Nasa: నేడు పసిఫిక్‌ సముద్రంలో పడనున్న ఒరియన్‌ క్యాప్సుల్‌..

నాసా(NASA) చేపట్టిన జాబిల్లి యాత్ర చివరి దశకు చేరింది. నేడు ఒరియన్‌(Orion) స్పేస్‌ క్యాప్సుల్‌ పసిఫిక్‌ సముద్రంలో పడనుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.40 సమయంలో ఇది సముద్రంలో పడుతుందని అంచనావేశారు.

Updated : 11 Dec 2022 13:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాసా(NASA) చేపట్టిన జాబిల్లి యాత్ర చివరి దశకు చేరింది. నేడు ఒరియన్‌(Orion) స్పేస్‌ క్యాప్సుల్‌ పసిఫిక్‌ సముద్రంలో పడనుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.40 సమయంలో ఇది సముద్రంలో పడుతుందని అంచనా వేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి సమీపానికి వెళ్లి వచ్చిన స్పేస్‌ క్యాప్సుల్‌ సముద్రంలో పడనుంది. గతంలో అపొలో 17 ప్రాజెక్టులో చివరిసారిగా సిబ్బందితో ఉన్న క్యాప్సుల్‌ భూమిని చేరుకొంది. గతం వారం ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్లు శక్తిమంతమైన కదలికలతో దిశను మార్చాయి. దీంతో ఇది చంద్రుడి వైపు నుంచి భూమి వైపు కదలడం మొదలైంది. గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఇది శబ్దవేగం కంటే 32 రెట్లు అధికం. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత టాప్‌ స్పీడ్‌ను అందుకుంటుంది.

భూ వాతావరణంలోకి రాగానే ఒరియన్‌ (Orion) చుట్టూ 3,000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పుట్టుకొస్తుందని అంచనా వేస్తున్నారు. దీని చుట్టూ అమర్చిన ఉష్ణ రక్షణ కవచాలను ఈ సమయంలో పరీక్షించనున్నారు. ఇవి విజయవంతంగా పనిచేస్తే.. భవిష్యత్తులో వ్యొమగాములకు ఒరియన్‌ (Orion) నమ్మకమైన స్పేస్‌  క్యాప్సుల్‌గా అవతరిస్తుంది. ‘‘హీట్‌ షీల్డ్‌ అత్యంత ముఖ్యమైన పరికరం. ఇది స్పేస్‌ క్రాఫ్ట్‌, లోపల ఉన్న వ్యోమగాముల రక్షణకు  చాలా కీలకం. అందుకే అది పనిచేయడం చాలా అవసరం’’ అని ఆర్టెమిస్‌(artemis 1) మిషన్‌ మేనేజర్‌ మైక్‌ సారఫిన్‌ పేర్కొన్నారు.

ఒరియన్‌ (Orion) క్యాప్సుల్‌ను  2014లో పరిశీలించారు. అప్పట్లో కొంచెం తక్కువ ఒత్తిడితో దీని పరీక్ష జరిగింది. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో దీని హీట్‌షీల్డ్‌ సత్తా తెలియనుంది. ఇది కిందకు దిగే సమయంలో దాదాపు 12 పారాచూట్లు వినియోగించనున్నారు. సముద్రంలో పడిన ఈ క్యాప్సుల్‌ను తీరానికి చేర్చేందుకు యూఎస్‌ఎస్‌ పోర్టుల్యాండ్‌ పసిఫిక్‌ సముద్రంలో సిద్ధంగా ఉంది. గతంలో  నిర్వహించిన అపోలో మిషిన్‌లో క్యాప్సుల్‌ను రికవరీ చేసే బాధ్యతను హెలికాప్టర్లు చూసుకొన్నాయి. కానీ, ఈ సారి భిన్నంగా యుద్ధనౌకను వాడుతున్నారు. 

ఈ ప్రయోగం విజయవంతమైతే 2024లో ఆర్టెమిస్‌-2 యాత్రను నాసా(NASA)నిర్వహిస్తుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే కానుంది. 2025లో ఆర్టెమిస్‌-3 జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనున్నారు. ఒరాయన్‌ తొలుత చంద్రుడి కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమవుతుంది. అప్పుడు ఒరాయన్‌లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూ కక్ష్యలోని ‘డిపో’ నుంచి స్టార్‌షిప్‌నకు ఇంధనం అందుతుంది. తర్వాతి దశలో ‘గేట్‌వే’ పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా(NASA) ఏర్పాటు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని