Pakistan: పాకిస్థాన్‌ పరిస్థితి కష్టమే.. ఐఎంఎఫ్‌ తాజా నివేదిక

పాక్‌ ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఐఎంఎఫ్‌ ప్యాకేజీ మంజూరైనా.. ఇప్పట్లో నిధుల కొరత తప్పేట్లు లేదు.  

Updated : 19 Jul 2023 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్: రానున్న ఎన్నికలు, ఇప్పటికే అంగీకరించిన ప్యాకేజీతో సంబంధం లేకుండా పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం పడొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఓ నివేదిక ఇచ్చిందని పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. ‘‘పాక్‌లో ఉన్న చెల్లింపు సమస్యల ఒత్తిడిని దృష్టిలోపెట్టుకొని చూస్తే.. ఇప్పటికే అంగీకరించిన ప్యాకేజీ కాకుండా కూడా నిరంతర సర్దుబాట్లు, రుణదాతల సాయం అవసరం’’ అని ఆ సంస్థ 120 పేజీల నివేదికలో వెల్లడించింది. 

పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ గవర్నర్‌ జమీల్‌ అహ్మద్‌  సంతకం చేసిన ఆర్థిక, ద్రవ్య విధానాల ఒప్పందం ఆధారంగా ఐఎంఎఫ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. పాక్‌ ఆర్థిక సమస్యలు సంక్లిష్టం, బహుముఖంగా ఉన్నాయని వీటి కారణంగా దేశానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. 

‘‘పాకిస్థాన్‌కు కొంతకాలం పాటు విధానాల సవరణ, చెల్లింపుల సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి మరో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరముంది’’ అని  సదరు నివేదికలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించింది. ఇప్పటికే అంగీకరించిన నిబంధనలు అనుసరించడం, బయటి నుంచి రుణదాతలు అందడం చాలా అవసరం. ఆర్థిక  ముప్పును తప్పించుకొని.. స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిలకడగా ఐఎంఎఫ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని సూచించింది.

పాక్‌ ఆర్థిక కష్టాలను తప్పించుకోవడానికి ఆస్తుల అమ్మకానికి పెట్టింది. ఇటీవల ఇస్లామాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఔటు సోర్సింగ్‌కు ఇచ్చేసింది. అంతేకాదు.. కరాచీ, లాహోర్‌లోని విమానాశ్రయాలకు చెందిన కీలక భూములను కూడా 25 ఏళ్ల లీజుకు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ రుణాల చెల్లింపులకు కూడా నిధులు లేకపోవడంతో ఐఎంఎఫ్‌ 3 బిలియన్‌ డాలర్ల  బెయిలౌట్‌ ప్యాకేజీకి అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని