కీలు వేదన

కీలెరిగి వాత పెట్టాలంటారు. శరీరంలో కీలు ప్రాధాన్యమేంటో ఇది చెప్పకనే చెబుతుంది. శరీర కదలికలకు కీళ్లే మూలం. లేవటం, కూర్చోవటం, నడవటం, వంగటం, పక్కలకు తిరగటం వంటివి తేలికగా చేసుకోగలుగుతున్నామంటే అంతా వీటి చలవే. రెండు ఎముకల మధ్యలో ఇరుసులా పనిచేస్తూ, ఒరుసుకుపోకుండా చూసే ఇవి సరిగా పనిచేయకపోతే జీవితమే స్తంభించిపోతుంది.

Updated : 12 Sep 2023 07:43 IST

కీలెరిగి వాత పెట్టాలంటారు. శరీరంలో కీలు ప్రాధాన్యమేంటో ఇది చెప్పకనే చెబుతుంది. శరీర కదలికలకు కీళ్లే మూలం. లేవటం, కూర్చోవటం, నడవటం, వంగటం, పక్కలకు తిరగటం వంటివి తేలికగా చేసుకోగలుగుతున్నామంటే అంతా వీటి చలవే. రెండు ఎముకల మధ్యలో ఇరుసులా పనిచేస్తూ, ఒరుసుకుపోకుండా చూసే ఇవి సరిగా పనిచేయకపోతే జీవితమే స్తంభించిపోతుంది. లేస్తే నొప్పి, కూర్చుంటే నొప్పి, నడిస్తే నొప్పి. చిన్న చిన్న పనులు చేసుకోవటమూ కనాకష్టమవుతుంది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇలాంటి నొప్పులే. ఒకప్పుడివి వయసు మీద పడ్దాకే మొదలయ్యేవి. ఇప్పుడు చిన్న వయసులోనూ ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పిని భరించలేక మోకాళ్ల మార్పిడి చేయించుకుంటున్నవారు ఎందరో. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం మంచిదని సంప్రదాయ ఆయుర్వేద వైద్యం సూచిస్తోంది. మందులు, చికిత్సలతో పరిష్కార మార్గం చూపుతోంది. అసలు కీళ్లు దెబ్బతినకుండా ముందు నుంచే నివారించుకోవచ్చనీ చెబుతోంది.

కీలంటే ఒక్క ఎముకే కాదు. కండరాలు, స్నాయువులు, కందెనలాంటి శ్లేషక కఫం (సైనోవియల్‌ ఫ్లూయిడ్‌) కూడా దీని భాగాలే. కీలు స్వభావం, దాని పనితీరు అవగతమైతే తప్ప చికిత్స సాధ్యం కాదు. అందుకే కీలు నొప్పి విషయంలో ఆయుర్వేదం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఎముక, ఎముకల మధ్యలోని సంధుల (కీళ్లు) గురించి ఐదు వేల ఏళ్ల క్రితమే విపులంగా చర్చించింది. ఆయుర్వేదం ప్రకారం- ఎముక ఐదు రకాలు. అవి కపాల (సమతల ఎముక), రుచక (దంతాలు), తరుణ (మృదులాస్థి), వలయ (పలుచటి ఎముక), నలక (మజ్జ ఎక్కువగా ఉండేది). అలాగే చేసే పనిని బట్టి సంధులను కోర (ఉదా: మోకాలు, మోచేయి), ఉలూఖల (తుంటి వంటి బంతి, గిన్నె కీలు), సాముద్ఘ (రెండు వైపులా కీలుండే చేతి ఎముక), ప్రతర (మెడ, తల కదిలించేవి), తున్నసేవనీ (తల ఎముకలను కలిపే కుట్ల మాదిరి కీళ్లు), వయస్థుండ (మణికట్టు), మండల (కంట్లో వంటి భాగాల్లో కనిపించకుండా ఉండేవి), శంఖావర్త (శంఖం మాదిరిగా వంపులు తిరిగే చెవిలోని కాక్లియా వంటివి).. ఇలా 8 రకాలుగా శాస్త్రం వర్గీకరించింది. అంతేకాదు, కీళ్ల నొప్పులకు కారణమయ్యే కీలక స్థానాలైన ఐదు రకాల మర్మాలనూ పేర్కొంది. 1. సద్యోప్రాణహర. ఇక్కడ దెబ్బతగిలితే వెంటనే గానీ ఏడు రోజుల్లోపు గానీ మరణించే ప్రమాదముంది. ఉదాహరణకు- కణతల మీద దెబ్బతగలటం. 2. కాలాంతర ప్రాణహర. దెబ్బ తగిలిన తర్వాత దాదాపు 15 రోజుల వరకు ప్రాణాంతకంగా.. అంటే తీవ్రంగా బాధించే స్థానమిది. 3. రుజాకర. నొప్పిని కలిగించే మర్మాలివి. వీటిల్లో భాగమైన గుల్ఫ, మణిబంధ, కూర్చసిరల మీద ఒత్తిడి పెరిగినా, అనుకోకుండా దెబ్బతగిలినా, బరువు పడినా నొప్పి తీవ్రంగా వస్తుంది. 4. విశల్యఘ్నం. ఇక్కడ ఏదైనా దిగబడితే దాన్ని అలాగే ఉంచాల్సి ఉంటుంది. తొలగిస్తే ప్రాణహరంగా పరిణమిస్తుంది. 5. వైకల్యకర. ఆకారం మారేలా చేసే మర్మాలివి. మోకాళ్ల నొప్పుల్లో రుజాకర, వైకల్యకర మర్మాలు చాలా కీలకం. వీటిల్లో నొప్పి తీవ్రంగా ఉంటుంది. దీని మూలంగా నడక మారిపోతుంది. నొప్పి తక్కువగా ఉన్న కాలు మీద బరువు వేయటం వల్ల మరో కాలి కీలు ఆకారం క్రమంగా అస్తవ్యస్తమవుతుంది (సంధి వక్రత). కీలు సమస్యలను సునిశితంగా అర్థం చేసుకోవటంలో ఇవన్నీ ముఖ్యమే.

వాతదోషం ప్రధానం

కీళ్ల నొప్పులకు వాత దోషం ప్రధానం. ఆయుర్వేదం మొత్తం దోష, ధాతు, మల సిద్ధాంతం మీదే నడుస్తుంది. ‘దోష ధాతు మలా మూలం హి శరీరం’ అని శాస్త్రం చెబుతుంది. అంటే శరీరానికి ఇవే ప్రధానం. దోషాలంటే చెడ్డవి అని కాదు. ఇవి ప్రాథమిక శక్తులు. శారీరక, మానసిక స్థాయుల్లో మన శరీరాన్ని నడిపించే సూత్రాలు. వాతం, పిత్తం, కఫం శారీరక దోషాలైతే.. రజోగుణం, తమోగుణం మానసిక దోషాలు. సత్వగుణాన్ని దోషంగా పరిగణించరు. మలాల్లో చెప్పుకోవాల్సినవి స్వేదం, మలం, మూత్రం. ఇక ధాతువులు ఏడు (రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర) రకాలు. దోషాలు ఎంత సక్రమంగా, ధాతువులు ఎంత బలంగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. వీటిల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా వ్యాధి కారకంగా పరిణమిస్తుంది. దోషాలు ప్రకోపించి ధాతువులతో కలవటం, శరీరంలో మలాలు పేరుకుపోవటం రకరకాల జబ్బులకు దారితీస్తుంది. అస్థి, సంధి వ్యాధులు ఇలాంటివే. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణమై, స్రోతస్సులనే మార్గాల ద్వారా ఆయా ధాతువులకు చేరుకుంటుంది. ఎముకకు అవసరమైన పోషకాలు, పదార్థాలను అందించేది అస్థి వహ స్రోతస్సు. దీనికి మూలాలు మేధస్సు, జఘనం. మేధ అంటే కొవ్వు. అంటే ఎముకకు మూలం కొవ్వే అన్నమాట. నడక, పనులు, ప్రయాణం వంటి కదలికలతో అనుకోకుండా పడే ఒత్తిళ్ల కారణంగా ఈ స్రోతస్సు దెబ్బతినొచ్చు. ఫలితంగా పోషకాలు అందక కీలులోని ఎముక దెబ్బతినొచ్చు (అస్థి విఘట్టనం). ఎముక ఎక్కువగా సంధిలోనే దెబ్బతింటుండటం గమనార్హం.

చికిత్సలతో మంచి ఫలితం

ముక, సంధుల్లో వచ్చే వ్యాధులకు పంచకర్మ చికిత్సలు అవసరం. ఇవి వ్యాధులను మూలం నుంచి తొలగిస్తాయి.

  • మోకాలి నొప్పులకు జాను బస్తి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నొప్పి ఉన్నచోట మినప పిండి ముద్దతో గుండ్రంగా చిన్న గోడ కడతారు. మూలికలతో కూడిన నూనెలను ఒక క్రమబద్ధమైన ఉష్ణోగ్రతలో వేడిచేసి దానిలో పోస్తారు. నూనె పీడనం స్థిరంగా ఉండేలా చూస్తారు. సాధారణంగా మోకాళ్ల నొప్పి గలవారిని వెల్లకిలా పడుకోబెట్టి దీన్ని చేస్తుంటారు. అయితే బోర్లా పడుకోబెట్టి మోకాలి వెనక భాగంలో చేస్తే మరింత బాగా పనిచేస్తుంది. తక్కువ మందుతోనే ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. బస్తి క్రియ కోసం నొప్పి తీరు, వ్యక్తి గుణాన్ని బట్టి రకరకాల ఔషధాలతో తయారుచేసిన నూనెలను ఉపయోగిస్తారు. మెడ వద్ద చేసే చికిత్సా క్రియను గ్రీవా బస్తి అంటారు. మెడ, నడుం రెండింటికీ కలిపి చేస్తే మేరు బస్తి అంటారు.
  • మలమార్గంలోంచి మందులు ఇవ్వటం ద్వారానూ బస్తి చికిత్స చేస్తారు. దీన్ని ఒకరకంగా మందులతో కూడిన ఎనీమా పద్ధతి అనుకోవచ్చు. దీనిలో రెండు రకాలున్నాయి. నూనెలతో చేసేదేమో స్నేహ లేదా అనువాసన బస్తి. కషాయాలతో కూడిన ద్రవ్యాలతో చేసేది ఆస్థాపన లేదా నిరూహ బస్తి. రోగి బలాన్ని బట్టి మూలికలను, చికిత్స పద్ధతిని నిర్ణయిస్తారు.
  • మెడ నొప్పులకు నస్య చికిత్స మేలు. అణుతైలం, షట్బిందు తైలం, క్షీర బల తైలం చుక్కలను ముక్కులో వేయటం దీనిలోని కీలకాంశం.
  • వాతరక్తంలో స్నేహ యుక్త మృదు రేచనం, రక్త మోక్షణ (జలగలతో రక్తాన్ని తీయటం) చికిత్సలు ఉపయోగపడతాయి. జలగ చెడు రక్తాన్ని పీల్చుకుంటుంది. దీంతో త్వరగా ఉపశమనం కలుగుతుంది. సమస్య పైపైనే ఉంటే కషాయాలను ధారగా పోయటం, లేపనాలు పూయటం ఉపయోగపడతాయి.
  • ఆమవాతంలో ముందుగా క్రమబద్ధమైన ఆహారం.. స్వేదనం, పాచనం, దీపన, స్నేహ, విరేచన, బస్తి చికిత్సలతో ఆమాన్ని తగ్గిస్తారు. అయితే స్నేహ చికిత్సను అతి తక్కువ కాలమే.. అదీ తక్కువ ప్రమాణంలోనే చేస్తారు.

కారణాలేంటి?

స్థి ధాతువు దెబ్బతినటం కీళ్ల నొప్పికి మూలం. అస్థి ధాతువు క్షీణించటం వల్ల తలెత్తే జబ్బుల్లో ఎక్కువగా చూసేవి కీళ్ల నొప్పులే. వీటికి ప్రధాన కారణాలు- వయసుతో పాటు కీలు అరిగిపోవటం, కీళ్ల మీద శరీర బరువు సమానంగా పడకపోవటం, సమతులాహారం తినకపోవటం, అంతగా శ్రమ చేయకపోవటం, నిద్ర సరిగా పోకపోవటం.


లేప చికిత్సలు

కీళ్ల నొప్పులకు దశాంగ లేపం, మర్మగుళిక లేపం, కేయం లేపం, శోథారి లేపం బాగా ఉపయోగపడతాయి. లేపాలను గుడ్డకు రాసి, నొప్పి ఉన్న చోట చుట్టటమూ (ఉపనాహ చికిత్స) మేలు చేస్తుంది.

ఔషధ చికిత్స

  • సంధిగత వాతంలో లాక్షాది గుగ్గులు, యోగరాజ గుగ్గులు మేలు చేస్తాయి. ముఖ్యంగా లాక్షాది గుగ్గులు కీలు మొత్తం తిరిగి మరమ్మతు కావటానికి తోడ్పడుతుంది.
  • ఆమవాతానికి సింహనాద గుగ్గులు.. వాతరక్తంలో కైశోర గుగ్గులు.. రక్తం తక్కువగా ఉన్నవారికి పంచామృత లోహ గుగ్గులు.. వాపు, నీరు గలవారికి పునర్నవ గుగ్గులు మేలు చేస్తాయి. అన్నిరకాల కీళ్ల నొప్పులకు పంచతిక్త గుగ్గులు ఉపయోగపడతాయి. శొంఠి, రాస్న, గుడూచి, గోక్షూర, శల్లకి చూర్ణాలు లేదా కషాయాలూ వాడుకోవచ్చు.
  • సంధిగతవాతంలో క్షీర బలా తైలం, నిర్గుండి తైలం, కర్పూర తైలం, వాతాంతక తైలం, బలాశ్వగంధ తైలం.. వాతరక్తంలో పిండ తైలం, ఆమవాతంలో సైంధవాది తైలం వాడుకోవచ్చు.

గృహ వైద్యం

  • ఐదు వెల్లుల్లి రెబ్బలను నలగ్గొట్టి, 60 మి.లీ. నీటిలో పది నిమిషాల సేపు ఉడికించాలి. తర్వాత 50 మి.లీ. పాలు పోసి.. సన్నటి సెగ మీద మరో పది నిమిషాలుంచాలి. ఉడికిన వెల్లుల్లి రెబ్బలను చెంచాతో తీసి, గుడ్డలో చుట్టి పిండాలి. దీన్నే లశున క్షీర పాకం అంటారు. దీనిలో 7.5 మి.లీ. శుద్ధి చేసిన ఆముదం కలిపి సాయంత్రం పూట తాగాలి. రోజుకు ఒకసారి చొప్పున వారం పాటు తీసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. దీన్ని ఎండాకాలంలో వాడొద్దు. అలాగే పిత్త ప్రకృతి గలవారు వాడొద్దు.
  • లేత నల్లేరు పచ్చడి అప్పుడప్పుడు తింటుంటే ఎముక బలం పుంజుకుంటుంది. టమోటా రసం మేలు చేస్తుంది. పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. సరైన పాళ్లలో నెయ్యి వాడుకోవచ్చు.
  • నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే ఆమవాతం, వాతరక్తం తప్ప చాలారకాల ఎముకల వ్యాధులను తగ్గించుకోవచ్చు. రాకుండానూ చూసుకోవచ్చు. గోరు వెచ్చటి నువ్వుల నూనెను శరీరానికి బాగా రాసుకొని, గంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కరోజు చేసినా మంచిదే.

మూడు రకాలు

వాతదోషం ప్రకోపిస్తే శరీరంలో రూక్షగుణం (పొడితనం) పెరుగుతుంది. దీని మూలంగానే కీళ్ల మధ్యలో కందెనలాంటి శ్లేషక కఫం తగ్గుతుంది. ఫలితంగా కీలులో స్నిగ్ధ గుణం తగ్గి, పొడితనం పెరుగుతుంది. అప్పుడు ఎముకలు రెండూ రాసుకొని వాపు, అరిగిపోవటం, ఒత్తిడి, నీరు చేరటం, నొప్పుల వంటి సమస్యలు బయలుదేరతాయి. కీళ్ల నొప్పులను ప్రధానంగా సంధిగత వాతం, ఆమవాతం, వాతరక్త వ్యాధులుగా శాస్త్రం వర్గీకరించింది.

సంధిగత వాతం

ఇది సాధారణంగా మోకాళ్లలోనే తలెత్తుతుంది. పెద్ద వయసులో బాధించే మోకాళ్ల నొప్పుల్లో చాలావరకు కనిపించేది ఇదే. సరైన ఆహారం తీసుకోకపోవటంతో కీళ్లలో బలం తగ్గటం వల్ల వస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ కీలు అరగటమూ కారణం కావొచ్చు. ఇందులో కీలు మీద చేయి పెడితే గాలి బుడగను తాకినట్టుంటుంది (వాత పూర్ణ ద్రుతి స్పర్శ).

  • సంధిగత వాతంలో మరో రకం సమస్య కోష్ట్రుక శీర్షక. ఇది ఒక్క మోకాలుకే వస్తుంది. దీన్ని చూడగానే గుర్తించొచ్చు. ఇందులో కీలు నక్క ముఖం మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో వాపు, నొప్పి తీవ్రంగా ఉంటుంది. కాలు కింద పెట్టలేరు. నీరూ చేరొచ్చు.  

ఆమవాతం

ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే వచ్చే సమస్య. ఆధునిక పరిభాషలో దీన్ని స్వీయరోగనిరోధక జబ్బయిన రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌గా చెప్పుకోవచ్చు. రక్త ధాతువు దోష పూరితం కావటం దీనికి మూలం. ప్రకోపించిన దోషాలు రక్త ధాతువు మీద ఎక్కువగా ప్రభావం చూపినప్పుడు కండరాలు, స్నాయువులు బాగా దెబ్బతింటాయి. ఇందులో శరీర బరువు మోసేవి కాకుండా చేయి, కాళ్లలోని చిన్న కీళ్ల వంటివి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ఎముక కన్నా ముందు కండరాలు, ఎముక దెబ్బతినటం ఆరంభమవుతుండటం గమనార్హం. ఆమవాతంలో తేలు కుట్టినప్పుడు తలెత్తినట్టుగా నొప్పి పుడుతుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా త్వరగా విస్తరిస్తుంది. వాపుతో కూడిన లక్షణాలూ ఉంటాయి. దీని నిర్ధరణకు ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌, ఏఎన్‌ఏ ఫ్యాక్టర్‌, యాంటీసీసీపీ వంటి రక్త పరీక్షలు అవసరం.

వాతరక్తం

ఇదీ చిన్న వయసులోనే వస్తుంది. మాంసం, పన్నీరు, పల్లీలు, కొబ్బరి, నెయ్యి వంటి వాటిల్లో ప్యూరిన్లు దండిగా ఉంటాయి. ఇలాంటివి అతిగా తింటే శరీరం వాటిని జీర్ణం చేసుకునే క్రమంలో కొన్ని మలాలు (చక్కెర లాంటి లవణాలు) పుట్టుకొస్తాయి. ఇవి మూత్రం నుంచి బయటకు పోయినంతవరకు ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువ కాలం అలాగే ఉండిపోతే అవి కీళ్లలోకి చేరి, గట్టిపడతాయి. ముళ్లలాగా మారతాయి. నొప్పి, మంట కలిగిస్తాయి. గౌట్‌ వంటి జబ్బులు ఇలాంటివే. వీటిల్లో రక్తం పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని వాతరక్తం కింద శాస్త్రం పేర్కొంటోంది. ఇందులో ఎలుక కరిచినప్పటి మాదిరిగా నొప్పి క్రమంగా ఎక్కువవుతూ వస్తుంది. నొప్పి కత్తి తీసుకొని కోసినంత తీవ్రంగా ఉంటుంది. వాతరక్తంలో ఉత్థాన, గంభీర అని రెండు రకాలు. ఉత్థానలో చర్మం వంటి పై భాగాలు ప్రభావితమవుతాయి. గంభీరలో కీళ్లు ఎక్కువగా ప్రభావితమవుతాయి. సీరం యూరిక్‌యాసిడ్‌ పరీక్షతో వాతరక్తానికి సంబంధించిన వివరాలు తేలికగా తెలుస్తాయి. దీనికి చికిత్స సులభమే. ఒక్క రకం తప్ప మిగతావన్నీ త్వరగానే నయమవుతాయి. వాతరక్తంతో ముడిపడిన కీళ్లనొప్పి గలవారు మాంసాహారం ఎక్కువగా తినకూడదు.


రాకుండా చూసుకోవచ్చు

కీళ్ల నొప్పులు వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే నివారించుకోవచ్చు.

  • ధాతు పుష్టికి ఆహారమే కీలకం. తిన్న ఆహారం జీర్ణమై ముందుగా రసంగా ఏర్పడి.. అక్కడ్నుంచి ఇతర ధాతువులకు చేరుకుంటుంది. కాబట్టి ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు అన్నింటినీ సమపాళ్లలో తీసుకోవాలి. పోషణ సరిగా లేకపోతే ధాతువుల మీద విపరీత ప్రభావం పడుతుంది.
  • జీర్ణం కాకముందే మరోసారి ఆహారం తినటం, శరీరానికి పడని పదార్థాలు ఎక్కువ మోతాదులో తినటం మంచిది కాదు. దీనివల్ల ఆమం ఏర్పడుతుంది. ఆమం ముందు రస ధాతువును చెడగొడుతుంది. తొలి ధాతువే దెబ్బతింటే మిగతావీ క్షీణించటం మొదలవుతుంది.
  • అప్పుడే వండిన, వేడిగా ఉన్న ఆహారం తినాలి. చల్లటి పదార్థాలు, పానీయాలు, కాఫీకి దూరంగా ఉండాలి. ఇవి వాతం పెరిగేలా చేస్తాయని తెలుసుకోవాలి.
  • కంటి నిండా నిద్ర పోయేలా చూసుకోవాలి. నిద్ర సరిగా పట్టకపోయినా శరీరంలో రూక్ష గుణం పెరిగి, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.
  • క్రమ బద్ధమైన వ్యాయామం, శారీరక శ్రమ తప్పనిసరి.
  • సామాజిక జీవనమూ ముఖ్యమే. ఇది సరిగా లేకపోతే మానసిక వ్యథ, చింతనతోనూ వ్యాధులు ఎక్కువవుతాయి. ముఖ్యంగా వాతం పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.
  • పాదరక్షలు కాలికి దెబ్బ తగలకుండా కాపాడటమే కాదు.. మనిషి బరువును పాదం మీద అన్ని వైపులా సమానంగా పడేలా చేస్తాయి. కాబట్టి పాదాల ఆకారానికి సరిపడిన పాదరక్షలు ధరించాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని