ఎందుకీ అతిమూత్రం?

నేను చాలా ఏళ్లుగా అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నాను. నాకు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవీ లేవు. టీవీటీ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయినా తగ్గలేదు. దీనికి పరిష్కారమేంటి?

Updated : 24 Dec 2022 14:43 IST

సమస్య సలహా

సమస్య: నేను చాలా ఏళ్లుగా అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నాను. నాకు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవీ లేవు. టీవీటీ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయినా తగ్గలేదు. దీనికి పరిష్కారమేంటి?

-కె.శ్యామల (ఈమెయిల్‌)

సలహా: మూత్రాన్ని పట్టి ఉంచే కండరాలు బలహీనం కావటం వల్ల దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం లీక్‌ అవుతుంటుంది. దీనికి టీవీటీ శస్త్రచికిత్స చేస్తుంటారు. మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటానికిది ఉపయోగపడదు. ఇవి మూత్రాశయ సమస్యలు. మూత్రంలో ఒత్తిడి పెరగటం వల్ల వచ్చేవి. వీటికి మూలం మూత్రాశయం అతిగా ప్రేరేపితం కావటం (ఓవర్‌యాక్టివ్‌ బ్లాడర్‌). కొన్నిసార్లు వెన్నెముక సమస్యలతోనూ ఇది రావొచ్చు. కొందరిలో ఎలాంటి కారణాలు లేకుండానూ మూత్రాశయం అతిగా సంకోచించొచ్చు. దీంతో మూత్రం వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు బాత్రూమ్‌కు వెళ్లకపోతే లీకవుతుంటుంది. మూత్రాశయం అతిగా ప్రేరేపితం కాకుండా చూసుకోవటానికి ముందుగా నీరు తక్కువగా తాగటం, ఒక సమయాన్ని నిర్ణయించుకొని మూత్రానికి వెళ్లటం, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మూత్రం పూర్తిగా పోయటం వంటివి అలవాటు చేసుకోవాలి. వీటితో తగ్గకపోతే యాంటీకొలనెర్జిక్‌ మాత్రలు వాడుకోవాల్సి ఉంటుంది. వీటితో మూత్రాశయంలో ఒత్తిడి తగ్గి, వెంటనే మూత్రానికి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. బాత్రూమ్‌కు వెళ్లేంతవరకు మూత్రాన్ని పట్టి ఉంచటం సాధ్యమవుతుంది. కాకపోతే ఈ మాత్రలతో నోరు ఎండినట్టు అనిపించటం, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలు ఉండొచ్చు. యాంటీకొలనెర్జిక్స్‌తో ఫలితం కనిపించకపోతే మిరాబెగ్రాన్‌ మాత్రలనూ కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి మూత్రాశయ కండరాలను వదులు చేసి వెంటనే, తరచూ మూత్రానికి వెళ్లటాన్ని తగ్గిస్తాయి. ఇవన్నీ వాడినా ఫలితం లేకపోతే యూరోడైనమిక్‌ పరీక్ష చేసి, మూత్రాశయంలో ఒత్తిడిని పరీక్షించాల్సి ఉంటుంది. అవసరమైతే మూత్రాశయంలోకి గొట్టాన్ని పంపించి బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావొచ్చు. దీంతో మూత్రాశయం గోడ బలహీనపడి వెంటనే మూత్రానికి వెళ్లటం తగ్గుతుంది. ఇంకా బాగా ఇబ్బందిగా ఉంటే శస్త్రచికిత్స చేసి మూత్రాశయం సామర్థ్యాన్ని పెంచొచ్చు. దీన్ని సమస్య తీవ్రమైనవారికే చేస్తారు. మీరు దగ్గర్లోని యూరాలజిస్టును సంప్రదిస్తే పరీక్షించి, తగు చికిత్స సూచిస్తారు.

చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ,

హైదరాబాద్‌-501 512  email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని