Updated : 07 Mar 2023 10:15 IST

Summer: ఎండ.. గుండె, కిడ్నీ జాగ్రత్త

ఆరంభం కాకముందే ఎండాకాలం మండుతోంది. నెల ముందే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈసారి వేసవి మరింత ఉద్ధృతంగా విజృంభించనుందనే హెచ్చరికలూ మొదలయ్యాయి. ఎండ వేడి, వడగాలులు మనిషిని నిజంగానే ‘పీల్చి’ పిప్పిచేస్తాయి. చెమట రూపంలో ఒంట్లోంచి నీటిని, లవణాలను లాగేసుకుంటాయి. ఫలితంగా నిస్సత్తువ, అలసట ఆవహించేసి శరీరం చతికిల పడుతుంది. అయినా మేలుకోకపోతే వడదెబ్బకు దారితీస్తుంది. శరీర ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగి అవయవాలు చేతులెత్తేసే ప్రమాదముంది. ముఖ్యంగా కీలక అవయవాలైన కిడ్నీ, గుండె విపరీతంగా ప్రభావితమవుతాయి.

ఏటికేడు ఎండల తీవ్రత పెరగటానికి ప్రధాన కారణం భూతాపం. గత శతాబ్దితో పోలిస్తే ఇప్పుడు సగటున 0.8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని చెబుతున్నారు. ఫలితంగా వడగాలులు వీయటమూ ఎక్కువైంది. వీటితో మరణాల సంఖ్యా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న ప్రధాన పది సహజ విపత్తుల్లో వడగాలులు ఒకటి కావటం గమనార్హం. రోజులో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత కన్నా 5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం.. ఇలాంటి పరిస్థితి కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతూ రావటాన్ని వడగాలులుగా పరిగణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇవి ఎక్కువవవుతూ వస్తున్నాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. కిడ్నీ, గుండెజబ్బులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

శరీరం ఎండ వేడిని తట్టుకోవటానికి, తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. చెమట పట్టటం దీనిలోని భాగమే. చెమట గాలికి ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది మంచిదే. లేకపోతే శరీర ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగిపోయి ప్రాణాల మీదికి వస్తుంది. అయితే చర్మానికి రక్త సరఫరా పెరిగే క్రమంలో కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. సుమారు 30% వరకు రక్తం తక్కువగా అందుతుంది. దీంతో కిడ్నీలకు అవసరమైన ఆక్సిజన్‌, పోషకాలూ తగ్గుతాయి. చెమట మూలంగా ఒంట్లో నీటిశాతం తగ్గటం ఎక్కువసేపు కొనసాగితే ఆకస్మికంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది (అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యురీ). ఇందులో మూత్రం ఉత్పత్తి తగ్గటం, వికారం, వాంతి, కళ్లు తిరగటం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సమస్య మరీ ఎక్కువైతే తికమక పడిపోతుంటారు కూడా. ఎండ వేడి, నీటి శాతం తగ్గటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదమూ ఉంది. తగినంత నీరు తాగకపోతే మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చు. అందువల్ల ఎండాకాలంలో కిడ్నీల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి సారించాలి.

విపరీత ప్రభావం

మన శరీర బరువులో సుమారు 50-60% వరకు ఉండేది ద్రవాలే. అవయవాలు సక్రమంగా పనిచేయటానికివి అత్యవసరం. ద్రవాలతో పాటు ఖనిజ లవణాలు సమస్థితిలో ఉండటానికి తోడ్పడేవి కిడ్నీలే. ద్రవాల మోతాదులు ఏమాత్రం అస్తవ్యస్తమైనా వీటి మీద విపరీత ప్రభావం పడుతుంది. చెమట రూపంలో ఒంట్లోంచి నీరు బాగా పోయినప్పుడు డీహైడ్రేషన్‌ (నీటిశాతం తగ్గటం) తలెత్తుతుంది. దీంతో రక్తంలోని ద్రవభాగమూ (ప్లాస్మా) తగ్గుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ద్రవాల మోతాదు 15% కన్నా ఎక్కువగా పడిపోవటాన్ని హైపోవలీమియా అంటారు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. కిడ్నీలకు చేరుకునే రక్తం పరిమాణం తగ్గుతుంది. రక్తపోటు పడిపోతుంది. దీంతో మరో ప్రమాదం రక్తం శుద్ధి అయ్యే ప్రక్రియ మందగించటం. ఫలితంగా వ్యర్థాల నిర్మూలనా కుంటుపడుతుంది.

* వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో జ్వరం అంతకంతకూ తీవ్రమవుతుంది. ఇది మరీ ఎక్కువైతే కండరాలు క్షీణిస్తుంటాయి (రాబ్డోమయోలైసిస్‌). కండరాలు క్షీణించటంతో పుట్టుకొచ్చే మయోగ్లోబిన్‌ అనే ప్రొటీన్‌ రక్తంలోకి విడుదలవుతుంది. ఇది కిడ్నీలకు విఘాతంగా మారుతుంది. డీహైడ్రేషన్‌తో రక్తంలో పొటాషియం మోతాదులు తగ్గటమూ నేరుగా కిడ్నీల మీద విపరీత ప్రభావం చూపుతుంది. యూరిక్‌ ఆమ్లం మోతాదులు పెరగటమూ కిడ్నీలను దెబ్బతీయొచ్చు.

* ఎండాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. అపరిశుభ్ర నీటితో నీళ్ల విరేచనాలు, వాంతులు పట్టుకోవచ్చు. వీటితోనూ నీటి శాతం తగ్గుతుంది. ఇదీ కిడ్నీలు దెబ్బతినటానికి కారణం కావచ్చు. అంతేకాదు.. బోరు బావుల వంటి వాటితో నేలలో చాలా లోతుల నుంచి తోడే నీటిలోని రసాయనాలూ కిడ్నీల మీద విపరీత ప్రభావం చూపొచ్చు.

నీటిని భర్తీ చేసినా..  

కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసుకుంటే అప్పటికి దెబ్బతిన్న కిడ్నీలు కుదురుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో హాని కలగజేయొచ్చు. ఎందుకంటే కొంత భాగం తిరిగి కోలుకోకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కిడ్నీ దెబ్బతింటే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. పరిస్థితి మరింత దిగజారుతుంది. వీరికి దీర్ఘకాల కిడ్నీ జబ్బు (సీకేడీ) తలెత్తే ముప్పు పెరుగుతుంది. చివరికి కిడ్నీ వైఫల్యమూ సంభవించొచ్చు.

కిడ్నీ జబ్బులుంటే మరింత జాగ్రత్త

అప్పటికే కిడ్నీజబ్బులు గలవారికి ఎండ వేడి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వీరిలో శరీర అవసరాలకు తగినట్టుగా రక్తాన్ని శుద్ధి చేసే వేగం (జీఎఫ్‌ఆర్‌) తగ్గి ఉంటుంది. అందువల్ల వీరికి మామూలు సమస్య కూడా తీవ్రంగా పరిణమిస్తుంది. కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారూ డీహైడ్రేషన్‌ను తట్టుకోలేరు. వీరికీ ఇది చిక్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి కిడ్నీజబ్బులు గలవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

* కోల్పోయిన నీటిని వెంటనే భర్తీ చేసుకోవాలి. లేకపోతే కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదముంది. మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవాలి.

* ఒంట్లో చెమటతో పాటు సోడియం బయటకు పోయినప్పుడు రక్తపోటు తగ్గుతుంది. ఇలాంటిది గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, దానికి తగినట్టు రక్తపోటు మందుల మోతాదును సరిచేసుకోవాలి.

కిడ్నీజబ్బు గలవారు మూత్రం ఎంత వస్తుందో చూసుకోవాలి. కాళ్ల వాపుల వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. వీటిని బట్టి ఎంత నీరు తాగాలనేది నిర్ణయించుకోవాలి. మూత్రం తక్కువ వస్తున్నా, కాళ్ల వాపులున్నా, ఆయాసం వస్తున్నా నీరు తగ్గించుకోవాలి. ఎండలో ఉన్నప్పుడు చెమట పడుతుందో లేదో గమనించుకోవాలి. రోజు మొత్తంలో మూత్రం ఎంత వస్తుందో ఒకసారి కొలుచుకొని, దాని కన్నా అరలీటరు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. ఎంత నీరు తాగాలనేది డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.

నీటిశాతం తగ్గితే రక్తంలో పొటాషియం తగ్గుతుంది. ఇది తిరిగి అందకపోతే కండరాలు విచ్ఛిన్నమై, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. అయితే కిడ్నీజబ్బు గలవారు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరిలో పొటాషియంను బయటకు పంపించే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల ఎక్కువగా తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, అరటిపండు వంటి వాటిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి వీరికి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. ఇలాంటి పదార్థాలు, పానీయాలను డాక్టర్‌ సలహా మేరకే తీసుకోవాలి.

ఎండలో పనిచేసేవారైతే..

శారీరక శ్రమ చేసేవారిలో, ఎండలో పనిచేసేవారిలో డీహైడ్రేషన్‌ ఎక్కువ. వీరిలో ఇది తెలియకుండా దీర్ఘకాలంగానూ ఉండొచ్చు. ఇలాంటివారిలో కిడ్నీలు విషతుల్యాలను సరిగా వడపోయలేవు. కాస్త నీటి శాతం తగ్గినా మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కిడ్నీల మీద విపరీత ప్రభావం చూపుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత మరీ ఎక్కువైనప్పుడు శరీరం 6 గంటల కన్నా ఎక్కువసేపు భరించలేదు. విరామం తీసుకోకుండా 6 గంటల కన్నా ఎక్కువసేపు ఎండలో గడిపితే వడదెబ్బ తగిలే ప్రమాదముంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి ఆరుబయట పనిచేసేవారు అదే పనిగా గంటలకొద్దీ ఎండలో పనిచేయొద్దు. ప్రతి గంటకోసారి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. నీడలో కూర్చొని.. నీళ్లు, మజ్జిగ వంటివి తాగి తిరిగి పని మొదలెట్టాలి. వీలైనంతవరకు ఎండ ముదరకముందే పనులు పూర్తి చేసుకోవాలి. ఎండ తగ్గాక తిరిగి కొనసాగించాలి.

జాగ్రత్తలు తప్పనిసరి

నిస్సత్తువ, అలసటగా అనిపిస్తే నీటిశాతం తగ్గిందనే అర్థం. దీనికి మరో సూచన మూత్రం ముదురు రంగులో రావటం. పరిస్థితి ఇంతవరకూ రాకుండా చూసుకోవటమే మంచిది. చెమట ద్వారా నీటితో పాటు లవణాలు, ఖనిజాలూ బయటకు పోతుంటాయి. కాబట్టి నీరు, ద్రవాలే కాకుండా ఖనిజ లవణాలూ తీసుకోవాలి. రోజంతా పనిచేసి చివర్లో ఒకేసారి రెండు లీటర్ల నీళ్లు తాగుతామంటే కుదరదు. దాహం వేసినా వేయకపోయినా గంట గంటకీ ఒకట్రెండు గ్లాసుల నీరు తాగుతూ ఉండాలి. దాహం వేసే సరికే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి. ముఖ్యంగా వయసు మీద పడినవారికి, చిన్న పిల్లలకు దాహం  వేస్తున్న విషయం తెలియదు. అందువల్ల అప్పుడప్పుడు విధిగా నీరు తాగేలా చూసుకోవాలి.

* వీలైనంతవరకు నీడ పట్టునే ఉండాలి. బయటకు వెళ్తే గొడుగు వాడుకోవాలి. వెడల్పు అంచు గల టోపీ ధరించాలి.

* బయటకు వెళ్లినప్పుడు వెంట నీరు తీసుకెళ్లటం మంచిది. లేకపోతే ఎక్కడ నీరు కనిపించినా తాగేసే ప్రమాదముంది. అది అపరిశుభ్రమైనదైతే విరేచనాలు, వాంతులు పట్టుకోవచ్చు.

* వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి చేర్చాలి. తడి బట్టతో తుడుస్తూ శరీరాన్ని చల్లబరచాలి. నోటితో ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉంటే రక్తనాళం ద్వారా సెలైన్‌, విటమిన్లు, మినరల్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.


గుండె మీద భారం

బయటి వాతావరణానికి అనుగుణంగా శరీరం ప్రతిస్పందించటంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు చల్లబడటానికి, చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉంచటానికి తోడ్పడేవి రక్త ప్రసరణలో మార్పులే. అందుకే అధిక వేడి, అతి శీతలం.. రెండూ గుండె మీద విపరీత ప్రభావం చూపుతాయి.

వేడిగాలులు ఆరోగ్యంగా ఉన్నవారికైనా ఇబ్బంది కలిగిస్తాయి. ఇక గుండెజబ్బులు గలవారికైతే మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు శరీరంలో మూల (కోర్‌) ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని శరీరం రెండు రకాలుగా బయటకు వెళ్లగొట్టటానికి ప్రయత్నిస్తుంది. ఒకటి- చర్మంలో ఉండే రక్తనాళాలు విప్పారటం. దీంతో చర్మానికి రక్త సరఫరా పెరిగి, అక్కడ్నుంచి ఉష్ణం బయటకు వెళ్లిపోతుంది. చర్మానికి రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేయటానికి గుండె మరింత వేగంగా, బలంగా రక్తాన్ని పంప్‌ చేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటి కన్నా వేడిగా ఉన్నప్పుడు గుండె ప్రతి నిమిషానికి 2-4 రెట్లు ఎక్కువగా రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది గుండె మీద అదనపు భారం పడేలా చేస్తుంది. అప్పటికే ఎవరికైనా గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయనుకోండి. చర్మానికి ఎక్కువగా రక్తం సరఫరా అవుతున్నప్పుడు గుండెకు రక్త ప్రసరణ తగ్గే ప్రమాదముంది. ఇది గుండెకు హాని కలగజేయొచ్చు. ఒకవేళ గుండె బలహీనపడి, సామర్థ్యం తగ్గిపోయి ఉందనుకోండి. వీరిలో గుండె తగినంత రక్తాన్ని పంప్‌ చేయలేకపోతుంది. అందువల్ల శరీర ఉష్ణోగ్రత అంతగా తగ్గదు. ఫలితంగా వీరికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

రెండోది- చెమట ఆవిరయ్యే ప్రక్రియ. చర్మం మీద ఆవిరయ్యే ప్రతి చెమట చుక్కా శరీరంలోంచి వేడిని బయటకు వెళ్లగొడుతుంది. వాతావరణం పొడిగా ఉన్న రోజున ఒక చెంచాడు చెమట మొత్తం రక్త ప్రవాహాన్ని 2 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు చల్లబరుస్తుంది. చెమటతో నీరే కాదు.. సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ బయటకు పోతాయి. కండరాలు సంకోచించటానికి, నాడుల మధ్య సమాచారానికి, ద్రవాల సమతుల్యతకు ఈ లవణాలు చాలా ముఖ్యం. చెమట ఎక్కువగా పట్టటం వల్ల ఈ ద్రవాలు, లవణాల సమతుల్యత అస్తవ్యస్తమవుతుంది. గుండె సమస్యలు గలవారికిది చిక్కులు తెచ్చిపెడుతుంది. ద్రవాలు తగ్గటం వల్ల రక్తం పరిమాణం తగ్గటం, లవణాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు గుండె మీద ఎక్కువ భారం పడే అవకాశముంది.

నీటి విషయంలో జాగ్రత

సాధారణంగా అవసరానికి మించి నీరు తాగితే అది మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది. కానీ గుండె బలహీనమైనవారిలో, విఫలమైనవారిలో హార్మోన్ల మార్పుల మూలంగా అదనపు నీరు ఒంట్లోనే ఉండిపోతుంటుంది. ఇది గుండె మీద భారం పడేస్తుంది. ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంటుంది. అందువల్ల గుండె బాగా బలహీనపడటం, గుండె వైఫల్యం వంటివి గలవారు నీరు, ఉప్పు తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కొందరైతే లీటరు కన్నా తక్కువే తాగాల్సి ఉంటుంది. ఎండాకాలంలో ఇది కాస్త విచిత్రమైన పరిస్థితే. ఎక్కువ వేడికి గురైనప్పుడు ఒంట్లోంచి నీరు ఎక్కువగా పోవచ్చు. అందువల్ల ఎక్కువ నీరు అవసరమవ్వచ్చు. అలాగని మరీ ఎక్కువ తాగినా ప్రమాదమే. చెమటలు బాగా పడుతున్నా కూడా డాక్టర్‌ ఎక్కువ నీరు తాగొద్దని చెప్పారు కదాని తాగకుండా ఉన్నా ప్రమాదమే. దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోవచ్చు. కాబట్టి ఎండాకాలంలో ఎంత నీరు తాగాలనేది వాతావరణాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఏసీ గదుల్లో ఉన్నవారు పరిమితి పాటించాలి. ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్‌ సలహా తీసుకోవాలి. గుండె పనితీరు బాగా ఉన్నవారు మామూలుగానే ద్రవాలు తీసుకోవచ్చు.

* ఎండ ఎక్కువగా కాసే వేళల్లో (ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు) బయటకు వెళ్లకపోవటం మంచిది. ఈ సమయంలో వ్యాయామాలు చేయకుండా చూసుకోవాలి.

* వదులైన, నూలు దుస్తులు ధరించాలి. ఇంట్లో, ఆఫీసులో చల్లగా ఉండేలా చూసుకోవాలి.

* కూల్‌ డ్రింకులకు దూరంగా ఉండటం మంచిది. ఇవి జీర్ణకోశ వ్యవస్థ నుంచి రక్తంలోకి ద్రవాలు త్వరగా వెళ్లకుండా అడ్డుకుంటాయి. కాఫీ, మద్యంతో ఒంట్లోంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగ, పళ్లరసాల వంటివి తీసుకోవచ్చు.

* ఒకేసారి ఎక్కువెక్కువ తినకుండా కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినటం మంచిది.

* వాంతి, వికారం, నిస్సత్తువ, తలనొప్పి, తికమక, ఏకాగ్రత లోపించటం, కండరాలు పట్టేయటం వంటి డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

* గుండెజబ్బులు గలవారిలో కొందరికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు అవసరమవుతాయి. ఇవి వేసుకునేవారు ఎండాకాలంలో లవణాల స్థాయులను గమనించుకోవాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు