Ukraine Crisis: పుతిన్‌ ఆర్థిక బలం ఆమె..!

రష్యా పదేళ్ల వ్యవధిలోపలే రెండు యుద్ధాలు చూసింది. ఈ క్రమంలో అమెరికా సహా పశ్చిమ దేశాలు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి మాస్కోను అణచివేయాలని యత్నిస్తున్నాయి. కానీ, వాటన్నింటిని తట్టుకొని రష్యా నిలదొక్కుకొంది.

Published : 13 May 2022 02:35 IST

 రష్యాలో శక్తివంతమైన మహిళ ఎల్విరా నబియులీన

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రష్యా పదేళ్ల వ్యవధి లోపలే రెండు యుద్ధాలు చూసింది. ఈ క్రమంలో అమెరికా సహా పశ్చిమ దేశాలు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి మాస్కోను అణచివేయాలని యత్నిస్తున్నాయి. కానీ, వాటన్నింటిని తట్టుకొని రష్యా నిలదొక్కుకొంది. ఒక దశలో అమెరికా ఆర్థిక ఖడ్గమైన డాలర్‌తో తలపడేందుకు కూడా సిద్ధమైంది. అధ్యక్షుడు పుతిన్‌ వ్యూహాలకు తగినట్లు దేశ ఆర్థిక ప్రణాళికను తయారు చేసి.. దానిని పక్కాగా అమలు చేయడంలో క్రెమ్లిన్‌ బృందం ఇప్పటి వరకు సఫలమైంది. ఈ మొత్తం ప్రణాళికను ఓ మహిళే పర్యవేక్షిస్తోంది. కమ్యూనిజం వాసనలు పోని రష్యా ఆర్థిక వ్యవస్థను పశ్చిమ దేశాల పెట్టుబడి దారీ వ్యవస్థలతో కలిసి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేలా తీర్చిదిద్దిన ఘనత ఆమెదే. రష్యా సైనిక జనరళ్లు యుద్ధ భూమిలో మిశ్రమ ఫలితాలతో అపవాదులు మూటగట్టుకొంటున్నా.. పుతిన్‌ ఆర్థిక యుద్ధంలో మాత్రం దృఢంగా నిలబడేట్లు చేసిన ఘనత రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఎల్విరా నబియులీనకు దక్కుతుంది. 

ఎవరీ ఎల్విరా..?

ఎల్విరా 1986లో మాస్కో స్టేట్‌ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం 12ఏళ్లపాటు యూఎస్‌ఎస్‌ఆర్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ యూనియన్‌లో పనిచేశారు. ఆ తర్వాత రష్యా యూనియన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీలియస్ట్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత కొన్నాళ్లు స్బేర్‌ బ్యాంక్‌లో  ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేశారు. వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆమెను ది మినిస్ట్రీ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌లో ఫస్ట్‌ మినిస్టర్‌గా నియమించారు. నాటి నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ఎల్విరా కొనసాగుతూనే ఉన్నారు. 2012లో పుతిన్‌ మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టాక ఎల్విరాను క్రెమ్లిన్‌లో కీలకమైన సలహాదారుల బృందంలోకి తీసుకొన్నారు. మరుసటి సంవత్సరమే ఆమెను ది సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రష్యాకు గవర్నర్‌గా నియమించారు. ఈ ఏడాది మార్చి 18న మూడో సారి ఆమె పదవీకాలాన్ని పొడగించారంటే ఎల్విరా ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.  

రష్యా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ..

పదవి చేపట్టిన నాటి నుంచి తన పనితీరుతో ప్రపంచ బ్యాంకింగ్‌ రంగాన్ని ఎల్విరా మెప్పించారు. 2013 నుంచి 2017 వరకు రష్యా బ్యాంకింగ్‌ వ్యవస్థను తీర్చి దిద్దేందుకు నిర్మొహమాటంగా కఠిన చర్యలు తీసుకొన్నారు. ఈ కాలంలో రష్యాలో బలహీనంగా ఉన్న, దారి తెన్ను లేకుండా నడిపిస్తున్న 300లకు పైగా బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేశారు. ఇవి రష్యా బ్యాంకింగ్‌ రంగంలో మూడో వంతు సంస్థలకు సమానం. దీంతో మనీలాండరింగ్‌ ఇతర కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. క్రెమ్లిన్‌ సన్నిహతులైన ఓలిగార్క్‌ల బ్యాంకులు బలోపేతం కావడానికి ఈ చర్య ఉపయోగపడిందనే అపవాదు కూడా ఎదుర్కొన్నారు. 

ఇక ప్రభుత్వ జోక్యంతో రూబుల్‌ విలువను నిర్దేశించడాన్ని గణనీయంగా తగ్గించేశారు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రూబుల్‌ ట్రేడ్‌ అయ్యేలా చేశారు. ద్రవ్యోల్బణ కట్టడిపైనా ఆమె దృష్టిపెట్టారు. ఒక దశలో వడ్డీరేట్లను 17శాతానికి పెంచడానికి కూడా వెనుకాడలేదు. 

2014 ఓ పెను సవాలు..!

2014 సంవత్సరం ఎల్విరాకు ఓ పెనుసవాలుగా నిలిచింది.  అమెరికా, సౌదీ చమురు ఉత్పత్తిని భారీగా పెంచడంతో క్రూడ్‌ ధరలు పడిపోయాయి. చమురు ఆధారిత రష్యా ఆర్థిక వ్యవస్థను వణికించింది.  ఆ సంవత్సరం రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి పశ్చిమ దేశాల ఆంక్షల గురిలోకి వచ్చింది. చాలా రష్యా కంపెనీలను అమెరికా క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి బయటకు పంపారు. ఈ కంపెనీలకు భారీగా విదేశీ అప్పులు ఉండటం ప్రమాద ఘంటికలను మోగించింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ నుంచి వీలైనంతగా డాలర్లను వదిలించుకొనేందుకు చర్యలు చేపట్టారు. రష్యా కంపెనీలు, బ్యాంకులు డాలర్‌కు బందీలు కాకుండా చూసుకొన్నారు. రష్యా బ్యాంక్‌లకు ఉన్న 600 బిలియన్‌ డాలర్ల రిజర్వులను బంగారం, యూరో, చైనా రెన్మిన్‌బీ వైపు మళ్లించారు. ఫలితంగా రష్యా రిజర్వుల్లో డాలర్లు 40శాతం నుంచి 11శాతానికి పడిపోయాయి. 

ఉక్రెయిన్‌ యుద్ధంతో మరోసారి సవాళ్లు..

తాజాగా ఉక్రెయిన్‌పై యుద్ధ సమయంలో బ్యాంకుల విదేశీ రిజర్వులను స్తంభింప జేసినా.. తగినంత బంగారం, రెన్మిన్‌బీ కరెన్సీ అందుబాటులో ఉన్నాయి.  స్విఫ్ట్‌ పేమెంట్‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయడం, దేశీయ చెల్లింపు వ్యవస్థల ఆధారంగా క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు జరిగేలా చూడటం వంటి చర్యలు పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావాలను గణనీయంగా తగ్గించేశాయి.  కానీ, రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మూసుకుపోవడంతో మాంద్యంలోకి జారిపోయే ముప్పు పొంచి ఉంది. దీంతో వడ్డీ రేట్లను కొంత తగ్గించి ఆ ప్రభావం ప్రజలు, వ్యాపారాలపై వెంటనే పడకుండా చర్యలు తీసుకొన్నారు. దేశీయ కంపెనీలు దిగుమతి చేసుకొన్న వస్తువుల కంటే.. దేశీయంగా తయారైన వస్తువులనే వాడేలా చర్యలు తీసుకొంటున్నారు.

కీర్తికి కొదవలేదు..

2021లో ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళల్లో ఎల్విరా 60వ స్థానంలో నిలిచారు. 2015లో యూరోమనీ మ్యాగజైన్‌ ఆమెను సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించింది. 2017లో ది బ్యాంకర్‌ పత్రిక కూడా సెంట్రల్‌ బ్యాంకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించింది. 2018లో ఆమె అంతర్జాతీయ ద్రవ్యనిధిలో వార్షిక ప్రసంగం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని