చక్కెరతో కిడ్నీ రాళ్లు!

రోజువారీ కేలరీల్లో 5% కన్నా తక్కువగా చక్కెర కలిపిన పదార్థాల నుంచి తీసుకున్న వారితో పోలిస్తే 25% కన్నా ఎక్కువగా తీసుకున్న వారికి కిడ్నీ రాళ్లు ఏర్పడే ముప్పు 88% అధికంగా ఉంటున్నట్టు బయట పడింది.

Updated : 15 Aug 2023 03:29 IST

రోజువారీ కేలరీల్లో 5% కన్నా తక్కువగా చక్కెర కలిపిన పదార్థాల నుంచి తీసుకున్న వారితో పోలిస్తే 25% కన్నా ఎక్కువగా తీసుకున్న వారికి కిడ్నీ రాళ్లు ఏర్పడే ముప్పు 88% అధికంగా ఉంటున్నట్టు బయట పడింది.

కూల్‌డ్రింకులు, చక్కెరతో కూడిన పండ్ల రసాలు తాగుతున్నారా? తీపి బిళ్లలు, ఐస్‌క్రీములు, కేక్‌లు, బిస్కట్లు తింటున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడే స్వభావం గలవారికి వీటి విషయంలో జాగ్రత్త అవసరం. చక్కెర కలిపి తయారుచేసే ఇలాంటి పానీయాలు, పదార్థాలతో కిడ్నీలో రాళ్ల ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా  బయటపడింది.

కిడ్నీరాళ్ల ముప్పు కారకాలు అనగానే ఊబకాయం, దీర్ఘకాల విరేచనాలు, ఒంట్లో నీటిశాతం తగ్గటం, పేగు పూత, మధుమేహం, గౌట్‌ వంటివే గుర్తుకొస్తాయి. వీటికి చక్కెర కలిపిన పదార్థాలనూ జోడించుకోవాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్‌ నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వేలో భాగంగా సేకరించిన ఆహార వివరాలను విశ్లేషించి దీన్ని గుర్తించారు. రోజువారీ కేలరీల్లో 5% కన్నా తక్కువగా చక్కెర కలిపిన పదార్థాల నుంచి తీసుకున్నవారితో పోలిస్తే 25% కన్నా ఎక్కువగా తీసుకున్నవారికి కిడ్నీ రాళ్లు ఏర్పడే ముప్పు 88% అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. చక్కెర మూలంగా మూత్రంలో ఆక్జలేట్‌, క్యాల్షియం మోతాదులు పెరిగే ప్రమాదముంది. ఇవి మూత్రంలో పోగుపడి, స్ఫటికాలుగా మారతాయి. క్రమంగా కిడ్నీల్లో, మూత్రనాళాల్లో రాళ్లుగా ఏర్పడతాయి. ఎక్కువ చక్కెరను తినటం వల్ల మూత్రంలో ఆమ్ల గుణమూ పెరుగుతుంది. ఇది యూరిక్‌ ఆమ్లం రాళ్లు ఏర్పడటానికీ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కిడ్నీరాళ్లు ఏర్పడే గుణం గలవారు చక్కెర వాడకంలో పరిమితం పాటించటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని