Missile Fire: భారత్‌ స్పందనపై పాక్‌ అసంతృప్తి.. సంయుక్త విచారణ జరపాలని డిమాండ్

పాకిస్థాన్‌లో క్షిపణి కూలిన విషయంలో భారత్‌ స్పందనపై ఆ దేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన అంశంపై భారత్‌ అసంపూర్తిగా స్పందించిందని పేర్కొంది.......

Published : 13 Mar 2022 01:39 IST

ఇస్లామాబాద్‌: ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన క్షిపణి పాకిస్థాన్‌ భూభాగంలో కూలిన ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది. అయితే భారత్‌ స్పందనపై పాక్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన అంశంపై భారత్‌ అసంపూర్తిగా స్పందించిందని పేర్కొంది. భారత్ వ్యూహాత్మక ఆయుధాల నిర్వహణలో లొసుగులు, సాంకేతిక లోపాలను ఈ ఘటన ఎత్తిచూపుతోందని పాక్‌ విదేశాంగ కార్యాలయం ఆరోపించింది. భారత్‌ పేర్కొన్నట్లుగా అంతర్గత విచారణ సరిపోదని.. వాస్తవాల నిగ్గుతేల్చేందుకు సంయుక్త విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

అంతకుముందు ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం మన దౌత్యాధికారిని గురువారం రాత్రి పిలిపించుకొని తీవ్ర నిరసన తెలిపింది. పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. భారత భూభాగం నుంచి తమ గగనతలంలోకి సూపర్‌ సోనిక్‌ వేగంతో వస్తువు ఒకటి వేగంగా దూసుకొచ్చి కూలిపోయిందని, దీని వల్ల పౌరుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని పాకిస్థాన్‌ ఆరోపించింది.

‘మార్చి 9వ తేదీ సాయంత్రం 6.43గం.లకు భారత్‌లోని సూరత్‌గఢ్‌ నుంచి సూపర్‌ సోనిక్‌ వేగంతో వస్తువు ఒకటి పాకిస్థాన్‌ గగనతలంలోకి దూసుకొచ్చింది. అదే రోజు సాయంత్రం 6.50గం.ల సమయంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఖానేవాల్‌ జిల్లా పరిధి మియాన్‌ చున్ను నగరం సమీపంలో కూలిపోయింది. దీనివల్ల పౌరుల ఆస్తులకు నష్టం కలిగింది. ఈ ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాం. ఇటువంటి వాటి వల్ల ఆకాశ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలు ప్రమాదాలకు గురవుతాయి’ అని ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని