Niger crisis: నైగర్‌ సంక్షోభం.. తమ పౌరులను తరలించనున్న ఫ్రాన్స్‌!

సైన్యం తిరుగుబాటుతో ఆఫ్రికా దేశం నైగర్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అక్కడ నివాసం ఉంటున్న తమ పౌరులను తరలించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

Published : 01 Aug 2023 14:39 IST

నియామి: పశ్చిమ ఆఫ్రికా (West Africa)లోని నైగర్‌ (Niger)లో అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌ (Mohamed Bazoum)కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు (Military Coup) చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూలదోసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇటీవల రాజధాని ‘నియామి’లో సైనిక ప్రభుత్వ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో తమను పాలించిన ఫ్రాన్స్‌ (France)పై మండిపడుతూ.. ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయానికి నిప్పంటించారు. ఈ పరిణామాల మధ్య ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నైగర్‌లో నివాసం ఉంటున్న ఫ్రాన్స్‌ పౌరులను తరలించేందు (Evacuation)కు సిద్ధమైంది. ఈ మేరకు అక్కడి రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

నైగర్‌లో ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయానికి నిప్పు

‘నైగర్‌లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఇటీవలే మన దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. గగనతలం మూసివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఫ్రాన్స్‌ పౌరులను, ఐరోపావాసులను ఇక్కడినుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. నియామి నుంచి విమానాల ద్వారా ఈ తరలింపు ప్రక్రియను నేడు ప్రారంభిస్తాం’ అని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం, తమ దేశ ప్రయోజనాలపై దాడులను ఉపేక్షించబోమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ పౌరులు, సైన్యం, రాయబారులు, ఫ్రాన్స్‌ అధికారులపై ఎవరైనా దాడికి పాల్పడితే తక్షణం ప్రతిస్పందనను చవిచూస్తారని హెచ్చరించారు. ఈ పరిణామాల నడుమ పౌరుల తరలింపు ప్రక్రియ చేపడుతున్నట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని