పేగు పూత ప్రేరకాలు

విరేచనాలు, కడుపునొప్పి, ఆకలి తగ్గటం వంటి వాటితో పెద్ద పేగు పూత, వాపు వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌- ఐబీడీ) తీవ్రంగా వేధిస్తాయి. వీటిల్లో ప్రధానమైనవి అల్సరేటివ్‌ కొలైటిస్‌, క్రాన్స్‌ డిసీజ్‌. అల్సరేటివ్‌లో పూత పెద్దపేగు గోడలకే పరిమితమవుతుంది.

Published : 01 Mar 2022 00:53 IST

విరేచనాలు, కడుపునొప్పి, ఆకలి తగ్గటం వంటి వాటితో పెద్ద పేగు పూత, వాపు వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌- ఐబీడీ) తీవ్రంగా వేధిస్తాయి. వీటిల్లో ప్రధానమైనవి అల్సరేటివ్‌ కొలైటిస్‌, క్రాన్స్‌ డిసీజ్‌. అల్సరేటివ్‌లో పూత పెద్దపేగు గోడలకే పరిమితమవుతుంది. మలాశయం దగ్గర మొదలైన పూత పైభాగానికీ చేరుకోవచ్చు. దీని ప్రధాన లక్షణం రక్తంతో కూడిన విరేచనాలు. జిగట విరేచనాలూ ఉండొచ్చు. మల విసర్జన సమయంలో కడుపు నొప్పి వస్తుంది. క్రాన్స్‌ డిసీజ్‌ నోటి నుంచి మలద్వారం వరకూ జీర్ణకోశంలో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఇందులో ఆయా భాగాల్లో పూత ఏర్పడుతుంది. దీని తొలి లక్షణం పేగుల్లో పుండ్లు పడటం. పూత ఏర్పడిన చోటును బట్టి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా పొత్తి కడుపులో నొప్పి కనిపిస్తుంటుంది. విరేచనాలు, బరువు తగ్గటం వంటివీ ఉంటాయి. ఐబీడీ ఎందుకొస్తుందన్నది కచ్చితంగా తెలియదు. జీర్ణకోశ వ్యవస్థలో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ఉద్ధృతమవటమే దీనికి మూలం. కొన్నిసార్లు ఉన్నట్టుండి పూత ప్రేరేపితమవుతుంటుంది. ఇందుకు రకరకాల ప్రేరకాలు దోహదం చేయొచ్చు.

పొగ తాగటం

క్రాన్స్‌ జబ్బు గలవారికి పొగ తాగటం చాలా చేటు చేస్తుంది. ఈ జబ్బుతో బాధపడేవారిలో సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చనివారు, అలాగే వీటిని మానేసిన వారితో పోలిస్తే- పొగ తాగేవారికి పేగు పూత ప్రేరేపితమయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. ఆసుపత్రిలో చేరాల్సి రావటం, సర్జరీ చేయాల్సిన పరిస్థితి తలెత్తటమూ ఎక్కువే.

నొప్పి మందులు

తలనొప్పి, ఒళ్లు నొప్పులకు ఐబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి నాన్‌స్టిరాయిడల్‌ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మందులు వేసుకోవటం తెలిసిందే. ఇవి పేగు పూత గలవారికి చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. ఇలాంటి మందులకు బదులు అసిటమినోఫెన్‌ వంటి మాత్రలు ప్రయత్నించొచ్చు.

యాంటీబయోటిక్‌ మందులు

యాంటీబయోటిక్‌ మందులు వ్యాధికారక బ్యాక్టీరియానే కాదు. కొన్నిసార్లు పేగుల్లో మనకు మేలు చేసే బ్యాక్టీరియానూ చంపొచ్చు. క్లోస్ట్రిడియమ్‌ డిఫికల్‌ వంటి హానికారక బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగేలా చేయొచ్చు. ఇలాంటి చెడ్డ బ్యాక్టీరియా ఐబీడీ లక్షణాలను ప్రేరేపితం చేసే ప్రమాదముంది. అందువల్ల ఏదైనా యాంటీబయోటిక్‌ మందులు వేసుకుంటున్నప్పుడు పేగు పూత లక్షణాలు ఉద్ధృతమైతే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

మందులు వేసుకోకపోవటం

పేగు పూత జబ్బులు తగ్గటానికి క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం ముఖ్యం. కొందరు లక్షణాలు కాస్త తగ్గుముఖం పట్టగానే జబ్బు నయమైందని భావిస్తుంటారు. మందులు మానేస్తుంటారు. దీంతో జబ్బు ఉద్ధృతమవుతుంది. మందులు వాడుకుంటుంటే లక్షణాలు అంతగా వేధించవనే సంగతిని గుర్తుంచుకోవాలి.

ఆహారం

ఏయే పదార్థాలు పేగు పూత లక్షణాలను ప్రేరేపితం చేస్తున్నాయనేది కచ్చితంగా గుర్తించటం కష్టమైన పనే. చాలావరకు మామూలుగానే ఆహారం తీసుకోవచ్చు. కాకపోతే కొందరికి పాల పదార్థాలు ఇబ్బంది కలిగించొచ్చు. ఇలాంటివారు వీటికి దూరంగా ఉండటం మంచిది. క్రాన్స్‌ బాధితులు పీచు తక్కువగా తీసుకోవాలి. అలాగే చక్కెర, కొవ్వులు తగ్గించుకోవాలి.

ఒత్తిడి
కొందరికి ఒత్తిడితో విరేచనాలు, కడుపునొప్పి వంటివి ప్రేరేపితమవుతుంటాయి. రోజువారీ జీవితంలో ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండటం కుదరకపోవచ్చు. కానీ దీన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. నడక, వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయి. ఏది వీలైతే దాన్ని అనుసరించాలి. ఒత్తిడిని తగ్గించు కోవటానికి పొగ తాగటం, జంక్‌ ఫుడ్‌ తినటం, మద్యం తాగటం వంటి దురలవాట్ల జోలికి మాత్రం వెళ్లొద్దు.


ఐబీఎస్‌ కాదు

చాలామంది ఐబీడీని ఐబీఎస్‌(ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ సిండ్రోమ్‌)గా పొరపడుతుంటారు. ఐబీఎస్‌లో జీర్ణకోశవ్యవస్థలో వాపు ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని