Germany: జర్మనీలో 2300కుపైగా విమానాలు రద్దు!

వేతనాలు పెంచాలంటూ విమానాశ్రయ సిబ్బంది సమ్మెబాట పట్టడంతో జర్మనీలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 2300కుపైగా విమానాలు రద్దయ్యాయి. మూడు లక్షల ప్రయాణికులపై ఈ ప్రభావం పడింది.

Published : 18 Feb 2023 00:07 IST

బెర్లిన్‌: జర్మనీ(Germany)లో విమానాల రాకపోకలు స్తంభించాయి! తమ వేతనాలు పెంచాలంటూ విమానాశ్రయ సిబ్బంది సమ్మె(Strike) బాటపట్టడంతో.. శుక్రవారం వేలాది విమానాలు రద్దయ్యాయి. ఇక్కడి ఫ్రాంక్‌ఫర్ట్(Frankfurt), మ్యూనిక్‌, హాంబర్గ్‌, హనోవర్‌ సహా ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో సిబ్బంది 24 గంటల సమ్మెకు దిగారు. దీంతో విమానయాన సంస్థలు దాదాపు 2300కుపైగా విమానాలు రద్దు(Cancellation Of Flights) చేయాల్సి వచ్చింది. మూడు లక్షల మంది ప్రయాణికులపై ఈ సమ్మె ప్రభావం పడినట్లు జర్మనీ విమానాశ్రయాల సంఘం తెలిపింది. ప్రయాణికులు లేక విమానాశ్రయాల్లో కరోనా(Coronavirus) ఉద్ధృతి నాటి నిర్మానుష్య పరిస్థితులు కనిపించాయని సంఘం ప్రతినిధులు తెలిపారు.

స్థానిక ‘వెర్డి’ కార్మిక సంఘం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఒకవేళ వేతనాల పెంపు చర్చలు విఫలమైతే నిరసనలు మరింత తీవ్రమవుతాయని సంఘం ప్రతినిధులు ఓ వార్తాసంస్థకు చెప్పారు. ఇప్పటివరకు విమానాశ్రయాలు, ప్రజా రవాణా, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో చేపట్టిన సమ్మెలను.. చెత్త నిర్వహణ, ఆసుపత్రులకూ విస్తరిస్తామని తెలిపారు. పెరుగుతోన్న ఆహార, ఇంధన ధరలతో జర్మనీలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వేతనాల్లో 10.5 శాతం పెంపు లేదా ప్రస్తుత జీతంలో కనీసం 500 యూరోలు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు.. జర్మనీలో నేటినుంచి ప్రారంభం కానున్న 59వ మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌పైనా ఈ సమ్మె ప్రభావం పడింది. ఇందులో పాల్గొనేందుకు రొమేనియా విదేశాంగ మంత్రి మ్యూనిక్‌కు రావాల్సి ఉండగా.. విమానాల రద్దుతో ఆయన తొలుత ఆస్ట్రియాకు వెళ్లారు. అక్కడినుంచి మ్యూనిక్‌కు రోడ్డు మార్గంలో వస్తారని రొమేనియన్ రాయబార కార్యాలయ అధికారి తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు