Niagara Falls: శాంతించని మంచుతుపాను.. గడ్డకట్టిన నయాగరా జలపాతం

అమెరికాలో హిమపాతం ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. బఫెలో ప్రాంతం ఇంకా మంచుదుప్పటి కిందే ఉండిపోయింది. 

Updated : 28 Dec 2022 16:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో మంచు తుపాను తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. బఫెలో ప్రాంతం మంచులో కూరుకుపోయింది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనావేస్తున్నారు. మిలిటరీ పోలీసులు చాలా చోట్ల డ్రైవింగ్‌ బ్యాన్‌ను విధించారు. పశ్చిమ న్యూయార్క్‌లో మరో అంగుళం మందాన మంచు కురిసినట్లు నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ పేర్కొంది. బఫెలో ప్రాంతంలో క్రిస్మస్‌ ముందు మొదలైన హిమపాతం.. ఆ తర్వాత తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా ఇక్కడ 50 అంగుళాల కంటే అధికంగా మంచుపడింది. చాలా చోట్ల కార్లలో, ఇళ్లలో, మంచు దిబ్బల్లో ప్రజలు చనిపోతున్నారు. ఆండెల్‌ టేలర్‌ అనే 22 ఏళ్ల యువతి బఫెలోలో ఒక కారులో చిక్కుకుపోయింది. దాదాపు 18 గంటలపాటు ఆమె చలిలోనే ఉండటంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్టు చేసింది. దీనిలో ఆమె కారు పూర్తిగా మంచులో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. బఫెలో ప్రాంతంలో 1977లో వచ్చిన మంచు తుపాను కంటే ఇది మరింత తీవ్రమైందిగా భావిస్తున్నారు. అప్పట్లో మంచుతుపానుకు 29 మంది చనిపోగా.. ఇప్పుడు మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా. 

అమెరికాలో ఇటీవల ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే దిగువకు పడిపోవడంతో నయాగరా జలపాతం గడ్డకట్టింది. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా మరికొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతూనే ఉంది.  ఈ జలపాతం నుంచి ప్రతి సెకన్‌కు 3,160 టన్నుల నీరు కిందకు పడుతుంటుంది. ఈ నీరు సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని