North Korea: సరిహద్దుల్లో టెన్షన్‌.. సైన్యాన్ని దించిన కిమ్‌!

ఉత్తర కొరియా తన సరిహద్దుల్లో గస్తీ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.

Published : 27 Nov 2023 14:47 IST

సియోల్‌: ఉత్తర కొరియా (North Korea) తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వేళ.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా (South Korea)ల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి! 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం సరిహద్దులో తొలగించిన గస్తీ కేంద్రాల (Guard Posts)ను ఉత్తర కొరియా పునరుద్ధరిస్తున్నట్లు సియోల్‌ ఆరోపించింది. సైన్యంతోపాటు భారీఎత్తున ఆయుధాలనూ మోహరించినట్లు పేర్కొంది. సైనిక ఘర్షణలను తగ్గించేందుకుగానూ 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు గతంలో తమ సరిహద్దుల్లో 11 చొప్పున ‘గార్డు పోస్ట్‌’లను తొలగించాయి.

ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా.. 2018 నాటి ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపేస్తున్నట్లు దక్షిణ కొరియా ఇటీవల ప్రకటించింది. దీన్ని కనీస రక్షణ చర్యగా పేర్కొంటూ.. తమ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్‌లో ఎగురుతాయని తెలిపింది. దీన్ని ఉత్తర కొరియా తప్పుబట్టింది. ఇకపై ఆ ఒప్పందానికి తామూ కట్టుబడి ఉండబోమని తెలిపింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గస్తీ కేంద్రాల పునరుద్ధరణ, కందకాల నిర్మాణం వంటి పనులను గుర్తించినట్లు ద.కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఉత్తర కొరియా అక్కడ సైన్యాన్ని, భారీ ఆయుధాలను మోహరించినట్లు గుర్తించామని చెప్పింది.

రాకెట్‌ దశను గాల్లోనే పేల్చేసిన ఉ.కొరియా.. ఎందుకంటే..?

ఈ పరిణామాల నడుమ సరిహద్దుల్లో ఉత్తర కొరియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దృఢమైన సంసిద్ధతను కొనసాగించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దీన్ని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రెచ్చగొట్టే చర్యగా పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని