త్యాగనిరతికి అపూర్వ నిదర్శనం

ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో, ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే రెండో పండుగ ఈదుజ్జుహా లేదా బక్రీద్‌. సాధారణంగా బక్రీద్‌ రోజున ఖుర్బానీ ఇస్తారు. అంటే చాలామంది జంతుబలి అనుకుంటారు. నిజానికి ఖుర్బానీ అంటే త్యాగం.

Published : 07 Jul 2022 00:55 IST

జులై 10 బక్రీద్‌

ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో, ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే రెండో పండుగ ఈదుజ్జుహా లేదా బక్రీద్‌. సాధారణంగా బక్రీద్‌ రోజున ఖుర్బానీ ఇస్తారు. అంటే చాలామంది జంతుబలి అనుకుంటారు. నిజానికి ఖుర్బానీ అంటే త్యాగం. ఈ పండుగ రోజున సాటిలేని త్యాగం చేసిన మహనీయుడు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలామ్‌ను స్మరించుకుంటారు. ఆయన తాను పుట్టిపెరిగిన ప్రదేశాన్ని, భార్యాపిల్లల్ని త్యజించారు. ప్రాణప్రదంగా పెంచిన కన్నకొడుకును వదిలేయడానికి వెనుకాడ లేదు. జీవన పర్యంతం ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. ఐదువేల సంవత్సరాల నాటి సంఘటనలివి. ప్రస్తుత ఇరాక్‌ దేశ ప్రాంతాన్ని అప్పట్లో నమ్రూద్‌ రాజు పాలించేవాడు. తానే దేవుడినని గర్వించేవాడు. నమ్రూద్‌ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇబ్రాహీం అలై గళం విప్పారు. సర్వాన్నీ సృష్టించిన దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన రాజు మండే అగ్నిగుండంలో ఇబ్రాహీం (అ)ని పడేయించాడు. అగ్నిగుండం పూల పాన్పుగా మారింది. మండిపడిన రాజు దేశ బహిష్కారం విధించాడు. ఇబ్రాహీం దైవ సందేశాన్ని ప్రచారం చేస్తూ గడిపారు. వయసు పైబడుతున్న కొద్దీ తన తదనంతరం దైవ సందేశ కార్య భారాన్ని నిర్వర్తించడానికి సంతానం ఉంటే బాగుండునన్న కోరిక కలిగింది. దైవం పండంటి బిడ్డను ప్రసాదించాడు. లేకలేక కలిగిన బిడ్డను చూసుకుని ఆ దంపతులు మురిసిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దేవుడాయనకు మరో పరీక్ష పెట్టాడు. భార్యను ఎడారి ప్రాంతంలో వదిలేసిరమ్మన్నాడు. ఈ ఆదేశాన్ని ఇబ్రాహీం భార్య హాజిరాతో చర్చించగా, ఆమె అంగీకరించింది. కొంతకాలానికి మరో పరీక్ష ఎదురైంది. ఈసారి కన్నకొడుకును త్యాగం చెయ్యమన్నది దైవాదేశం. కొడుకు ఇస్మాయీల్‌ అంగీకరించడంతో, కళ్లకు గంతలు కట్టుకుని కుమారుడి కుత్తుకపై కత్తిపెట్టారు. మరుక్షణం కొడుకు స్థానంలో పొట్టేలు ప్రత్యక్షమైంది. ఇస్మాయీల్‌ను అల్లాహ్‌ రక్షించాడు. అల్లాహ్‌ పెట్టిన పరీక్షలో నెగ్గారు ఇబ్రాహీం. నాటి తండ్రీకొడుకుల త్యాగాన్ని స్మరిస్తూ ఏటా పశువును ఖుర్బానీ ఇస్తుంటారు. అవసరమైతే ధనప్రాణత్యాగాలకు సిద్ధం కావాలన్న సంకల్పానికి ప్రతీక ఇది.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని