Biden: బైడెన్‌కు ఆ విషయాలూ గుర్తులేవు.. కీలక నివేదికలో సంచలన ఆరోపణలు!

Biden: బైడెన్‌పై స్పెషల్‌ కౌన్సిల్ హుర్‌ జరిపిన విచారణ నివేదిక అనేక ఆరోపణలు చేసింది. బైడెన్‌ జ్ఞాపకశక్తి సరిగా లేదని.. దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను ఆయన బహిర్గతం చేశారని పేర్కొంది.

Updated : 09 Feb 2024 10:54 IST

వాషింగ్టన్‌: వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు కీలక నివేదిక వెల్లడించింది. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆయన ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నట్లు ఆరోపించింది. అయితే, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొనడం గమనార్హం. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు బైడెన్‌ సిద్ధమవుతున్న తరుణంలో ఈ నివేదిక రావడం డెమోక్రాట్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆయన జ్ఞాపకశక్తి, వయసుపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

కుమారుడి మరణ విషయాలూ గుర్తు లేవు..

81 ఏళ్ల వయసున్న బైడెన్‌ (Biden) జ్ఞాపకశక్తి చాలా ‘‘మసక’’గా, ‘‘మబ్బు’’గా, ‘‘తప్పు’’గా ఉందని నివేదిక పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి లేదని పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. బైడెన్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ రాబర్ట్‌ హుర్‌ ఈ నివేదికను రూపొందించారు.

రహస్య సమాచారం లీక్‌..

అఫ్గానిస్థాన్‌కు సంబంధించిన అనేక రహస్య పత్రాలు బైడెన్‌కు (Biden) చెందిన ప్రదేశాల్లో దొరికినట్లు నివేదికలో హుర్‌ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే ఆయన వాటిని దాచినట్లు పేర్కొన్నారు. కొంత సమాచారాన్ని ఆయన ఓ రచయితతోనూ పంచుకున్నట్లు ఆరోపించారు. అఫ్గాన్‌లో సైనిక బలగాల మోహరింపును పెంచే విషయంలో ఒబామాతో బైడెన్ విభేదించిన ఓ కీలక పత్రం లభ్యమైనట్లు వెల్లడించారు. అలాంటి మరికొన్ని పత్రాలూ దొరికినట్లు తెలిపారు.

నాలో ఎలాంటి లోపాలూ లేవు..

హుర్‌ నివేదికను బైడెన్ (Biden) తీవ్రంగా ఖండించారు. తన జ్ఞాపకశక్తిలో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడానికి తాను అత్యంత అర్హత కలిగిన వ్యక్తినని స్పష్టం చేశారు. హుర్‌ ఇంటర్వ్యూ చేసిన సమయంలో తాను ఓ అంతర్జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో తీరిక లేకుండా ఉన్నానని తెలిపారు. తన కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు మరణించారో హుర్‌కు సంబంధంలేని విషయమని.. అందుకే తాను ఆ విషయంపై సరిగా స్పందించలేదని వివరించారు. తాను ఎలాంటి రహస్య సమాచారాన్నీ ఇతరులతో పంచుకోలేదని చెప్పారు.

ఇందుకే బైడెన్‌పై విచారణ..

వాషింగ్టన్‌లోని ఆఫీసు స్పేస్‌లో బైడెన్‌ సిబ్బంది కొన్ని కీలక పత్రాలను గుర్తించటంతో 2023 జనవరిలో అటార్నీ జనరల్‌ మెర్రిక్‌ గార్లాండ్‌.. హుర్‌ను ప్రత్యేక కౌన్సిల్‌గా నియమించారు. ట్రంప్‌ హయాంలో అటార్నీగా పనిచేసిన ఆయన్ను బైడెన్‌ రహస్య పత్రాల కేసును విచారించాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధ్యక్షుడికి చెందిన పలు ప్రాంతాల్లో అనేక కీలక పత్రాల లభ్యమయ్యాయి. డెలావెర్‌లో బైడెన్‌ నివాసంలోని గ్యారేజ్‌లోనూ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బాక్సుల్లో వాటిని దాచి ఉంచినట్లు గుర్తించారు.

చర్యలు అవసరం లేదు..

అధ్యక్ష హోదాలో ఉన్న బైడెన్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామని నివేదిక అభిప్రాయపడింది. ఆయన కావాలనే కీలక పత్రాలను దాచి ఉండకపోవచ్చునని తెలిపింది. ఒకవేళ అలా చేసినా.. దాన్ని నిరూపించేందుకు ఆధారాలు చూపించటం కష్టమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు తాము సిఫార్సు చేయటం లేదని స్పష్టం చేసింది. పైగా అధ్యక్ష హోదాలో ఉన్న ఆయనకు ఎలాగూ నేరపూరిత విచారణ నుంచి రక్షణ ఉంటుందని గుర్తుచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని