నవ్వినంత ఆరోగ్యం!

ఆనందాన్నిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. అదీ ఉచితంగా! ఎలాంటి ఖర్చు లేకుండా ఇన్ని ప్రయోజనాలు అందించేది ఏంటో తెలుసా? నవ్వు! అవును. నూటికి నూరు పాళ్లు నిజం. అప్రయత్నంగానో, ఉద్దేశపూర్వకంగానో ఎలా అయినా సరే. నవ్వినవారికి నవ్వినంత మేలు చేకూరుతుంది. మరి నవ్వు ప్రాధాన్యం, దీంతో ఒనగూరే

Updated : 12 Jul 2022 16:51 IST

ఆనందాన్నిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. అదీ ఉచితంగా! ఎలాంటి ఖర్చు లేకుండా ఇన్ని ప్రయోజనాలు అందించేది ఏంటో తెలుసా? నవ్వు! అవును. నూటికి నూరు పాళ్లు నిజం. అప్రయత్నంగానో, ఉద్దేశపూర్వకంగానో ఎలా అయినా సరే. నవ్వినవారికి నవ్వినంత మేలు చేకూరుతుంది. మరి నవ్వు ప్రాధాన్యం, దీంతో ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దామా!

న అంతిమ లక్ష్యం ఆనందమే! కావాలంటే చేస్తున్న పనులను ఒకసారి పరిశీలించండి. పుస్తకం చదివినా, సినిమా చూసినా, స్నేహితులతో షికారు చేసినా, తీర్థయాత్రలకు వెళ్లినా, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించినా.. అన్నింటి పరమార్థం ఆనంద సాధనే. ఒకవైపు మనసులో సంతోషం పెల్లుబుకుతున్నప్పుడు ముఖం మీద నవ్వు విరబూస్తుంటుంది. మరోవైపు నవ్వుతున్నప్పుడు అప్రయత్నంగానే ఆనందమూ కలుగుతుంది. ఇవి రెండూ పరస్పరం ఆధారపడే ఉంటాయి. ఏది ముందు, ఏది వెనక అన్నది చెప్పటం కష్టం. కానీ నవ్వు, ఆనందాల సంయోగం ఆరోగ్యానికి తొలిమెట్టు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసారా నవ్వుకోవటం, సహజంగా నవ్వుని ఆస్వాదించటం గగనమైపోతోంది. నవ్వలేకపోవటం, ప్రశాంతంగా నవ్వే సందర్భాలు రోజురోజుకీ తగ్గిపోవటం ఒకరకంగా మన మనుగడకే సవాలు విసురుతున్నాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఎన్నెన్నో జీవనశైలి సమస్యలకు మానసిక ప్రశాంతత కొరవడటమే కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క నవ్వుతోనే ఆనందాన్ని, ప్రశాంతతను సాధించొచ్చు. ఫలితంగా చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

నవ్వంటే ఏంటి?

నవ్వు అనేది ముఖంలో పైకి కనిపించే ఒక సంకేతం. దీనికి మెదడు, మనసు అంతర్గతంగా తోడ్పడతాయి. ఆనందం, సంతోషం, వినోదం వంటి వాటిని మనం నవ్వుతోనే వ్యక్తం చేస్తాం. నవ్వొచ్చేటప్పుడు ఆపుకోవటం లేదా ఆపుకోలేక నవ్వేయటం ఆయా సందర్భాలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాలు, పరిచయాలు కూడా ఇందులో పాలు పంచుకుంటాయి. ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, సంతోషంగా ఉన్నట్టు భావించినప్పుడు మెదడులో ఆనంద హార్మోన్లు (ఎండార్ఫిన్లు) ఉత్పత్తి అవుతాయి. అదే సమయంలో ముఖంలోని కండరాలకు నాడీ సంకేతాలు అందుతాయి. నోటి చుట్టూరా ఉండే కండరాలు సంకోచించి నవ్వు పుట్టుకొస్తుంది. అదే సమయంలో ముఖం కండరాల నుంచి మెదడుకు అందే సంకేతాలు మరింత ఆనందం కోసం పరితపించేలా చేసే కేంద్రాన్ని ప్రేరేపితం చేస్తాయి. దీంతో మరింత ఎక్కువగా ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇదంతా ఒక వలయంలా సాగుతూ వస్తుంది. అంటే మెదడు ఆనందంగా ఉన్నట్టు భావిస్తే నవ్వు పుట్టుకొస్తుంది, నవ్వినప్పుడు మెదడు మరింతగా ఆనందిస్తుందన్నమాట. లాఫింగ్‌ క్లబ్‌లు, లాఫింగ్‌ థెరపీల ప్రధాన సూత్రం ఇదే.

ఔషధంగానూ..

నవ్వటంలో పిల్లలే ఛాంపియన్లు. పిల్లలు రోజుకు సగటున 400 సార్లు నవ్వుతారని పరిశోధనలు చెబుతున్నాయి. అదే పెద్దవారు రోజుకు దాదాపు 40-50 సార్లే నవ్వుతారు. పిల్లలు అంత సంతోషంగా, కల్మషం లేకుండా ఉండటానికి కారణం ఇదేనంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు వైద్యులు తమ దగ్గరకు చికిత్స కోసం వచ్చేవారికి మందులతో పాటు రోజుకు 500 సార్లు నవ్వమనీ రాసి ఇచ్చేవారు! మానసిక స్థితిని, దీంతో పాటు ఆరోగ్యాన్నీ నవ్వు మెరుగు పరుగస్తుందని ఆనాడే గ్రహించారనటానికి ఇదో నిదర్శనం.

నవ్వటానికి సరదా చిట్కాలు!

మనసుండాలే గానీ నవ్వుకోవటానికి బోలెడన్ని అవకాశాలు. నవ్వు తెప్పించే పుస్తకాలు, జోక్స్‌, కార్టూన్లు, వీడియోల సంగతి సరేసరి. ఇవే కాదు, నవ్వటానికి తగిన పరిస్థితులను, సందర్భాలను మనమే సృష్టించుకోవచ్చు. ఇందుకు సరదాగా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు.

పోస్ట్‌ ఇట్‌ నోట్‌ ఛాలెంజ్‌: విషయాలను గుర్తుంచుకోవటానికి కాగితం మీద రాసి గోడకు అంటిస్తుంటాం కదా. ఇలాంటి 10-20 రంగుల పోస్ట్‌ ఇట్‌ నోట్‌లను సేకరించుకోవాలి. నవ్వు పుట్టించే వ్యక్తులు, స్థలాలు లేదా వస్తువులను వాటిపై రాసుకోవాలి. రోజూ ఉదయం వాటిని ఓసారి చూస్తుంటే అప్రయత్నంగానే ముఖం మీద చిరునవ్వు కదలాడుతుంది.

స్మైల్‌ కొల్లేజ్‌: మనం నవ్వుతున్నప్పుడు తీసిన ఫొటోలు, స్నేహితులతో సరదాగా నవ్వుతున్న ఫొటోలు, మనకు నవ్వు పుట్టించే ఫొటోలను ఒక ఫ్రేమ్‌లో చేర్చి, గుది గుచ్చాలి. దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సరదాగా పోస్ట్‌ చేసి చూడండి. ఇది మనం నవ్వుకోవటానికే కాదు, ఇతరులను నవ్వించటానికీ తోడ్పడతుంది.

వెయిటింగ్‌ ఛాలెంజ్‌: ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడో, క్యూలో ఎక్కువసేపు నిల్చున్నప్పుడో సరదాగా ఓసారి గట్టిగా నవ్వటానికి ప్రయత్నించండి. ఇతరులు తిరిగి నవ్వితే సరదాగా మరోసారి నవ్వి చూడండి.

19 ఛాలెంజ్‌: సుమారు 19 రకాల నవ్వులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో మనకు ఎన్ని నవ్వులు వచ్చు? తెలుసుకోవాలని ఉందా? అయితే రకరకాల సందర్భాల్లో నవ్వుతున్నప్పుడు ఫొటోలు తీసుకొని పరిశీలించండి. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా తీసి బేరీజు వేయండి. అసంకల్పితంగానే నవ్వు రావటం ఖాయం.

చిరునవ్వును కాపాడుకోవాలంటే?

ఆశ్చర్యంగా అనిపించినా నవ్వుకు, నోటి శుభ్రతకు దగ్గరి సంబంధం ఉంది. నోరు శుభ్రంగా ఉంటే నలుగురిలో మనసారా నవ్వటానికి ఆస్కారముంటుంది. కాబట్టి రోజుకి రెండుసార్లు బ్రష్‌తో పళ్లు తోముకోవాలి. దీంతో నోటితో పాటు నవ్వు కూడా తాజాగా కనిపిస్తుంది. ఎగుడు దిగుడు దంతాలుంటే సరిచేసుకుంటే మంచిది. దీంతో బ్యాక్టీరియా వంటివి వృద్ధి చెందకుండా చూసుకోవచ్చు. ముఖమూ అందంగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.


ఎన్నెన్నో ప్రయోజనాలు

ఆయుష్షు పెరుగుతుంది: నవ్వు జీవనకాలం పెరిగేలా చేస్తుంది. ఎక్కువకాలం జీవించిన, జీవిస్తున్న వారిని పరిశీలించినప్పుడు వీరంతా దైనందిన జీవితంలో సహజంగా, ఇష్టంగా నవ్వుతున్నారని తేలటం గమనార్హం. బేస్‌బాల్‌ క్రీడాకారుల బృందం పాత ఫొటోను ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వీరిలో నవ్వుతూ కనిపించినవారు ఎక్కువ కాలం జీవించినట్టు గుర్తించారు. పెద్దగా నవ్వేవారు సగటున 79.9 సంవత్సరాలు, కొద్దిగా నవ్వేవారు 75 ఏళ్లు జీవించినట్టు తేలింది. అసలే నవ్వనివారు 72.9 ఏళ్లు మాత్రమే బతికారు. అంటే ముఖం ముడుచుకొని ఉండేవారితో పోలిస్తే బాగా నవ్వేవారి ఆయుర్దాయం ఏడేళ్లు ఎక్కువగా ఉంటోందన్నమాట.

ఒత్తిడి తగ్గుముఖం: కావాలని గానీ సహజంగా గానీ.. ఎలా నవ్వినా అది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనికి చేయాల్సిందల్లా నవ్వటానికి కాసేపు సమయం కేటాయించటమే. కోపం, భయం వంటి ప్రతికూల భావనలతో మన శరీరంలో కార్టిజోల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. నవ్వినప్పుడు పుట్టుకొచ్చే ఎండార్ఫిన్లు ఈ ఒత్తిడి హార్మోన్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.

ఉత్సాహం: నవ్వడం ద్వారా మానసిక స్థితి (మూడ్‌) మెరుగవుతుంది. మనకి నచ్చని మూడ్‌ నుంచి బయటకు రావాలంటే నవ్వును తెప్పించే ఘటనలను గుర్తుకు తెచ్చుకోవాలి. అలాంటి సందర్భాల్లోకి మనం వెళ్ళాలి.

అనుబంధాలకు ఊతం: నవ్వు అంటువ్యాధిలా సంక్రమిస్తుంది. మనం నవ్వుతుంటే ఎదుటివాళ్లూ నవ్వుతారు మరి. ఇది సాన్నిహిత్యం, అనుబంధాలకు తోడ్పడుతుంది. నవ్వుతూ గడిపేవారికి స్నేహితులు ఎక్కువగా ఉండటం తెలిసిందే. నవ్వు నలుగురిని ఆకర్షించేలా చేస్తుంది. ముఖ కవళికలు, భావాలు ఎదుటివారిని మరింత దగ్గర చేస్తాయి. ఇష్టపడేలా చేస్తాయి. నలుగురితో సఖ్యతగా ఉండటం వ్యక్తిగత జీవితంలోనే కాదు.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. నవ్వు పరిచయాలను మరింత అందంగా తీర్చిదిద్దుతుంది.

రోగనిరోధశక్తి బలోపేతం: ఒత్తిడిలో ఉన్నప్పుడు విడుదలయ్యే కార్టిజోల్‌ హార్మోన్‌ రోగనిరోధకశక్తిని బలహీన పరుస్తుంది. అయితే నవ్వినప్పుడు పుట్టుకొచ్చే ఎండార్ఫిన్లు ఈ కార్టిజోల్‌ దుష్ప్రభావాన్ని తగ్గిస్తాయి. సహజంగా వచ్చే నవ్వు సానుకూల ప్రతిస్పందనలకు దోహదం చేస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎన్ని లాభాలో. మామూలు జలుబు, దగ్గు దగ్గర్నుంచి కొవిడ్‌-19 వంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా త్వరగా నయమవుతాయి.

గుండెకు మేలు: దీర్ఘకాలం ఒత్తిడి ప్రభావానికి గురైతే గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి దాడిచేసే అవకాశం ఎక్కువ. నవ్వుతో వీటి ముప్పులను తగ్గించుకోవచ్చు. మనసారా నవ్వినప్పుడు ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ వుతుంది. ఒత్తిడి తగ్గటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గితుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులూ నియంత్రణలో ఉంటాయి. ఇవన్నీ గుండెకు మేలు చేసేవే.

నొప్పి మాయం: చిరునవ్వు నొప్పిని తగ్గిస్తుంది. నవ్వటం వల్ల మెదడులో తలెత్తే ప్రతికూల రసాయన చర్యలు సానుకూలంగా మారుతాయి. ఇలాంటి రసాయన చర్యలు శరీరంలో నొప్పులకు ఔషధంగా పనిచేస్తాయి.

విజయ సోపానం: నిజానికి నవ్వే విజయానికి చిహ్నం! ముఖం మీద సహజమైన నవ్వుతో అలరారుతుంటే ఆ సమయాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నట్టే. సమయం, సందర్భాలను సద్వినియోగం చేసుకుంటున్నట్టే. ఇవన్నీ లక్ష్యాలను చేరుకోవటానికి, విజయం సాధించటానికి మార్గాలే.

సానుకూల జీవన సాధనం: మనల్ని వేధించే ప్రతికూల ఆలోచనలు, భావనలను పోగొట్టటానికి నవ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా సానుకూల జీవన ధోరణికి తోడ్పడుతుంది.

నవ యవ్వనం: నవ్వుతో ముఖ సౌందర్యమూ ఇనుమడిస్తుంది. నవ్వినప్పుడు ముఖంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుంది. ఫలితంగా ముఖంలో యవ్వనం, తాజాదనం ఉట్టిపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని