గురువు మాట వింటే...

వ్యాసమహర్షి తన నలుగురు శిష్యులకి నాలుగు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు అప్పచెప్పాడు. పైలుడు గృహస్థు అయి, విద్యాబోధన చేస్తున్నాడు. ఆయన శిష్యుల్లో ఆరుణి, ఉదంకుడు, ఉపమన్యువు భక్తిశ్రద్ధలతో సేవించేవారు.

Published : 15 Sep 2022 00:43 IST

వ్యాసమహర్షి తన నలుగురు శిష్యులకి నాలుగు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు అప్పచెప్పాడు. పైలుడు గృహస్థు అయి, విద్యాబోధన చేస్తున్నాడు. ఆయన శిష్యుల్లో ఆరుణి, ఉదంకుడు, ఉపమన్యువు భక్తిశ్రద్ధలతో సేవించేవారు. తన ఆశ్రమ గోవులను కాచే ఉపమన్యువు దీక్షను పరీక్షించాలనుకున్న పైలుడు ‘నువ్వు భోజనం ఎక్కడ చేస్తున్నావు?’ అనడిగాడు. ‘ఇక్కడే! అమ్మగారు పెడుతున్నారు’ అంటూ బదులిచ్చాడు శిష్యుడు. ‘ఈరోజు నుంచి ఆశ్రమంలో తినొద్దు’ అన్నాడు పైలుడు. ఉపమన్యువు సరేనన్నాడు. కొన్నాళ్లకి మళ్లీ పిలిచి ఎక్కడ తింటున్నావని అడిగితే భిక్షాటన చేసి తింటున్నట్టు చెప్పాడు. అదీ వద్దంటే అంగీకరించాడు శిష్యుడు. కొద్దిరోజుల తర్వాత యథాప్రకారం పుష్టిగా కనిపిస్తున్న శిష్యుణ్ణి ‘ఏం తింటున్నావు?’ అని అడగ్గా ఆవుల పాలు తాగుతున్నట్టు చెప్పాడు. ‘అవి దూడలకి చెందినవి, తాగొద్దు’ అన్నాడు గురువు. తలూపాడు ఉపమన్యువు. ఆకలికి ఆగలేని శిష్యుడు మామూలుగానే ఉండటంతో గురువుకి అర్థం కాలేదు. ‘ఇప్పుడేం తింటున్నావు?’ అన్నాడు. ‘దూడలు తాగుతుంటే ఎగిరి వచ్చే నురుగు తీసుకుంటున్నాను’ అన్నాడు. ‘అదీ వద్దు’ అన్నాడు పైలుడు.

ఉపమన్యువు గురువు మాట జవదాటడు. ఆవులను తోలుకుని అడవికి వెళ్లాడు. ఆకలికి ఆగలేకపోయాడు. జిల్లేడు ఆకుల పాలతో ఆకలి తీర్చుకున్నాడు. కానీ ఆ పాలు కళ్లలో పడి కంటిచూపు పోయింది. ఆశ్రమానికి ఆవులని తోలుకెళ్తూ కళ్లు కనిపించక గోతిలో పడ్డాడు. ఆవులు ఇంటికి చేరాయి. ఉపమన్యువు రాకపోవటంతో గురువు వెతుక్కుంటూ బయల్దేరాడు. ‘ఎక్కడున్నావు?’ అని కేకలు పెట్టగా గోతిలోంచి జవాబిచ్చాడు ఉపమన్యువు. అతడి నిజాయితీకి సంతోషించిన పైలుడు దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ఉద్దేశించి స్తోత్రం చేయమన్నాడు. ఉపమన్యువు కవి కాకున్నా గురువు చెప్పినందున స్తుతించటం మొదలు పెట్టాడు. అతని నోటివెంట రుక్కులు వెలువడ్డాయి. అశ్వినీదేవతలు చూపు ప్రసాదించారు. గురుపరీక్షకి నిలిచిన ఉపమన్యువు వేదమంత్రద్రష్ట, సర్వ విద్యాప్రవీణుడు అయ్యాడు. విద్యాభ్యాసం పూర్తికాగానే హిమాలయాల్లో ఆశ్రమం నిర్మించుకుని, శివుడి గురించి తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడికి గురువు అయ్యే స్థాయికి ఎదిగాడు. గురువు మాట వింటే అద్భుతాలు జరుగుతాయని నిరూపించే కథ ఇది.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని