close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాలో కోట్లు కురిపించిన... అల్లం చాయ్‌!

కాస్త అల్లం దట్టించి చిక్కగా కాచిన వేడి వేడి చాయ్‌ను నోరారా జుర్రుకుని తాగందే చాలామందికి రోజు మొదలవదు. కొందరైతే ఎన్నిసార్లు తాగేస్తారో లెక్కే ఉండదు. మరి ఎన్నో సమస్యలకి ఉపశమనంగా పనిచేసే ఆ చాయ్‌కి చాలానే సీనుంది. అందుకే కాబోలు ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగి మనదేశానికి వచ్చిన బ్రూక్‌ ఎడ్డీ కూడా అల్లం చాయ్‌ తాగి దానిపైన మనసు పారేసుకుంది. దాంతో ఆ చాయ్‌ కిటుకును స్వయంగా తమ దేశంలో చూపుతూ కోట్లు గడిస్తోంది. ఆ అల్లం చాయ్‌ కబుర్లు మనమూ తెలుసుకుందామా!

చాలామందికి పొద్దుపొద్దున్నే చాయ్‌ తాగకపోతే రోజు గడవదు. ఇంకొందరికి మనసు బాగోకపోతే చాయ్‌... ఇంటికి చుట్టాలొస్తే చాయ్‌... దోస్తుని కలిస్తే చాయ్‌... ఇలా ప్రతి సందర్భంలోనూ భారతీయుల దినచర్యలో చాయ్‌ ఒక భాగమైపోయింది. అందుకే ఈ చాయ్‌ రకరకాల రుచుల్లో  మనకు దొరుకుతుంది. ఎన్ని దొరికినా డికాక్షన్‌లో కాస్త అల్లం దట్టించి... చిక్కటి పాలు కలిపి చక్కగా చేసుకునే అల్లం చాయ్‌కి మరే చాయ్‌ సాటి రాదంటే నమ్మండి. అలాంటి అల్లం చాయ్‌తోనే పేద్ద వ్యాపారవేత్త అయిపోయింది అమెరికాకు చెందిన బ్రూక్‌ ఎడ్డీ. అమెరికాలోని కొలరాడోలో పుట్టి పెరిగిన బ్రూక్‌ ఓ స్వచ్ఛంద సేవకురాలు. ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఉంటుంది. మనదేశంలో పేదలకు అండగా ఉండే స్వాధ్యాయ్‌ అనే స్వచ్ఛంద సంస్థ గురించి విన్న బ్రూక్‌ సదరు సంస్థకి తన వంతు సాయం చేయడానికి కొన్నేళ్ల క్రితం భారతదేశానికి వచ్చింది. సేవా గుణం మెండుగానే ఉన్న బ్రూక్‌ మాంచి ఫుడీ. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ఆహారాన్ని రుచి చూడటం అలవాటు. అందులో భాగంగానే మనదేశానికి వచ్చినపుడు పలు రాష్ట్రాల్లో దొరికే ప్రత్యేక పదార్థాలన్నిటినీ రుచి చూసింది. అలా మహారాష్ట్రలో కప్పుల కొద్దీ తాగిన అల్లం చాయ్‌కి మాత్రం ఫిదా అయిపోయింది. దాదాపు అక్కడ ఉన్న నాలుగేళ్లూ మూడుపూటలా చాయ్‌ రుచిని ఆస్వాదిస్తూనే గడిపింది. అలా అల్లం చాయ్‌పైన మనసు పారేసుకున్న బ్రూక్‌ కొన్నాళ్లకి స్వస్థలానికి వెళ్లిపోయింది. కానీ చాయ్‌ కోసం మనసు తెగ తహతహలాడిపోయేది. ఎంత ఖర్చు పెట్టినా ఏం లాభం ఏ కాఫీ షాపులోనూ ఆ రుచిని కనుగొనలేకపోయింది. దాంతో తనకు పరిచయం ఉన్న మరాఠీలతో మాట్లాడి అల్లం చాయ్‌ రుచి వెనక కిటుకును కనిపెట్టేసింది. పెరూ దేశంలో సేంద్రియ పద్ధతిలో అల్లాన్ని పెద్ద ఎత్తున పండిస్తారు. దానికి రుచీ, ఘాటూ ఎక్కువే. అందుకే అక్కడి నుంచి ప్రత్యేకంగా అల్లం తెచ్చుకుని ఇంట్లోనే చాయ్‌ చేసుకుని తాగడం మొదలుపెట్టింది. ఇరుగుపొరుగు వారికీ, స్నేహితులకీ ఆ చాయ్‌ని రుచి చూపితే మళ్లీ మళ్లీ అడిగి తాగేవారు. బ్రూక్‌కి అప్పుడే అనిపించింది అమెరికా వాసులకు ఈ చాయ్‌ తప్పకుండా నచ్చుతుందని. దాంతో ఎక్కువ మొత్తంలో అల్లం చాయ్‌ తయారు చేసి ఓ బండి మీద వెళ్లి జనసమ్మర్థం ఉన్న చోట అమ్మడం మొదలుపెట్టింది.

ఉద్యోగం వదిలి...
నెల తిరిగే సరికి ఆ చాయ్‌కి ఊహించని ఆదరణ లభించింది. దాంతో ‘భక్తి చాయ్‌’గా తన చాయ్‌కి నామకరణం చేసి బ్రాండింగ్‌ చేయడం మొదలుపెట్టింది. అలానే పదుల సంఖ్యలో బండ్లు అమెరికా వీధుల్లోకి పంపి అల్లం చాయ్‌ అమ్మడం ప్రారంభించింది. ఈ చాయ్‌కి ఫిదా అయిన కొన్ని కార్పొరేట్‌ సంస్థలైతే బ్రూక్‌ చేత తమ ప్రాంగణంలో స్టాల్స్‌ పెట్టించుకున్నాయి. ఆమె అక్కడితో ఆగకుండా ప్రయోగాలు మొదలుపెట్టింది.  పలు రకాల పూలూ పండ్లూ ఫ్లేవర్లతో అల్లం చాయ్‌ రుచికి ఇంకాస్త మెరుగులద్దింది. అలానే అల్లం ఎక్స్‌ట్రాక్ట్‌తో డికాక్షన్‌ తయారు చేసి కొన్ని నెలలపాటు నిల్వ ఉండేలా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దాంతోపాటు కూల్‌ చాయ్‌, మసాలా చాయ్‌ వంటి మరికొన్నింటినీ పరిచయం చేసింది. వీటన్నిటినీ బండ్లూ, స్టాల్స్‌ ద్వారా అమ్మడంతోపాటు ఆన్‌లైన్‌లో ‘భక్తి చాయ్‌’ పేరిట వెబ్సైట్‌ ప్రారంభించి వినియోగదారులకు మరింత చేరువైంది. ఈ క్రమంలో బ్రూక్‌ కార్పొరేట్‌ ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ఈ పదేళ్లలో ప్రయోగాలు చేస్తూ... ఒక్కో మెట్టూ ఎక్కుతూ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేసింది. ప్రస్తుతం రూ.250 కోట్ల వార్షికాదాయాన్ని అందుకుంటోంది. అంతేకాదు, ఉత్తమ వ్యాపారవేత్తగా అమెరికా ప్రభుత్వం నుంచి పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అలాగని ఆమె ఆదాయాన్ని అనుభవించడానికో ఆస్తులు పెంచుకోవడానికో ఉపయోగించట్లేదు. ‘గీత’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోని కరవు ప్రాంతాల్లో జలవనరులు పెంపొందించడానికి కృషి చేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకూ, ఆడపిల్లల చదువుకోసం పాటుపడుతోంది. అలానే బంగ్లాదేశ్‌, పెరూ వంటిదేశాలలో అనాథ ఆడపిల్లల కోసం నడిచే స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఎంతైనా బ్రూక్‌ ఆలోచన గ్రేట్‌ కదూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు