పరమాత్మ అవతారాలు

లోక కల్యాణార్థం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు పరమాత్మ భూమి మీద అవతరిస్తుంటాడు. ఆయన నిర్వహించే ఘనకార్యాలను అనుసరించి ఆరు అవతారాలు ఉంటాయి.

Published : 31 Aug 2023 00:04 IST

లోక కల్యాణార్థం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు పరమాత్మ భూమి మీద అవతరిస్తుంటాడు. ఆయన నిర్వహించే ఘనకార్యాలను అనుసరించి ఆరు అవతారాలు ఉంటాయి. ఆ విశేషాలు సంక్షిప్తంగా..

  • అంశావతారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు- సృష్టి, స్థితి, లయకారులు. వీరి స్థితి ఎప్పటికీ మారదు. ముగ్గురూ పూర్ణమైనటువంటి శక్తికి అంశలు. కనుక త్రిమూర్తులు అంశావతారాలుగా ప్రసిద్ధిచెందారు.
  • అంశాంశావతారం అంశావతారాలకు తోడ్పడుతూ, వారి ఆజ్ఞలకు బద్ధులై ఉండేవారు. వీరు బ్రహ్మ మానస పుత్రులు. వారిలో మరీచి, అత్రి, అంగీరసాది మహర్షులు ముఖ్యులు.
  • ఆవేశావతారం జన్మతః లోకోత్తర విశేషాలు లేకున్నా, ఒక్కోసారి ఆవేశ విశేషంతో లోకోత్తర కార్యాలు నిర్వహించేవారు. పరశురాముడు, విశ్వామిత్రుడు మొదలైనవారు. తండ్రి మరణించగా దుష్ట క్షత్రియులందరినీ సంహరించాడు పరశు రాముడు. విశ్వామిత్రుడు వశిష్టుడితో వైరం కారణంగా తపస్సు చేసి గాయత్రీ మంత్రంతో లోకానికి మేలు చేశాడు.
  • కళావతారం కపిల, కూర్మ, వరాహ అవతారాలు. భగవంతుడి కళ ప్రవేశించడం వల్ల కపిలుడు సాంఖ్య యోగాన్ని కల్పించాడు. దీని వల్ల భగవంతుడు మత్స్య, కూర్మ, వరాహ రూపాలను స్వీకరించి మహత్కార్యాలు నిర్వహించాడు.
  • పూర్ణావతారం శాపవశులైన రాక్షస జన్మలను సంహరించడం లాంటి ప్రయోజనం కోసం ఆవిర్భవించినవారు పూర్ణావతారులు. వామనుడు, నరసింహుడు, శ్రీరాముడు తదితరులు.
  • పూర్ణతమావతారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత శక్తి కలిగిన లీలామానుష వేషధారి శ్రీకృష్ణభగవానుడు పూర్ణతముడు. ఇలా పరమాత్మ అవతారాల్లో భేదాలున్నప్పటికీ అన్నీ లోకకల్యాణం కోసమేనని గ్రహించాలి.

టి.వి.ఎల్‌.గాయత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని