Headache: తల వెనకాల నొప్పి వస్తోంది.. ఏం చేయాలి?

నాకు 45 ఏళ్లు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. తరచూ తల వెనకాల నొప్పి వస్తుంది. వెన్నెముకలో మొదటి వెన్నుపూస కదిలిందని డాక్టర్‌ నిర్ధరించారు. దీంతో చాలా ఒత్తిడికి గురవుతున్నాను.

Updated : 01 Sep 2022 06:46 IST

సమస్య: నాకు 45 ఏళ్లు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. తరచూ తల వెనకాల నొప్పి వస్తుంది. వెన్నెముకలో మొదటి వెన్నుపూస కదిలిందని డాక్టర్‌ నిర్ధరించారు. దీంతో చాలా ఒత్తిడికి గురవుతున్నాను. దీనికి పరిష్కారమేంటి? ఎవరిని సంప్రదించాలి?

- ఆనంద బాబు

సలహా: వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూసను అట్లాస్‌ (సీ1) అంటారు. ఇది పుర్రెను, రెండో వెన్నుపూసను కలుపుతుంది. తలను మోసేది, తల కదలటానికి తోడ్పడేదీ ఇదే. దెబ్బలు తగలటం, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి కారణాల మూలంగా కొన్నిసార్లు ఈ వెన్నుపూస ఉన్నచోటు నుంచి జరిగిపోవచ్చు. అప్పుడు అక్కడి నాడి నొక్కుకుపోవచ్చు. అనుసంధాన కీలూ దెబ్బతినొచ్చు. తల వెనకాల (ఆక్సిపటల్‌), మెడ పైభాగంలో నొప్పి రావటానికి ఇదొక కారణం. కొందరికి తలకు ఒకవైపున నొప్పి కూడా రావొచ్చు. తలలో ఏదో పొడుస్తున్నట్టు, బాదుతున్నట్టుగా నొప్పి పుడుతుంది. మీరు డాక్టర్‌ దగ్గరికి వెళ్తే జబ్బును గుర్తించారని తెలిపారు. అయితే దీన్ని కచ్చితంగా గుర్తించటం అవసరం. స్పెషల్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ సర్వైకల్‌ స్పైన్‌ పరీక్షలతో నిశితంగా పరిశీలించి నిర్ధరించాల్సి ఉంటుంది. తలను పైకెత్తినప్పుడు, కిందికి దించినప్పుడు పూస ఎలా ఉంటోంది, ఎటువైపునకు జరుగుతుందనేది వీటిల్లో తెలుస్తుంది. ఒకవేళ అట్లాస్‌ పూస నిజంగానే స్థానభ్రంశం చెందినట్టు తేలితే సర్జరీతో సరి చేయాల్సి ఉంటుంది. మీరు న్యూరాలజిస్ట్‌ను గానీ న్యూరోసర్జన్‌ను గానీ సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తగు చికిత్స సూచిస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని