పిత్తాశయ రాళ్లున్నాయి సర్జరీ చేయించుకోవాలా?

నాకు 25 ఏళ్లు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయి. నొప్పేమీ ఉండదు. కానీ ఎప్పుడు చూసినా కామెర్లు ఉంటాయి. నేను శస్త్రచికిత్స చేయించుకోవాలా?

Published : 05 Apr 2022 00:35 IST

సమస్య: నాకు 25 ఏళ్లు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయి. నొప్పేమీ ఉండదు. కానీ ఎప్పుడు చూసినా కామెర్లు ఉంటాయి. నేను శస్త్రచికిత్స చేయించుకోవాలా?

- పి.నితీశ్‌ కుమార్‌ (ఈమెయిల్‌)

సలహా: పిత్తాశయ రాళ్లు పైత్యరస నాళం(కామన్‌ బైల్‌ డక్ట్‌)లో అడ్డుపడితే కాలేయం నుంచి పైత్యరస ప్రవాహం ఆగుతుంది. ఇది కామెర్లకు దారితీస్తుంది. దీన్ని అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌ అంటారు. అయితే పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి ఇతరత్రా కారణాతోనూ కామెర్లు రావొచ్చు. అందువల్ల కామెర్లకు కచ్చితమైన కారణమేంటన్నది తెలుసుకోవటం ముఖ్యం. ఇందుకు కాలేయ సామర్థ్య పరీక్షలు ఉపయోగపడతాయి. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ కూడా చేయాల్సి ఉంటుంది. కాలేయ పరీక్షల్లో డైరెక్ట్‌ బిలిరుబిన్‌, ఎస్‌జీపీటీ, ఆల్కలీన్‌ ఫాస్ఫేట్‌ మోతాదులు పెరిగినా.. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో పైత్యరస నాళం సైజు పెరిగినట్టు తేలినా పిత్తాశయ రాళ్లు కామెర్లకు కారణమవుతున్నాయనే అర్థం. ఇవి మామూలుగా ఉంటే పిత్తాశయ రాళ్లకు కామెర్లకు సంబంధం లేదనే చెప్పుకోవచ్చు. మరీ అనుమానంగా ఉంటే ఎంఆర్‌సీపీ పరీక్ష చేయాల్సి రావచ్చు. పైత్యరసనాళంలో రాయి ఉన్నదీ లేనిదీ ఇందులో స్పష్టంగా బయటపడుతుంది. పిత్తాశయ రాళ్లతో కామెర్లు వస్తున్నవారికి ఈఆర్‌సీపీ ఎండోస్కోపీ చికిత్స ద్వారా నాళం నుంచి రాయి తొలగిస్తారు. తర్వాత ల్యాప్రోస్కోపీ ద్వారా పిత్తాశయాన్ని తీసేస్తారు. పిత్తాశయ రాళ్లకు కామెర్లకు సంబంధం లేనప్పుడు నొప్పి కూడా లేనట్టయితే పిత్తాశయాన్ని తొలగించుకోవాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి మీరు గ్యాస్ట్రోఎంటెరాలజిస్టును సంప్రదిస్తే పరీక్షలు చేసి అవసరమైన చికిత్స సూచిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని