ఖురాన్‌ బోధకులు శ్రేష్ఠులు

ఖురాన్‌ అంటే అర్థం ఏమిటని అడిగాడో వ్యక్తి ధార్మిక పండితుణ్ణి. దానికాయన ‘ఖురాన్‌ అంటే ఎక్కువగా చదివే గ్రంథం’ అని జవాబిచ్చారు.

Published : 06 Apr 2023 00:43 IST

ఖురాన్‌ అంటే అర్థం ఏమిటని అడిగాడో వ్యక్తి ధార్మిక పండితుణ్ణి. దానికాయన ‘ఖురాన్‌ అంటే ఎక్కువగా చదివే గ్రంథం’ అని జవాబిచ్చారు. అదెలా అని మళ్లీ సందేహం వెలిబుచ్చాడతను. ‘రోజూ ఐదు పూటలా సామూహికంగా నమాజులో ఖురాన్‌ పారాయణం చేస్తాం. ఏడాదికోసారి రంజాన్‌ నెలలో ఖురాన్‌ను సంపూర్ణంగా ఒకసారి చదువుతాం’ అని జవాబిచ్చారు. ఖురాన్‌ అంటే మాటిమాటికీ చదవదగ్గ గ్రంథమని నిర్వచిస్తుంది నిఘంటువు.

ఖురాన్‌ అవతరించిన రంజాన్‌ నెలను ఖురాన్‌ నెలగా భావిస్తారు. ఈ నెలలో విస్తృతంగా ఈ గ్రంథాన్ని పఠిస్తారు. ఇందులోని 30 అధ్యాయాలను రోజుకొకటి చొప్పున చదువు తుంటే.. తరావీ నమాజులో ఇమామ్‌ వెనుక నిలబడి వింటారు. రోజంతా ఉపవాసం పాటించి, రాత్రివేళ ఖురాన్‌ను శ్రద్ధగా వినే దాసులంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టం.

ప్రళయం రోజున ఉపవాసం, ఖురాన్‌ పఠనం దాసుడికి అనుకూలంగా సిఫారసు చేస్తాయని ప్రవక్త (స) చెప్పారు. ‘ఖురాన్‌ను చక్కగా అర్థం చేసుకుని, దాన్ని ఇతరులకు బోధించేవారు ఎంతో శ్రేష్ఠులు’ అన్నారు. ప్రవక్త బోధనల గ్రంథాన్ని అనుసరించి ఈర్ష్య అనేది మహా పాపకార్యం. కానీ ఖురాన్‌ శ్రావ్యంగా చదివేవారిని చూసి ఈర్ష్యచెందినా తప్పులేదన్నది ప్రవక్త ఉద్బోధ. దైవవాక్కు అయిన ఖురాన్‌ పారాయణాన్ని విని దైవదూతలు గుమిగూడతారు. పారాయణ చేసినంతసేపూ దైవదూతలు అతని కోసం ప్రార్థిస్తారు. ఆ సమయంలో ప్రశాంతత ఆవరిస్తుంది. దైవగ్రంథాన్ని పఠించే ఇళ్లల్లోంచి దుష్టశక్తులు పారిపోతాయి. ఇందులోని ప్రతీ పదంలోనూ శుభం ఉంది. ఒక్కో పదానికి పది పుణ్యాలు లిఖితమయ్యాయని ప్రవక్త (స) పేర్కొన్నారు. ఖురాన్‌ను అనుసరించేవారు సన్మార్గం పొందుతారు. కనుక మధుర స్వరంతో పారాయణం చేయాలి.

రంజాన్‌ చివరి పది రోజుల్లో ముహమ్మద్‌ ప్రవక్త (స) రాత్రిలో ఎక్కువభాగం నమాజులో నిల్చుని ఖురాన్‌ పారాయణాన్ని కసరత్తుగా చేసేవారు. ఇంట్లోవారిని కూడా చదవమని మేల్కొలిపేవారు. అలా పఠించడం వల్ల దాసుడు అల్లాహ్‌కు చేరువవుతాడు. ఖురాన్‌ స్పష్టమైన ఉచ్చారణతో చదవడాన్ని తజ్వీద్‌ అంటారు. ‘సృష్టికర్త తరపు నుంచి అవతరించిన మహా సందేశం ఖురాన్‌ హృదయ వ్యాధులకు స్వస్థత చేకూరుస్తుంది. అనుసరించేవారికి అది మార్గదర్శకత్వం వహిస్తూ కారుణ్యం చూపిస్తుంది’ అనేది అల్లాహ్‌ వాక్కు. ‘ఖురాన్‌ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ, నేర్పించే వారికి ప్రశాంతత చేకూరుతుంది. కారుణ్యం వారిని కప్పివేస్తుంది. దైవదూతలు వారిని చుట్టుముడతారు. అల్లాహ్‌ వారిని గురించి తన సమీప దూతల దగ్గర ప్రస్తావిస్తారని చెబుతారు. తొలకరి జల్లుతో బీడుభూమి కూడా చిగురు తొడిగి ఎలా పచ్చదనాన్ని పొందుతుందో, చెట్టుచేమలు పుష్పించి ఫలిస్తాయో అలాగే ఖురాన్‌ కారుణ్య జల్లుతో హృదయాలు జీవం పోసుకుంటాయి’ అని ప్రవక్త శుభవార్త చెప్పారు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు