ఇవీ ఆమ్ల లక్షణాలే!

జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) తరచూ చూసేదే. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట బిగుతైన కండర వలయం వదులు కావటం దీనికి మూలం

Published : 15 Aug 2023 01:41 IST

జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) తరచూ చూసేదే. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట బిగుతైన కండర వలయం వదులు కావటం దీనికి మూలం. వయసు మీద పడ్డవారు, ఊబకాయులు, గర్భిణుల్లో జీఈఆర్‌డీ ఎక్కువ. ఇందులో ఛాతీ మంట మాత్రమే కాదు, ఇతరత్రా లక్షణాలూ కనిపిస్తాయి.

జీఈఆర్‌డీ ప్రధాన లక్షణం కడుపు పైభాగాన, ఛాతీ మధ్యలో మంట పుట్టటం. ఇది పొడిచినట్టుగా, నొప్పితో వేధిస్తుంది. కొన్నిసార్లు ఛాతీ ఎముక నుంచి గొంతు వరకూ మంట ఎగబాకొచ్చు. ఏదైనా తిన్నప్పుడు, ముందుకు వంగినప్పుడు, పడుకున్నప్పుడు మంట ఎక్కువవుతూ ఉంటుంది. మరో ముఖ్య లక్షణం జీర్ణాశయంలోని పదార్థాలు అన్నవాహిక ద్వారా గొంతులోకి, నోట్లోకి రావటం. చాలామంది పట్టించుకోరు గానీ కొన్ని ఇతర లక్షణాలూ ఈ ఆమ్ల సమస్యలో కనిపిస్తుంటాయి.

  •  వికారం. ముద్ద మింగటంలో ఇబ్బంది. ముద్ద కిందికి దిగుతున్నప్పుడు నొప్పి.
  •  తరచూ నోరు చేదుగా, పుల్లగా అనిపించటం.
  •  గొంతు బొంగురు పోవటం.
  •  గొంతు నొప్పి.
  •  ఛాతీ నొప్పి లేదా ఛాతీ బిగపట్టినట్టు అనిపించటం. కొందరు దీంతో రాత్రిపూట నిద్రలోంచి మేల్కొంటారు కూడా.

గుండెనొప్పి మాదిరిగానూ

ఛాతీ మంట కొన్నిసార్లు గుండెపోటునూ తలపిస్తుంది. గుండెనొప్పితో అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చేవారిలో చాలామందిలో పరీక్షల అనంతరం తీవ్ర ఆమ్ల సమస్యగా బయటపడుతుంటుంది కూడా. ఈ రెండింటిలోనూ ఛాతీ మధ్యలో ఇబ్బంది కలుగుతుండటం గమనార్హం. అయితే ఛాతీ మంట చాలావరకు ఎక్కువగా లేదా మసాలా పదార్థాలు తిన్న తర్వాత మొదలవుతుంటుంది. అదే గుండెపోటైతే శారీరక శ్రమ, ఒత్తిడి అనంతరం తలెత్తుతుంటుంది. ఏదేమైనా ఛాతీలో మంట, నొప్పిగా అనిపిస్తే దానికి కారణమేంటన్నది రూఢి చేసుకోవటం మంచిది. ఆమ్ల సమస్య అయితే ఇబ్బందేమీ ఉండదు. కానీ గుండెపోటుకు చికిత్స ఆలస్యమైతే తీవ్ర అనర్థం కలగొచ్చు.

డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడు?

ఛాతీలో మంటకు చాలామంది యాంటాసిడ్‌ మాత్రలు వేసుకోవటం, ఆహారంలో మార్పులు చేసుకోవటం చూస్తూనే ఉంటాం. వీటితో లక్షణాలు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దు. ఛాతీలో నొప్పి, ఆకలి తగ్గటం, విడవకుండా వాంతి కావటం, మింగటంలో ఇబ్బంది, వాంతిలో రక్తం లేదా కాఫీ రంగు చారలు కనిపించటం, మలంలో రక్తం పడటం, మలం నల్లగా రావటం, అనూహ్యంగా బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని