పరబ్రహ్మమే మూలం

రాక్షసుల మీద సాధించిన విజయోత్సాహంతో దేవతల గర్వం పట్టు తప్పింది. కేవలం తమ శక్తి సామర్థ్యాలతోనే అసురుల మీద విజయం

Published : 08 Jul 2021 01:21 IST

ఉపనిషత్‌ కథ

రాక్షసుల మీద సాధించిన విజయోత్సాహంతో దేవతల గర్వం పట్టు తప్పింది. కేవలం తమ శక్తి సామర్థ్యాలతోనే అసురుల మీద విజయం సాధించామన్న భ్రమలో వారు మునిగిపోయారు. ఆ నేపథ్యంలో ఇంద్రుడు దేవతలతో కొలువుదీరి ఉండగా, ప్రవేశ ద్వారం వద్ద ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. అతడి నుంచి వెలువడుతున్న కాంతులు భరించలేక దేవతలు కళ్లు మూసుకున్నారు. విపరీతంగా భయపడ్డారు. తేజస్సుకు మూలమైన అగ్నిదేవుణ్ని పిలిచి, ఆ వచ్చిందెవరో చూడమని దేవేంద్రుడు ఆదేశించాడు. తనని ‘ఎవరు నువ్వు?’ అంటూ యక్షుడు ప్రశ్నించడంతో అగ్నిదేవుడికి తల కొట్టేసినట్లయ్యింది. ‘నేనెవరో తెలియదా? సృష్టిలో దహన శక్తిని నేనే!’’ అన్నాడు.

వెంటనే యక్షుడు ఓ గడ్డిపోచ సృష్టించి, ‘ఏదీ? దీన్ని దహించు చూద్దాం’ అన్నాడు.

ఎంత ప్రయత్నించినా అగ్నిదేవుడు దాన్ని కాల్చలేకపోయాడు. తలదించుకుని ఇంద్రుడి వద్దకు వెళ్లిపోయాడు.

దేవేంద్రుడు వాయువు వంక చూశాడు. వాయుదేవుడు కూడా ‘సృష్టిలో ఎంత గొప్ప వస్తువునైనా ఉఫ్‌ మని ఊది పారేస్తాను’ అని ప్రగల్భాలు పలికాడు. యక్షుడు ‘గడ్డిపోచను కదల్చమన్నాడు. అతను ప్రభంజనమై పోయాడు. గడ్డిపోచ మాత్రం చెక్కుచెదరలేదు. సంగతేంటో చూద్దామని ఇంద్రుడే స్వయంగా సింహాసనం దిగి వచ్చేంతలో యక్షుడు అంతర్ధానమయ్యాడు. అక్కడ ఉమాదేవి ప్రత్యక్షమయింది. యక్షుడు ఎవరోకాదని ‘అన్నిటికీ మూలమైన పరబ్రహ్మం’ అని స్పష్టం చేసింది. అగ్నిలోని దహించే శక్తికీ, వాయువులోని కదిల్చే శక్తికీ మూలం ఆ పరబ్రహ్మమేనని, కేవలం పరబ్రహ్మం అనుగ్రహించిన శక్తి వల్లనే రాక్షసుల మీద దేవతలు విజయం సాధించారని ఇంద్రుడికి తేటతెల్లం చేసింది. సమస్త దేవతలకు కనువిప్పు కలిగించింది. ప్రాణానికి ప్రాణం ఆ పరబ్రహ్మమే! ఆ ఎరుకతో మిథ్యాభిమానాన్ని విడనాడాలి. ఉపాసన ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. వారే పరబ్రహ్మను చేరగలరంటూ కేనోపనిషత్తు చెప్పిన కథ ఇది.

- ఓలేటి శ్రీనివాసభాను


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని