Prince Harry: ఫోన్‌ హ్యాకింగ్‌ కేసు.. తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్‌ హ్యారీ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) కోర్టు విచారణకు హాజరై సాక్ష్యమిచ్చారు. ఆ సంస్థ కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో న్యాయస్థానానికి వినిపించారు.

Published : 06 Jun 2023 15:33 IST

లండన్‌: బ్రిటన్‌ (Briatin) రాజకుటుంబం (Royal Family) చరిత్రలోనే ఓ కొత్త పరిణామం. 130 ఏళ్లలో తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. ఫోన్‌ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా కింగ్‌ ఛార్లెస్‌ 3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.

బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌ (Mirror Group Newspapers).. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్‌ హ్యాకింగ్‌ (phone hacking case) ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై లండన్‌ కోర్టులో విచారణ చేపట్టగా.. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

ప్రస్తుతం తన భార్య మేఘన్‌ మర్కెల్‌, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆయన సోమవారం లండన్‌ చేరుకున్నారు. ఈ ఉదయం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్‌ గ్రూప్‌ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో హ్యారీ (Prince Harry) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడటమే గాక.. 1996 - 2010 మధ్య ప్రైవేటు ఇన్విస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్‌ గ్రూప్‌ (Mirror Group) తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తెలిపారు. ఇలా చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్‌ను ప్రచురించినట్లు హ్యారీ కోర్టుకు వివరించారు.

వాస్తవానికి ఈ కేసులో ప్రిన్స్‌ హ్యారీ సోమవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా.. ఆయన రాలేదు. జూన్‌ 4న ఆయన కుమార్తె ప్రిన్సెస్‌ లిలిబెత్‌ పుట్టినరోజు కావడంతో లాస్‌ఏంజిల్స్‌ నుంచి ఆయన ఆలస్యంగా బయల్దేరారని హ్యారీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా.. ఈ కేసులో మిర్రర్‌ గ్రూప్‌ తరఫు న్యాయవాదులు హ్యారీని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో హ్యారీని కోర్టులో ప్రశ్నించనున్నట్లు సమాచారం.

గతంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ VII కూడా..

కాగా.. బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్‌ కేసులోనూ ఇంగ్లీష్‌ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఈ రెండు కూడా ఆయన రాజు కాకముందే జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని