North Korea: కిమ్ రాజ్యంలో ప్రాణాల మీదకు తెస్తోన్న ఆహార కొరత..!

కిమ్(KIM) రాజ్యంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. తీవ్ర ఆహార కొరతతో  అల్లాడిపోతున్నారని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. 

Published : 04 Mar 2023 18:09 IST

ప్యాంగ్యాంగ్‌: కరోనాతో సరిహద్దులు మూసివేత, కరవులు, వరదలతో ఉత్తర కొరియా(North Korea) మరో తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ ఆకలికేకలతో చావులు సంభవిస్తాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అరుదని, ఇది అక్కడి పరిస్థితిని తీవ్రతను వెల్లడిచేస్తోందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. 

ఇటీవల నాలుగురోజుల పాటు జరిగిన ప్లీనరీ సమావేశంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆహార కొరత సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయరంగంలో సమూలమార్పులకు ఆయన పిలుపునిచ్చారని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.  దీనిని పరిష్కరించకపోతే.. కిమ్ రాజ్యంలో అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాలతో కలిసి కొవిడ్‌ కారణంగా సరిహద్దుల మూసివేత పరిస్థితులను తీవ్రం చేసింది. ప్లీనరీ సమావేశం ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని చూపే ప్రయత్నం చేశారని పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో అక్కడ 10 మిలియన్ల మంది ప్రజలు పోషకాహార లోపం,ఆకలితో అలమటించారని యూఎన్‌ నివేదిక ఒకటి వెల్లడించింది. కిమ్ పాలనకు అత్యంత విశ్వాసంగా ఉండే ఆర్మీ కూడా క్షుద్భాదతో అలమటిస్తోంది. గత ఏడాది కొన్ని నెలల పాటు సైనికుల కుటుంబాలకు రేషన్ అందకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని