వృషణాల మీద తిత్తులు పోయేదెలా?

మా సోదరుడికి 32 ఏళ్లు. అతడికి వృషణాల మీద నాలుగైదు గట్టి తిత్తులున్నాయి. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీటిల్లోంచి అప్పుడప్పుడు చీము వంటిది బయటకు వస్తోంది.

Published : 26 Jul 2022 01:04 IST

సమస్య సలహా

సమస్య: మా సోదరుడికి 32 ఏళ్లు. అతడికి వృషణాల మీద నాలుగైదు గట్టి తిత్తులున్నాయి. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీటిల్లోంచి అప్పుడప్పుడు చీము వంటిది బయటకు వస్తోంది. ఇదేమైనా క్యాన్సరా? దీనికి చికిత్స ఏంటి? చిట్కాలేవైనా ఉన్నాయా?

- రాకేశ్‌ కిరణ్‌ (ఈమెయిల్‌)

సలహా: వివరాలను బట్టి మీ సోదరుడు తైలగ్రంథి తిత్తుల (సెబేషియస్‌ సిస్ట్స్‌) సమస్యతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. మన శరీరమంతటా చర్మంలో తైలగ్రంథులుంటాయి. వీటి నుంచి నూనె (సీబమ్‌) ఉత్పత్తి అవుతుంటుంది. కొన్నిసార్లు ఈ గ్రంథుల నుంచి నూనెను పైకి తెచ్చే మార్గంలో అడ్డంకి ఏర్పడుతుంటుంది. దీంతో నూనె అక్కడే పోగుపడటం మొదలు అవుతుంది. రాన్రానూ గడ్డ మాదిరిగా తయారవుతూ వస్తుంది. వృషణాల మీది చర్మంలో తైలగ్రంథులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి తరచూ అక్కడ ఇలాంటి సమస్య చూస్తుంటాం. దీనికి భయపడాల్సిన పనేమీ లేదు. ఈ తిత్తులు హానికరం కావు. క్యాన్సర్‌కు వీటికి సంబంధం లేదు. కాకపోతే చూడ్డానికి బాగుండదు. పెద్దగా అయితే నొప్పి పుడుతుంది. ఎప్పుడైనా పగిలితే లోపల్నుంచి తెల్లటి జిగురులాంటి పదార్థం బయటకు వస్తుంది. ఒకట్రెండు తిత్తులు మాత్రమే ఉంటే, నొప్పేమీ లేకపోతే వాటిని అలాగే వదిలేసినా ఏమీ కాదు. పనిగట్టుకొని ఆపరేషన్‌ చేసి తీసేయాల్సిన అవసరం లేదు. అయితే తిత్తులు ఎక్కువగా ఉన్నా, ఇబ్బందిగా అనిపిస్తున్నా, నొప్పి పెడుతున్నా, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా, తిత్తుల మూలంగా జ్వరం వస్తున్నా ఆపరేషన్‌ చేసి తొలగించొచ్చు. వృషణాల వద్ద శుభ్రంగా, పొడిగా ఉంచుకుంటే తిత్తులు మళ్లీ మళ్లీ ఏర్పడకుండా చూసుకోవచ్చు. దీనికి ఎవరికివారు ఇంట్లో పాటించగల చిట్కాలేవీ లేవు. యూరాలజిస్టును సంప్రదిస్తే క్షుణ్నంగా పరీక్షించి, తగు పరిష్కారం సూచిస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు