Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!

ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి షాక్‌ గురిచేసింది. తీవ్రంగా గాయాలపాలైన రష్దీ ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు.

Updated : 13 Aug 2022 13:50 IST

న్యూయార్క్‌: ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి షాక్‌కు గురిచేసింది. తీవ్రంగా గాయాలపాలైన రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. ఈ దాడిలో చేతుల్లోని నరాలు తెగిపోయాయని.. ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించారు. 

శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్‌లో వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతోన్న రష్దీ వద్దకు ఓ వ్యక్తి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. 20 సెకన్ల వ్యవధిలోనే 10-15 సార్లు కత్తిపోట్లు పొడిచారని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. మొదట ఇందంతా ఒక స్టంట్ అని భావించామన్నారు. ‘దుండగుడు నల్లని దుస్తులు ధరించి, నలుపు రంగు మాస్క్‌ పెట్టుకొని వేదికిపైకి దూసుకొచ్చాడు. ఈ రచయిత చుట్టూ ఇంకా వివాదాలున్నాయని చూపించేందుకు ఓ స్టంట్ చేస్తున్నారని మొదట అనుకున్నాం. కానీ కొన్నిసెకన్లలో అది నిజమైన దాడి అని అర్థమైంది. 20 సెకన్లలో 10 నుంచి 15 సార్లు ఆయన్ను పొడిచాడు’ అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కొన్ని గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన ఒక కంటిని కోల్పోనున్నట్లు తెలుస్తోంది. పొత్తి కడుపులో కత్తిపోటు కారణంగా కాలేయం తీవ్రంగా దెబ్బతిందని బుక్‌ ఏజెంట్‌ చెప్పారు.

 

పోలీసుల అదుపులో దుండగుడు.. రష్దీపై దాడికి పాల్పడిన వ్యక్తి పేరు హాది మతార్‌. అతడు న్యూజెర్సీకి చెందిన వ్యక్తని గుర్తించారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

దాడిని ఖండించిన అమెరికా.. ఈ రచయితపై జరిగిన దాడిని శ్వేతసౌధ ప్రతినిధి ఖండించారు. ‘ఇది భయానకమైనది. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను కాపాడుకునేందుకు తక్షణమే స్పందించిన పౌరులు, సిబ్బందికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

స్పందించిన శశిథరూర్‌.. రష్దీపై జరిగిన దాడి షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గాయాల నుంచి కోలుకొని, తిరిగి మామూలు మనిషి కావాలని ఆకాక్షించారు. సృజనాత్మక వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేకపోతే.. అది నిజంగా విచారకరమని వ్యాఖ్యానించారు. 

1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్‌ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు తరలివెళ్లారు. రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ (Midnight Children) నవలకు 1981లో ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ దక్కడంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’ (The Satanic Verses) నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరుస్తోందని పేర్కొంటూ 1988 నుంచి ఇరాన్‌లో ఈ నవలను నిషేధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని