Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు మొదలయ్యాయ్‌.. యుద్ధం ముగిసేనా?

బెలారస్‌ వేదికగా ఉక్రెయిన్‌- రష్యా ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.

Updated : 28 Feb 2022 17:11 IST

ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు

కీవ్‌/మాస్కో: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ సోమవారం కీలక అడుగు పడింది. యుద్ధానికి తెరదించే దిశగా ఇరు దేశాల మధ్య కీలక చర్చలు మొదలయ్యాయి. బెలారస్‌ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఈ చర్చలకు ఇరుదేశాల ప్రతినిధులూ హాజరయ్యారు. రెండు దేశాల మధ్య చర్చలు మొదలైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ధ్రువీకరించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. రష్యా అధ్యక్ష కార్యాలయం సహా రక్షణ, విదేశాంగ శాఖకు చెందిన అధికారులు ఈ భేటీకి హాజరు కాగా.. ఉక్రెయిన్‌ నుంచి పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందే రష్యా, ఉక్రెయిన్‌లు తమ డిమాండ్లను స్పష్టంచేశాయి. తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేయగా.. తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఉక్రెయిన్‌ తేల్చి చెప్పింది. అలాగే, ఐరోపా యూనియన్‌లో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు. మరోవైపు, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్‌ భూభాగం బాంబులు, తుపాకీ మోతతో దద్ధరిల్లి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ చర్చల పురోగతిపై యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

4500 మంది రష్యా సైనికులు హతం: ఉక్రెయిన్‌ ప్రకటన

ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ నడుస్తుండటంతో రష్యా ఈరోజు దాడుల తీవ్రతను తగ్గించింది. ఉక్రెయిన్‌ నగరాల్లోకి ప్రవేశిస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులను స్థానిక ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి అడ్డుకొంటున్నారు. ఇప్పటివరకు 4500 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్టు ఉక్రెయిన్‌ మిలటరీ స్పష్టంచేసింది. అలాగే, రష్యా దాడిలో 350 మంది తమ పౌరులు మృతిచెందారని వెల్లడించింది. రష్యాను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిని తమ సైన్యం చేర్చుకుంటోంది. 

యుద్ధ రంగంలోకి బెలారస్‌ దూకుతుందా?

రష్యాకు మద్దతుగా బెలారస్‌ కూడా యుద్ధ రంగంలోకి దూకబోతుందంటూ అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రష్యా దళాలతో కలిసి పోరాడేందుకు బెలారస్‌ తమ  దళాల్ని ఉక్రెయిన్‌లోకి పంపుతోందని అమెరికా నిఘా అధికారి తెలిపారు. రష్యాకు మద్దతుగా నిలుస్తోన్న బెలారస్‌.. ఇప్పటివరకు యుద్ధంలో పాల్గొనలేదు. అయితే, ఆ దేశం యుద్ధంలోకి వస్తుందా? లేదా అన్నది రష్యా ఉక్రెయిన్‌ చర్చలపై ఆధారపడి ఉంటుందని నిఘా అధికారి తెలిపారు. ఉక్రెయిన్‌ ప్రతిఘటనతో రష్యా బలగాల దండయాత్ర చాలా కష్టంగా మారిందని అమెరికా విశ్వసిస్తోంది.  

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పలు ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. రష్యాపై ఆంక్షలు డోసును పెంచుతున్నాయి. తాజాగా రష్యా విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్టు యూరోపియన్‌ దేశాలు వెల్లడించాయి. 13 దేశాలు తమ విమానాలపై నిషేధం విధించడంపై స్పందించనున్నట్టు క్రెమ్లిన్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు