మణిద్వీపంలో రుతురాగాలు!

అదిగదిగో... వసుధ మీదకు వసంతం వస్తోంది... శార్వరిని తెస్తోంది. కాలమే దైవంగా... కర్తవ్యమే ఆరాధనగా భావించమని, భవిష్యత్తును వేయి దివిటీల చందంగా వెలిగించుకోమని చెబుతోంది. ఉగాది అంటేనే విశేషం... ఈ పర్వదినంలో ప్రతి విషయమూ ఓ సందేశం... ఇవిగో ఆ వివరాలు..

Published : 19 Mar 2020 00:29 IST

ఈనెల 25న ఉగాది

 

అదిగదిగో... వసుధ మీదకు వసంతం వస్తోంది... శార్వరిని తెస్తోంది. కాలమే దైవంగా... కర్తవ్యమే ఆరాధనగా భావించమని, భవిష్యత్తును వేయి దివిటీల చందంగా వెలిగించుకోమని చెబుతోంది. ఉగాది అంటేనే విశేషం... ఈ పర్వదినంలో ప్రతి విషయమూ ఓ సందేశం... ఇవిగో ఆ వివరాలు..

 

కాలం ఎవరి కోసం ఆగదు. అంతటి కాలం కూడా జగదంబిక అధీనం. ఆ కరుణామయి కొలువుండే స్థలం మణిద్వీపం. సర్వభువనాలకూ అధినేత్రి అయిన ఆ భువనేశ్వరీ మాత ఉండే చింతామణి గృహాన్ని చేరడానికి కొన్ని ప్రాకారాలు దాటుకుంటూ వెళ్లాలి. అలా దాటే క్రమంలోనే మనకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి రుతురాజుల ఆవాసం. కాలం అమ్మ అధీనం కాబట్టి కాలచక్రానికి చిహ్నాలైన రుతువులు కూడా జగదంబిక కనుసన్నల్లోనే ఉంటాయి. వాటి అధిపతులు తమ కుటుంబాలతో సహా అక్కడ నివసిస్తూ తమ విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ రుతు గమనం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. ఆసక్తికరమైన ఈ వివరాలు దేవీ భాగవతంలో ఉన్నాయి.

1.వసంత రుతువు: ఛైత్ర, వైశాఖ మాసాలు వసంత శోభతో కనువిందు చేస్తాయి. ఇది ఏడాదిలో వచ్చే మొదటి రుతువు. అన్నీ ఫలించి, పుష్పించే కాలమిది. అందుకే దీన్ని మధుమాసం అని కూడా అంటారు. దీనికి రాజు వసంతుడు. మణిద్వీపంలోని రాగి ప్రాకారంలో ఈయన కొలువుదీరి ఉంటాడు. పుష్ప సింహాసనంపై అందమైన ఛత్రంతో, మకరంద పాత్ర పట్టుకుని దర్శనమిస్తాడు. తన భార్యలైన మధుశ్రీ, మాధవశ్రీలతో కలిసి కనిపిస్తాడు.

2. గ్రీష్మ రుతువు: జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు గ్రీష్మ రుతువు. ఎండలు తీవ్రంగా ఉంటాయిప్పుడు. దీనికి అధిపతి గ్రీష్ముడు. మణిద్వీపంలోని సీస ప్రాకారం మధ్యలో ఈయన కొలువు ఉంటుంది. సంతాన వాటిక అని కూడా ఈ కొలువును పిలుస్తారు. ప్రాకారం లోపల భాగమంతా బంగారు రంగు కాంతితో నిండి ఉంటుంది. నిండుగా ఫలపుష్పాలు ఉంటాయి. శుకశ్రీ, శుచిశ్రీ ఈ రుతురాజు భార్యలు.

3. వర్ష రుతువు: శ్రావణ, భాద్రపద మాసాలు ఇందులో ఉంటాయి. ఈ రుతురాజు మణిద్వీపంలోని హరిచందన వృక్షాలతో విస్తరించిన ఇత్తడి ప్రాకారానికి నాయకుడు. వరుణదేవుడు వజ్రంలా గర్జిస్తూ ఇంద్రధనుస్సు చేత పట్టుకుని వర్షాలు కురిపిస్తాడు. నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్యరస్య, మాలిని, అంబాదుల, నితంతి, భ్రమంతి, మేఘయంక, వర్షయంతి, చిపుణిక, వారిధార, మదవిహ్వల... వర్ష రుతురాజు భార్యలు.

4. శరదృతువు: ఆశ్వయుజ, కార్తీక మాసాలు శరదృతువు. శీతల గాలులు, ప్రశాంత వాతావరణం ఉంటాయి. మణిద్వీపంలోని లోహమయ ప్రాకారంలో ఈ రుతు రాజు ఉంటాడు. మందారవాటిక అని దీనికి పేరు. ఇష్టలక్ష్మి, ఊర్జ్వలక్ష్మి అనే భార్యలతో ఈయన కొలువుదీరి ఉంటాడు.

5. హేమంత రుతువు: మార్గశిర, పుష్యమాసాలు హేమంత రుతు శోభలతో ఉంటాయి. చలిగాలి, మంచు కురిసే కాలమిది. ఈ రుతువుకు అధిపతి హేమంతుడు. పారిజాత వనాలతో నిండి ఉన్న రజత ప్రాకారం ఈయన నివాసం. సహశ్రీ, సహ్యశ్రీ అనే కాంతలతో కూడి ఉంటాడు.

6. శిశిరం: మాఘ, ఫాల్గుణ మాసాలను శిశిర రుతువుగా పిలుస్తారు. శీతలంగా ఉంటుంది. కొంచెం ఎండలు మొదలవుతాయి. రజత ప్రాకారానికి ఏడు యోజనాల దూరంలో ఉండే సువర్ణ ప్రాకారంలో దీనికి నాయకుడైన శిశిరుడు ఉంటాడు. తపశ్రీ, తవస్యశ్రీ ఈయన భార్యలు.

 

ఈ ఏడాది శార్వరి...

ఈ ఉగాదితో ప్రారంభమయ్యే సంవత్సరం పేరు శార్వరి నామ వత్సరం. శార్వరి అంటే రాత్రి.

విష్ణు సహస్రనామాల్లో శర్వరీకుడు అని కూడా ఉంది. దైనందిన కార్యకలాపాల్లో ఉదయకాలమంతా అలిసిపోయిన వ్యక్తి సేదదీరడానికి రాత్రిని ఏర్పాటు చేసినవాడని దీనికి అర్థం. ఉదయం, రాత్రి ఇవన్నీ సూర్యుడి వల్ల ఏర్పడుతున్నాయి. సూర్యుడు విష్ణు స్వరూపుడు. ఆ పరమాత్మే కాల స్వరూపం కాబట్టి ఈ ఏడాది కాలాన్ని కూడా భగవంతుడిగానే భావించాలి.

- అరుణ శర్మ నిమ్మగడ్డ, సిడ్నీ, ఆస్ట్రేలియా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని