మధ్యవయసు మతిమరుపు!

డిమెన్షియా ఒక్క మతిమరుపును కలిగించటమే కాదు.. ఆలోచనా తీరునూ దెబ్బతీస్తుంది. కార్యకారణ వివేచననూ తగ్గిస్తుంది. ఫలితంగా ప్రవర్తన, మాట, కదలికలన్నీ మారిపోతాయి. ఇది చాలావరకు వృద్ధాప్యంలోనే తలెత్తుతుంది

Updated : 27 Jun 2023 01:36 IST

డిమెన్షియా ఒక్క మతిమరుపును కలిగించటమే కాదు.. ఆలోచనా తీరునూ దెబ్బతీస్తుంది. కార్యకారణ వివేచననూ తగ్గిస్తుంది. ఫలితంగా ప్రవర్తన, మాట, కదలికలన్నీ మారిపోతాయి. ఇది చాలావరకు వృద్ధాప్యంలోనే తలెత్తుతుంది. కానీ అరుదుగానే అయినా కొన్ని డిమెన్షియా రకాలు మధ్యవయసులోనూ మొదలవుతాయి. వీటిని ఫ్రాంటోటెంపోరల్‌ డిజార్డర్స (ఎఫ్‌టీడీ) అంటారు. ఇవి చాలావరకు 45-65 ఏళ్ల మధ్యలో దాడిచేస్తుంటాయి. వీటి లక్షణాలు జీవితంలో కీలకదశలో మొదలవుతాయి కాబట్టి తీవ్ర ప్రభావమే చూపుతాయి.

మనం చేసే పనులన్నింటినీ ఆజమాయిషీ చేసేది మెదడే. ఇందులో ఐదు భాగాలుంటాయి. నడక, మాటలు, డ్యాన్స్‌ వంటి ఉద్దేశపూర్వకంగా చేసే పనులు.. భాషతో అభిప్రాయాల వ్యక్తీకరణ, అత్యధిక నైపుణ్యంతో కూడిన పనులకు నుదురు వెనకాల ఉండే మెదడు భాగాలు (ఫ్రాంటల్‌ లోబ్స్‌) తోడ్పడతాయి. శబ్దాలను విడమరచుకోవటం, జ్ఞాపకాలను స్థిరపరచుకోవటం, భావోద్వేగాల వంటి వాటిని చెవి వెనకాల ఉండే భాగాలు (టెంపోరల్‌ లోబ్స్‌) దోహదం చేస్తాయి. వీటిల్లో ఎలాంటి సమస్య తలెత్తినా ఆయా పనులన్నీ దెబ్బతింటాయి. ఫ్రాంటోటెంపోరల్‌ డిజార్డర్స్‌లో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. దీన్ని ఫ్రాంటోటెంపోరల్‌ డిమెన్షియా అనీ అంటారు.

ఎందుకొస్తుంది?

ఎఫ్‌టీడీకి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. కొందరికి వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులతో రావొచ్చు. అందుకే కొన్ని కుటుంబాల్లో వరుసగా కనిపిస్తుంటుంది. దీని బారినపడ్డవారి మెదడు కణాల్లో కొన్నిరకాల ప్రొటీన్లు పోగుపడుతుంటాయి. దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. చివరికి కణాలు మరణిస్తాయి కూడా.

నిర్ధరణ కష్టం

ఎఫ్‌టీడీని నిర్ధరించటం కష్టమనే చెప్పుకోవచ్చు. తొలిదశలో లక్షణాలు స్థిరంగా ఉండవు. వస్తూ పోతుంటాయి. కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తించొచ్చు. కొద్ది నెలలు, వారాల తర్వాత మామూలుగా అవ్వచ్చు. పైగా లక్షణాలు ఇతర జబ్బుల మాదిరిగా కనిపించటం, జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు అలా ప్రవర్తిస్తున్నారని అనుకోవటం వల్ల పొరపడే అవకాశం ఎక్కువ. చుట్టుపక్కల వాళ్లూ వీరిని అపార్థం చేసుకునే అవకాశముంది. తప్పుడుగా ప్రవర్తిస్తున్నారనో, కావాలని చేస్తున్నారనో అనుకోవచ్చు. దీంతో కుటుంబసభ్యులు, స్నేహితుల ఆగ్రహానికి కూడా గురవుతుంటారు. రక్త పరీక్షలు.. ఎంఆర్‌ఐ, పెట్‌ స్కాన్‌ వంటివి కొన్నిరకాల సంకేతాలను గుర్తించటానికి తోడ్పడొచ్చు. కానీ ఎఫ్‌టీడీ మామూలుగా ఉన్నవారిలో పెద్దగా మార్పులేవీ ఉండవు. సమస్యను అనుమానించినప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులను సంప్రదిస్తే ఫలితం ఉండొచ్చు.

పూర్తిగా నయం కాదు

మధ్యవయసు మతిమరుపు పూర్తిగా నయమయ్యేది కాదు. కానీ కొన్ని లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉదాసీనత, నిర్లక్ష్యం, నిరాశ, చిరాకు వంటి మానసిక లక్షణాలు గలవారికి యాంటీ డిప్రెసెంట్లు మేలు చేస్తాయి. ఇవి అనుచిత ప్రవర్తన తగ్గటానికీ తోడ్పడతాయి. మాట్లాడటంలో ఇబ్బంది పడేవారికి స్పీచ్‌ థెరపీ, కదలికల సమస్యలు గలవారికి ఫిజియోథెరపీ ఉపయోగపడతాయి. వంశపారంపర్యంగా జబ్బు సంక్రమించినవారికి వ్యాయామాలు మేలు చేస్తున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. శారీరకంగా చురుకుగా ఉండేవారిలో మతిమరుపు అంత త్వరగా ముదరటం లేదని బయటపడింది. అన్నింటికన్నా ముఖ్యమైంది కుటుంబసభ్యులకు అవగాహన కల్పించటం. ప్రవర్తనను అర్థం చేసుకొని.. ఇంట్లో పరిసరాలు సురక్షితంగా ఉండేలా చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని