Pakistan: అప్పుల ఊబిలో పాక్‌.. కోట్లు గడించిన ఆర్మీ చీఫ్‌ బజ్వా

పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్‌ ఫోకస్‌ అనే సంస్థ ఈ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. గత ఆరేళ్లలో ఆయన కుటుంబం సంపద అమాంతం పెరిగినట్లు కథనాలు వస్తుండటం కలకలం రేపుతోంది.

Updated : 21 Nov 2022 12:11 IST

ఇస్లామాబాద్‌: అప్పుల కుప్పలు నానాటికీ పెరుగుతూ పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుండగా.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్ కమర్‌ జావేద్‌ బజ్వా రూ. కోట్లు గడిస్తున్నారట. గత ఆరేళ్లలో ఆయన కుటుంబం సంపద అమాంతం పెరిగినట్లు తాజా కథనం ఒకటి బయటికొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఆర్మీ చీఫ్‌గా బజ్వా పదవీకాలం ముగియనున్న సమయంలో ఈ వార్తలు బహిర్గతమవడం దేశంలో కలకలం రేపుతోంది.

బజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్‌ ఫోకస్‌ అనే సంస్థ ఈ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ సంస్థలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ జర్నలిస్టు దీన్ని బయటపెట్టారు. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు దేశ, విదేశాల్లో రూ.కోట్ల విలువైన వ్యాపారాలను ప్రారంభించారని, లగ్జరీ ఆస్తులను కొనుగోలు చేశారని ఆ కథనం వెల్లడించింది. ఇస్లామాబాద్‌, కరాచీల్లో కమర్షియల్‌ ప్లాజాలు, ప్లాట్లు.. లాహోర్‌లో ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని వీరు కొనుగోలు చేశారని పేర్కొంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం.. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తులు, వ్యాపారాల విలువ 12.7 బిలియన్‌ పాకిస్థానీ రూపాయలకు పైనే (అమెరికా కరెన్సీలో దాదాపు 56 మిలియన్‌ డాలర్లు) ఉంటుందని సదరు కథనం వెల్లడించింది.

2015లో బజ్వా సతీమణి అయేషా అంజద్‌ తన ఆస్తుల విలువను రూ.సున్నాగా ప్రకటించారు. అయితే ఒక్క ఏడాదిలోనే అంటే 2016లో ఆమె ఆస్తులు రూ.220కోట్లకు చేరడం గమనార్హం. అటు బజ్వా కోడలు మహనూర్‌ సాబిర్‌ ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి. 2018 నవంబరులో బజ్వా కుమారుడితో మహనూర్‌ వివాహం జరిగింది. పెళ్లికి ముందు సున్నాగా ఉన్న మహనూర్‌ ఆస్తులు.. వివాహమైన వారానికే రూ.127కోట్లకు పెరిగాయని ఫ్యాక్ట్‌ ఫోకస్‌ కథనం తెలిపింది. పాక్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయిన బజ్వా మరికొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న సమయంలో ఈ కథనం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆదివారం ఈ కథనం బయటకు రాగానే.. పాకిస్థాన్‌లో ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని