Zelensky: పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు..జెలెన్‌స్కీకి గట్టి సమాధానం ఇచ్చిన రష్యా

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిపై రష్యా నుంచి అదేస్థాయిలో స్పందన వచ్చింది. 

Published : 21 Jan 2023 01:44 IST

దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు(World Economic Forum)లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఇంకా జీవించి ఉన్నారో..? లేదో..? తనకు కచ్చితంగా అర్థం కావడం లేదంటూ తీవ్రంగా మాట్లాడారు. ఆ సదస్సులో జరిగిన అల్పాహార కార్యక్రమంలో జెలెన్‌స్కీ మాట్లాడిన మాటలు.. సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. 

‘ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలో, దేని గురించి మాట్లాడాలో అర్థం కావడం లేదు. రష్యా అధ్యక్షుడు జీవించి ఉన్నారో లేదో నాకు కచ్చితంగా అర్థంకావడం లేదు. ఆయన జీవించి ఉన్నారా..? నిర్ణయాలు తీసుకుంటున్నారా..? నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం శాంతి చర్చల గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు..వాటిని ఎవరితో జరపాలో నాకు తెలియట్లేదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్‌కు చెందిన ఆన్‌లైన్ మీడియా సంస్థ ప్రచురించింది. 

ఈ వ్యాఖ్యలపై.. రష్యా వైపు నుంచి గట్టి సమాధానం వచ్చింది. ‘ఉక్రెయిన్‌, జెలెన్‌స్కీకి..రష్యా, పుతిన్‌ అతి పెద్ద  సమస్య అని ఇప్పుడు స్పష్టమైంది. రష్యా, పుతిన్‌ ఉనికిలో ఉండకూడదని ఆయన కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రష్యా ఉనికిలో ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే.. ఉక్రెయిన్‌కు అంత మంచిది’ అని బదులిచ్చింది. 

ఈ మధ్యకాలంలో బహిరంగ కార్యక్రమాలు, అలాగే వార్షిక మీడియా కార్యక్రమాన్ని పుతిన్‌ రద్దు చేసుకోవడాన్ని ఉద్దేశించి జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని