Minor Students: పైశాచికం.. 15 మంది బాలురపై టీచర్ల అత్యాచారం

పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్స్‌లో 15 మంది విద్యార్థులపై ఇద్దరు టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

Updated : 20 Nov 2023 21:19 IST

లాహోర్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ (Pakistan Punjab) ప్రావిన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మతపరమైన విద్యా సంస్థలో చదువుతున్న 15 మంది మైనర్‌ విద్యార్థులపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి (Rape attempt) పాల్పడ్డారు. విషయం వెలుగులోకి రావడంతో శుక్రవారం వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను పంజాబ్ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఉస్మాన్‌ అన్వర్‌ సోమవారం వెల్లడించారు. విద్యార్థులంతా 10 నుంచి 12 ఏళ్ల లోపువారేనని ఆయన తెలిపారు.  మరోవైపు బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని, ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.

బాధిత విద్యార్థి ఒకరు తనకు జరిగిన ఘోరాన్ని తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పటిలాగే పాఠశాల దగ్గర దించుతుండగా అందులో చదువుతున్న ఓ విద్యార్థి తన తండ్రి ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకని ప్రశ్నించగా వెక్కివెక్కి ఏడుస్తూ విషయం చెప్పాడు. ఈ సమస్య తనొక్కడిదే కాదని, తన లాంటివారు చాలా మంది ఉన్నారని చెప్పడంతో వెంటనే ఆ తండ్రి పంజాబ్‌ పోలీసులను ఆశ్రయించాడు. పాఠశాలకు వెళ్లి విచారణ జరిపిన పోలీసులు... జరిగిన విషయాన్ని తెలుసుకొని నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. బాధితులైన 15 మంది విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. 

విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరగడం వాస్తవమేనని తేలింది. అంతేకాకుండా వాళ్ల శరీరాలపై పంటిగాట్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ చాకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మోహ్‌సిన్‌ నఖ్వీ స్పందించారు. బాధిత కుటుంబాలను న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నేరస్తులకు కఠిన శిక్షపడేలా చేయాలని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని