Pakistan: పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్‌

పాకిస్థాన్‌ (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) కుమార్తె మరియం నవాజ్‌ బాధ్యతలు స్వీకరించారు.

Published : 26 Feb 2024 19:31 IST

లాహోర్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ (50) ఎన్నికయ్యారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ (Nawaz Sharif) కుమార్తె అయిన  మరియం.. జనాభాపరంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్‌ ప్రావిన్సు సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (PML-N) ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పంజాబ్‌ అసెంబ్లీలో ఓటింగ్‌ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మద్దతు కలిగిన సన్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ (SIC) చట్టసభ సభ్యులు వాకౌట్‌ చేయడంతో పీఎంఎల్‌ఎన్‌ తరఫున మరియం (Maryam Nawaz) విజయం ఖాయమైంది. అనంతరం గవర్నర్‌ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఆమె (Maryam Nawaz) ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి నవాజ్‌ షరీఫ్‌, బాబాయ్‌ షెహబాజ్‌ షరీఫ్‌ల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

‘దేశ చరిత్రలో మొదటిసారి పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఓ మహిళ ఎన్నికయ్యారు. పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా మరియం నవాజ్‌ షరీఫ్‌ రికార్డు సృష్టించారు’ అని పేర్కొంటూ పీఎంఎల్‌ఎన్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మరియం మాట్లాడుతూ.. తన తండ్రి (నవాజ్‌ షరీఫ్‌) గతంలో కూర్చున్న స్థానంలో తాను కూర్చోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా నాయకత్వం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించిన ఆమె.. ఎవరిపైనా తాను ప్రతీకారం తీర్చుకోనని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని