మొబైల్‌ నొప్పి!

బొటనవేలు ఎప్పుడూ లాగుతున్నట్టు, నొప్పి పెడుతున్నట్టు అనిపిస్తోందా? అయితే స్మార్ట్‌ఫోన్‌ను అతిగా.. రోజుకు 3 నుంచి 4 గంటల కన్నా ఎక్కువసేపు  వాడుతున్నారేమో చూసుకోండి. ఇది ఫోన్‌ వ్యసనానికి సంకేతం కావొచ్చు.

Published : 05 Apr 2022 00:35 IST

బొటనవేలు ఎప్పుడూ లాగుతున్నట్టు, నొప్పి పెడుతున్నట్టు అనిపిస్తోందా? అయితే స్మార్ట్‌ఫోన్‌ను అతిగా.. రోజుకు 3 నుంచి 4 గంటల కన్నా ఎక్కువసేపు  వాడుతున్నారేమో చూసుకోండి. ఇది ఫోన్‌ వ్యసనానికి సంకేతం కావొచ్చు. అదేపనిగా తెరను స్వైపింగ్‌, టైపింగ్‌ చేయటం నొప్పికి దారితీయొచ్చు. ఫోన్‌ను ఎక్కువగా వినియోగించే చేతిలో గానీ మణికట్టులో గానీ నొప్పి పెరగటం, బొటనవేలిలో ఏదో మోదుతున్నట్టు నొప్పి రావటం, బొటనవేలిని కదిపినప్పుడు క్లిక్‌మని చప్పుడు రావటం, బొటనవేలు చూపుడు వేలు మధ్యభాగం గట్టిగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తే అతిగా ఫోన్‌ వాడుతున్నారనే అర్థం. దీన్ని ఒకరకంగా టెక్స్టింగ్‌ నొప్పి అనుకోవచ్చు. అతి వాడకంతో వేళ్లలోని.. ముఖ్యంగా బొటన వేలులోని కండర బంధనంలో వాపు తలెత్తొచ్చు. ఇది నొప్పికి దారితీయొచ్చు. క్రమంగా మణికట్టు కండర బంధనాలకూ నొప్పి విస్తరించొచ్చు.

నివారించుకోవటమెలా?

* ఫోన్‌ను రోజుకు 4 గంటలకు మించి వాడకుండా చూసుకోవాలి.

* టైపింగ్‌ చేయటానికి బదులు వాయిస్‌ మెసేజ్‌లు పంపుకోవచ్చు. మెయిళ్లు, డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్ల వంటి వాటిని స్మార్ట్‌ఫోన్‌లో కన్నా ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ మీద టైప్‌ చేసుకోవాలి.

* ఫోన్‌ను చేత్తో పట్టుకోవటం కన్నా మొబైల్‌ ఫోన్‌ స్టాండ్‌ వాడుకుంటే మంచిది.

* బొటనవేలితో స్వైపింగ్‌ చేయటం తగ్గించాలి.

* ఫోన్‌లో సదుపాయం ఉంటే- వేళ్లతో స్వైప్‌, టైప్‌ చేయటానికి బదులు స్టైలస్‌ ఉపయోగించాలి.

* అనవసర యాప్‌ నోటిఫికేషన్లను టర్న్‌ ఆఫ్‌ చేయాలి.

నొప్పి తగ్గాలంటే..

* చేతికి విశ్రాంతి ఇవ్వాలి. స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలి.

* నొప్పి వస్తున్నచోట ప్రతి 2 గంటలకోసారి 15 నిమిషాల సేపు ఐస్‌ ముక్కలు గానీ వేడి కాపు గానీ పెట్టుకోవాలి. వీటితో ఫలితం కనిపించకపోతే నొప్పి మాత్రలు వేసుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

వ్యాయామాలూ..

వేళ్లు, మణికట్టు వ్యాయామాలూ నొప్పి తగ్గటానికి తోడ్పడతాయి.

* అరచేతులు గోడవైపు చూస్తున్నట్టుగా చేతులను ముందుకు చాచాలి. 10 సార్లు వేళ్లతో గట్టిగా పిడికిలి బిగించాలి. పిడికిలి బిగించినప్పుడు బొటనవేలు లోపల ఉండాలి.

* ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లలోకి జొనపాలి. అరచేతులు గోడ వైపు చూస్తున్నట్టుగా చేతులను తిన్నగా ముందుకు చాచాలి. వేళ్ల వెనక భాగం సాగుతున్నట్టు భావించుకోవాలి.

* అరచేతులు నేల వైపు చూసేలా చేతులను ముందుకు చాచాలి. చేతులను స్థిరంగా అలాగే ఉంచి, నెమ్మదిగా వేళ్లను వీలైనంత వరకు కిందికి వంచాలి. తర్వాత పైకి లేపాలి.

చేతులను ముందుకు తిన్నగా చాచి, బొటనవేలు లోపల ఉండేలా పిడికిలి బిగించాలి. మణికట్టును కుడివైపునకు గుండ్రంగా తిప్పాలి. తర్వాత ఎడమవైపునకు తిప్పాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని