మనసు బొగ్గుల బకెట్‌

నది ఒడ్డున పూరిగుడిసెలో ఉన్న గురువుగారి దగ్గర ఎందరో తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. ఓరోజు ఓ యువకుడు వచ్చి ‘బాబాజీ! మనసుకు పట్టిన తుప్పు ఖురాన్‌ పఠనంతో వదులుతుందంటారు, నిజమా?’ అన్నాడు.

Updated : 23 Sep 2021 06:01 IST

ది ఒడ్డున పూరిగుడిసెలో ఉన్న గురువుగారి దగ్గర ఎందరో తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. ఓరోజు ఓ యువకుడు వచ్చి ‘బాబాజీ! మనసుకు పట్టిన తుప్పు ఖురాన్‌ పఠనంతో వదులుతుందంటారు, నిజమా?’ అన్నాడు.

గురువు జవాబెలా చెప్పాలా అని ఆలోచించి ‘ఆ మూలనున్న బక్కెట్లో మసిబొగ్గులున్నాయి. వాటిని ఖాళీచేసి నది నుంచి నీళ్లు తోడుకురా’ అన్నారు. యువకుడు గురువుపట్ల గౌరవంతో మారుమాట్లాడకుండా లేచి బొగ్గుల బకెట్‌ను బోర్లించాడు. లోపలంతా నల్లగా మసిబారి ఉంది. నదికెళ్లి బకెట్‌ నిండా నీళ్లు నింపుకుని వచ్చాడు. కుటీరానికి చేరేలోపే నీళ్లన్నీ కారిపోయాయి. బకెట్లో చుక్కనీరు మిగల్లేదు. గురువు ఇంకోసారి నీళ్లు తెమ్మని పంపారు. అతను మళ్లీ బయల్దేరాడు. ఈసారీ అదే జరిగింది. గురువు ఆ యువకుడిని మరోసారి నీళ్లకోసం పంపారు. ఇలా ఎన్నోసార్లు నీళ్లకోసం వెళ్లాడు. అలా తిరిగీ తిరిగీ అలసిపోయిన దశలో ‘బకెట్‌ అంతా చిల్లులున్నా నీళ్లకోసం ఎందుకు తిప్పుతున్నారు?’ అంటూ గురువుగారి మీద అసహనం వ్యక్తంచేశాడు. ఆయన నవ్వి బకెట్‌ లోపలి భాగాన్ని పరిశీలనగా చూడమన్నారు. మొదటిసారి బకెట్‌ చూసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో ఒకసారి పోల్చి చూడమన్నారు. అతను పరికించి చూసి, ‘బొగ్గుతో నల్లగా ఉండే బకెట్‌ కాస్తా మిలమిలా మెరుస్తోంది’ అన్నాడు. ‘ఖురాన్‌ కూడా మనసులోని కల్మషాల తుప్పును కడిగేసి మెరిసేలా చేస్తుంది. ప్రాపంచిక వ్యామోహాల నుంచి కాపాడి అల్లాహ్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇదే నీ ప్రశ్నకు సమాధానం’ అన్నారాయన.              

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని