రాజంటే...

భీష్మాచార్యుడు నేరుగా దుర్యోధనుడిని శాసించలేకపోయాడు...

Published : 30 Jan 2020 00:49 IST

ఫిబ్రవరి 2 భీష్మాష్టమి

భీష్మాచార్యుడు నేరుగా దుర్యోధనుడిని శాసించలేకపోయాడు.

ఫలితం... కురుక్షేత్ర సంగ్రామమైంది...

స్వయంగా మహావీరుడైనా ధర్మంవైపు నిలబడలేని అశక్తత కురుపితామహుణ్ణి నిర్వీర్యుణ్ణి చేసింది...

అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఆలోటును ధర్మరాజు దగ్గర పూరించాడు.

రాజెలా ఉండాలో, ధర్మమేంటో, ధర్మాచరణ ఎందుకో... వివరించాడు.

శాంతిపర్వంలో పితామహుడు వెల్లడించిన

ఆ రాజధర్మాలు అప్పటికీ, ఇప్పటికీ అనుసరణీయాలు, ఆదర్శప్రాయాలు...

భీష్మ ఉవాచ

‘యదహ్నా కురుతే పాపమ్‌ అరక్షన్‌ భయతః ప్రజాః!

రాజా వర్ష సహస్రేణ తస్యాంతమధిగచ్ఛతి!

పాలకుడు ఎప్పుడూ రాజ్యంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకూడదు. ప్రజల మనసెరగాలి. వారి మానసిక స్థితిని అనుసరించి వారి యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని పాలన సాగించాలి. ప్రజలు ఎవరి రక్షణలో నిర్భయంతో, నమ్మకంతో ఉంటారో అతడే నిజమైన రాజు.

సర్వభూతేష్వమక్రోశం కుర్వతస్తస్య భారత!

ఆనృశంస్యప్రవృత్తస్య సర్వాస్థం పదం భవేత్‌!

రాజు తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలపై దయ చూపాలి. సంకుచితత్వం పనికిరాదు. కొందరిపై చిన్నచూపుతో వారిని వేదనకు గురిచేయడం సమంజసం కాదు. అప్పుడు మాత్రమే పుణ్యఫలాన్ని పొందగలడు.

పుత్రవత్సల్యమానాని రాజధర్మేణ పార్థివైః!

లోకే భూతాని సర్వాణి చరంతే నాత్ర సంశయః!

మర్యాదలు లేకుండా నిరంతరం ధనం మీదనే దృష్టి పెట్టకూడదు. అలాంటి వారిని నీతి మార్గంలో నడిపేది రాజధర్మం. ఈ విషయం తెలుసుకోకుండా పాలకుడు వ్యవహరిస్తే తప్పనిసరిగా పతనమవుతాడు.●

పాలివ్వని ఆవు, కొయ్య ఏనుగు, తోలు మృగం, చవిటి భూమి, కురవని మేఘం... ప్రజలకు సుఖసంతోషాలనివ్వని పాలకుడు ఒకటేనంటారు భీష్మపితామహుడు

- యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని