పళ్లు పచ్చనేల?

పళ్లు రంగు మారటం లేదా పచ్చగా అవటం చాలామందిలో చూసేదే. ఇది రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి- పళ్ల పైభాగాన రంగు మారటం. రెండు- పళ్ల లోపల్నుంచి రంగు మారటం. టీ, కాఫీ, పొగ తాగటం వంటి

Published : 22 Feb 2022 00:54 IST

పైన రంగు మారటం

సమస్య: నాకు 29 ఏళ్లు. చిన్నప్పట్నుంచీ దంతాలు పచ్చగా ఉన్నాయి. దీంతో నలుగురిలో సరిగా నవ్వలేకపోతున్నాను. దంతాలు శుభ్రం చేసుకుంటే పచ్చ రంగు పోతుందా? శుభ్రం చేసుకుంటే గతంలో మాదిరిగా దంతాలు దృఢంగా ఉంటాయా? పరిష్కార మార్గం సూచించండి.

- శ్రీకాంత్‌ (ఈమెయిల్‌)

సలహా: పళ్లు రంగు మారటం లేదా పచ్చగా అవటం చాలామందిలో చూసేదే. ఇది రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి- పళ్ల పైభాగాన రంగు మారటం. రెండు- పళ్ల లోపల్నుంచి రంగు మారటం. టీ, కాఫీ, పొగ తాగటం వంటి అలవాట్లతో పళ్ల పైభాగాన రంగు మారుతుంటుంది. ఇది పెద్దవారిలో ఎక్కువ. పళ్ల లోపల్నుంచి రంగు మారటమనేది చిన్న వయసులోనే మొదలవుతుంది. దీనికి మూలం దంతాలు ఏర్పడే సమయంలో ఎనామిల్‌ లేదా డెంటిన్‌ లోపాలు. ఫ్లోరోసిన్‌తో బాధపడేవారిలో తరచూ ఇలాంటిది చూస్తుంటాం. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల నీటిలో ఫ్లోరిన్‌ ఎక్కువగా ఉండటం తెలిసిందే. గర్భధారణ సమయంలో తల్లి గానీ బాల్యంలో పిల్లలు గానీ ఫ్లోరిన్‌ మోతాదు ఎక్కువగా ఉండే నీటిని తాగటం ఫ్లోరోసిస్‌కు దారితీస్తుంది. కడుపులో ఉన్నప్పుడు తల్లి లేదా బాల్యంలో పిల్లలు టెట్రాసైక్లిన్‌ రకం మందులు వాడటం మూలంగానూ పళ్ల రంగు మారొచ్చు. కొన్ని జన్యులోపాలూ దీనికి కారణం కావచ్చు. మీరు చిన్నప్పట్నుంచే పళ్లు పచ్చగా ఉంటున్నాయంటే లోపల్నుంచే రంగు మారి ఉండొచ్చని అనిపిస్తోంది. ఇది మూమూలు క్లీనింగ్‌, బ్లీచింగ్‌తో పోదు. దీనికి సెరామిక్‌ లామినేట్‌ వీనర్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇవి చాలా పలుచగా ఉంటాయి. పళ్ల మీద అమర్చితే గట్టిగా పట్టుకొని శాశ్వతంగా ఉండిపోతాయి. పళ్లు తెల్లగా కనిపిస్తాయి. వీటి మీద గార పట్టటం, బ్యాక్టీరియా పెరగటం వంటివేవీ ఉండవు కాబట్టి చిగుళ్ల జబ్బులేవైనా ఉన్నా త్వరగా నయమవుతాయి. పళ్ల మధ్య ఖాళీలు, ఎగుడు దిగుళ్ల వంటివీ సరి అవుతాయి. వీనర్స్‌ వేయించుకున్నాక మామూలుగానే ఆహారం తినొచ్చు, బ్రష్‌ చేసుకోవచ్చు. ఇబ్బందులు ఉండవు. దురలవాట్ల జోలికి వెళ్లకపోవటం.. పళ్లతో గోళ్లు కొరకటం, సీసాల మూతలు తీయటం వంటివి చేయకపోతే మరింత ఎక్కువకాలం మన్నేలా చూసుకోవచ్చు. మీరు దంత నిపుణులను సంప్రదిస్తే రంగు తీరును పరిశీలించి చికిత్స సూచిస్తారు.


ఫ్లోరోసిస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని