ఇ-సిగరెట్లతో పిప్పిపళ్లు!

ఇటీవల ఇ-సిగరెట్ల వాడకం పెరిగిపోతోంది. మామూలు సిగరెట్లతో పోలిస్తే ఇవి అంత ప్రమాదకరం కావని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు.

Published : 13 Dec 2022 00:04 IST

టీవల ఇ-సిగరెట్ల వాడకం పెరిగిపోతోంది. మామూలు సిగరెట్లతో పోలిస్తే ఇవి అంత ప్రమాదకరం కావని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. సిగరెట్ల మాదిరిగానే ఇ-సిగరెట్లు సైతం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిల్లో వేడిని పుట్టించే పరికరం ద్రవాన్ని ఆవిరి పొగగా మారుస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఈ పొగలో నికొటిన్‌, భార లోహాలు, సువాసన కలిగించే డయాసిటైల్‌ వంటి హానికర పదార్థాలెన్నో ఉంటాయి. ఇవి దీర్ఘకాల ఊపిరితిత్తుల జబ్బులకు దారితీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇ-సిగరెట్లతో రక్తనాళాలు దెబ్బతింటున్నాయనీ వివరిస్తున్నాయి. వీటిని కాల్చేవారి నోట్లో విభిన్నమైన బ్యాక్టీరియా ఉంటోందని, ఇది తీవ్ర చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తోందనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఇ-సిగరెట్లతో పళ్లు పుచ్చిపోతున్నట్టూ టఫ్ట్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డెంటల్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనంలో బయటపడింది. ఇ-పొగతో నోరు పొడి బారుతుంది. దీంతో దంతాలు సహజంగా శుభ్రపడే ప్రక్రియ కొరవడుతుంది. అంతేకాదు.. నోట్లో బ్యాక్టీరియా కూడా అస్తవ్యస్తమై పోతుంది. ఇది పళ్లు పుచ్చిపోవటానికి కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి ఆస్కారం కలిగిస్తోందనీ పరిశోధకులు భావిస్తున్నారు. నోరు ఎండిపోయినప్పుడు బ్యాక్టీరియా దంతాలకు పట్టుకొని ఉండిపోయే అవకాశం పెరుగుతుంది. క్రమంగా దంతాలు క్షీణించే ప్రమాదముంది. గంజాయి పదార్థాలతో కూడిన ఇ-సిగరెట్లతోనైతే మరింత హాని కలుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని