యముణ్ని మెప్పించిన బాలుడు

ఒకప్పుడు వాజశ్రవసుడు విశ్వజిత్‌ యాగం చేశాడు. యాగం ముగిసిన తర్వాత తన వద్దనున్న సంపదను దానం చేయసాగాడు. అతడి కుమారుడైన నచికేతుడు అదంతా కళ్ళప్పగించి చూశాడు.

Published : 29 Jul 2021 01:21 IST

ఉపనిషత్‌ కథ

కప్పుడు వాజశ్రవసుడు విశ్వజిత్‌ యాగం చేశాడు. యాగం ముగిసిన తర్వాత తన వద్దనున్న సంపదను దానం చేయసాగాడు. అతడి కుమారుడైన నచికేతుడు అదంతా కళ్ళప్పగించి చూశాడు. యాగం చేసినవారు తమ సర్వస్వాన్నీ దానం చేయాలన్న సంగతి తెలిసి ‘తండ్రీ! మరి నన్నెవరికి దానమిస్తారు?’ అనడిగాడు. హడావుడిలో వాజశ్రవసుడు పట్టించుకోలేదు. బాలుడు పదే పదే అడగటంతో విసుగెత్తిన తండ్రి- ‘యముడికి’ అన్నాడు. వెంటనే బాలుడు పట్టుబట్టి మాట తప్పకుండా, కంట తడి పెట్టకుండా యమలోకానికి పంపించమన్నాడు. వాజశ్రవసుడికి తప్పలేదు.

నచికేతుడు యమలోకానికి వెళ్ళాడు. అప్పుడు యముడు లేడు. మూడు రోజుల తర్వాత వచ్చాడు. ఆరు పూటలుగా పచ్చి నీళ్ళైనా ముట్టకుండా, పడిగాపులు పడుతున్న బాలుణ్ని చూసి యముడు జాలిపడ్డాడు. అతిథిని ఆదరించని పాపంనుంచి బయటపడేందుకు నచికేతుణ్ని తిరిగి భూలోకానికి పంపాలని నిశ్చయించుకుని మూడు వరాలు కోరుకోమన్నాడు.

‘దానంగా ఇచ్చినదానిని తిరిగి పుచ్చుకోవడం పాపం కదా! నన్ను చూసి మా తండ్రిగారు పాప భావంతో బాధపడకూడదు’ అన్నాడు నచికేతుడు.

‘నీ తండ్రి నిన్ను ఆనందంగా స్వీకరిస్తాడు’ అన్నాడు యముడు.

‘చావు పుట్టుకలు లేకుండా, స్వర్గానికి చేర్చే ‘అగ్ని విద్య’ను నాకు ప్రసాదించు’ అని కోరాడు నచికేతుడు.

రెండో వరాన్ని ప్రసాదించాడు యముడు.

ప్రాణి తన శరీరాన్ని విడిచిన తర్వాత ఏమవుతుందో తెలుసుకునే ‘ఆత్మ విద్య’ను కోరాడు.

నచికేతుడు అడిగిన మూడో వరాన్ని యముడు వెంటనే ప్రసాదించలేదు. అందుకు అనేక అర్హతలు ఉండాలి. ఎంతో సాధన చేసివుండాలి. అందుకని బాలుణ్ని అనేక రకాలుగా పరీక్షించాడు. రకరకాల ఆశలు చూపాడు. ఆకర్షణలు ఎర వేశాడు. హామీలు ఇచ్చాడు. నచికేతుడు ససేమిరా అన్నాడు. ఆత్మజ్ఞానం ముందు వాటిని ధూళికణాలుగా భావించాడు. బాలుడిలోని జిజ్ఞాసను యముడు మెచ్చుకున్నాడు. ఆత్మవిద్యకు అర్హుడని నిర్ణయించాడు.

‘నచికేతా! రుచికరం, ఆరోగ్యకరం అని ఆహారం రెండు రకాలుగా ఉన్నట్లే మనిషి ముందు రెండు ఎంపికలున్నాయి. ఒకటి సుఖవంతమైనది, రెండోది మేలు చేసేది. విజ్ఞులు మేలు చేసే ఎంపిక వైపు మొగ్గుతారు. సత్యగమ్యాన్ని చేరుకుంటారు. ఇతరులు జనన, మరణ వలయంలోకి జారిపడతారు. గిరగిరా తిరుగుతూనే ఉంటారు. చిన్నవాడివైనా మిన్నగా ఆలోచించావు’ అంటూ యమధర్మరాజు నచికేతుడికి ఆత్మవిద్యను పరిపూర్ణంగా బోధించి, భూలోకంలో వాజశ్రవసుడి వద్దకు పంపించాడు. అలా యముడి ద్వారా ఆత్మతత్త్వాన్ని విపులంగా వివరించిన ఈ కథ కఠోపనిషత్తు లోనిది.

- శ్రీవత్స


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని