరని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 02 May 2022 22:24 IST

జర్మనీ ఛాన్స్‌లర్‌తో ప్రధాని మోదీ భేటీ

దిల్లీ: ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో ప్రతిఒక్కరు నష్టపోవడం తప్పితే ఎవ్వరూ విజయం సాధించలేరని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభ ముగింపుకు చర్చలు ఒక్కటే పరిష్కార మార్గమన్న మోదీ.. భారత్‌ శాంతిని మాత్రమే కోరుకుంటోందని ఉద్ఘాటించారు. యుద్ధాన్ని ముగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్స్‌లర్‌తో భేటీ సమయంలో ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఈ విధంగా మాట్లాడారు.

మూడు రోజుల యూరప్‌ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో కలిసి భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు వ్యక్తిగతంగా చర్చించారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేసిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్.. భారత్‌ తమకు కీలక భాగస్వామి అన్నారు. ఇక కొన్ని శక్తివంతమైన దేశాల మధ్య బంధాలే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించలేవన్న ఆయన.. అనేక దేశాల మధ్య సంబంధాలు ముఖ్యమన్న వాస్తవాన్ని అన్ని దేశాలు గుర్తు ఎరగాలని అన్నారు. ఈ సందర్భంగా జర్మనీలో జరిగే జీ-7 సదస్సుకు ప్రధాని మోదీని ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానించారు.

ఇదిలాఉంటే, మంగళవారం డెన్మార్క్‌ చేరుకోనున్న మోదీ.. రెండో భారత్‌-నార్డిక్‌ సదస్సులో డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. డెన్మార్క్‌ నుంచి భారత్‌ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ని ప్రధాని మోదీ కలవనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని