Zelenskyy: రష్యా దాడి తర్వాత.. మేం ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాం..!

తమ మీద తమకు తప్ప, ఈ ప్రపంచ మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అస్సలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భుభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. 

Updated : 18 Apr 2022 16:16 IST

కీవ్‌: తమ మీద తమకు తప్ప.. ఈ ప్రపంచం మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అస్సలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.

‘నేను ఈ ప్రపంచాన్ని నమ్మను. వారు చెప్పే మాటల్ని మేం నమ్మం. రష్యాతో యుద్ధం తీవ్రమైన తర్వాత.. మా పొరుగుదేశాలపై విశ్వాసం లేదు. ఇప్పుడు మాకున్న నమ్మకం ఒక్కటే.. మాపై, మా ప్రజలపై, మా బలగాలపై నమ్మకం ఉంది. ప్రపంచ దేశాలు మాటలతో కాకుండా చేతలతో మాకు మద్దతు ఇస్తాయని నమ్ముతున్నాం’ అని వెల్లడించారు.

అలాగే శాంతి చర్చల గురించి మాట్లాడుతూ..‘రష్యా నిర్దేశించిన నిబంధనల మధ్య మేం చర్చించడానికి సిద్ధంగా లేం. ఈ యుద్ధం ఖరీదు మా ప్రజలు. వారి హత్యలు. ఇదంతా ఎవరు చెల్లిస్తారు..? ఆ నష్టాన్ని భరించాల్సింది ఉక్రెయిన్ మాత్రమే. మేం పెను భారాన్ని మోస్తున్నాం. మాకు మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడతాం. రష్యన్ అల్టిమేటం కింద మాత్రమే మేం మాట్లాడాలా..? చర్చలు మంచివా కాదా తర్వాత సంగతి. అసలు మా పట్ల ఆ దేశం వైఖరే ఇక్కడ ముఖ్యం. ఇలా నిబంధనల కింద మాట్లాడటం అసాధ్యం’ అని స్పష్టం చేశారు.

డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా సైన్యంతో పోరాడేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ తూర్పు భాగాన్ని వదులుకోమని స్పష్టం చేశారు. ‘రష్యా డాన్‌బాస్‌ను ఆక్రమించుకోగలిగితే.. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి మళ్లీ ప్రయత్నించదని కాదు. అందుకే వారిని నిలువరించాలి. ఇది.. ఈ యుద్ధం తీరుతెన్నులను మార్చివేస్తుంది’ అని వెల్లడించారు.

ఉక్రెయిన్ సంక్షోభం.. ఐదోవంతు మంది పేదరికంలోకి..

ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ప్రపంచ జనాభాలో ఐదోవంతు కంటే ఎక్కువ మందికి పేదరికం, ఆకలి ముప్పుఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఉక్రెయిన్ విషాదం మనందరికీ కనిపిస్తోంది. కానీ ఆ యుద్ధం సరిహద్దును దాటి ప్రపంచంపై నిశ్శబ్ద దాడిని ప్రారంభించింది. దశాబ్దాలుగా చూడని విధంగా 1.7 బిలియన్ల ప్రజలకు ఆకలి, పేదరికం ముప్పు పొంచి ఉంది’ అని హెచ్చరించింది. ఈ యుద్ధం సరఫరా గొలుసుల్ని దెబ్బతీసిందని పేర్కొంది. 2022 ప్రారంభం నుంచి గోధుమ, మొక్కజొన్న ధరలు 30 శాతం పెరిగాయని, చమురు ధరలు 60 శాతం, గ్యాస్, ఎరువుల ధరలు రెండింతలయ్యాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు