Gaza conflict: విజయానికి అడుగు దూరంలో ఉన్నాం - నెతన్యాహు

గాజా పోరులో విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని.. బందీలందర్నీ విడిచిపెట్టే వరకూ హమాస్‌తో సంధి ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు.

Published : 07 Apr 2024 22:02 IST

జెరుసలేం: గాజాలో కొనసాగుతున్న పోరులో (Israel Hamas conflict) తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) పేర్కొన్నారు. బందీలందర్నీ విడిచిపెట్టే వరకూ సంధి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో ప్రధాని నెతన్యాహు ఈ విధంగా స్పందించినట్లు సమాచారం.

‘విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం. ఇప్పటివరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో బెంజమిన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్‌ రికార్డు.. దీర్ఘాయుష్షుకు ‘సీక్రెట్‌’ అదేనట!

‘ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్‌ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని స్పష్టం చేశారు. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు.

ఇదిలాఉంటే, హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌.. ఆరు నెలలుగా వాటిని కొనసాగిస్తోంది. గాజాలో అనేక ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ఈ క్రమంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులతోపాటు సాధారణ పాలస్తీనీయన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్‌ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు