కుంగుబాటును పట్టండి!

ఎప్పుడో అప్పుడు బాధపడటం, నిరాశకు లోనవ్వటం సహజమే. కొద్దిరోజుల తర్వాత వాటి నుంచి నెమ్మదిగా కోలుకుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి భావనలు రోజురోజుకీ ఎక్కువవుతూ వస్తుండొచ్చు

Published : 21 Feb 2023 00:24 IST

ఎప్పుడో అప్పుడు బాధపడటం, నిరాశకు లోనవ్వటం సహజమే. కొద్దిరోజుల తర్వాత వాటి నుంచి నెమ్మదిగా కోలుకుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి భావనలు రోజురోజుకీ ఎక్కువవుతూ వస్తుండొచ్చు. విడవకుండా వేధిస్తుండొచ్చు. చివరికి రోజువారీ పనులకూ విఘాతం కలిగించొచ్చు. ఇవి కుంగుబాటు (డిప్రెషన్‌) లక్షణాలు కావొచ్చు. ఇది తీసిపారేసేది కాదు. తీవ్రమైన సమస్య. కుంగుబాటుకు రకరకాల అంశాలు దారితీస్తుంటాయి. కొందరికి జన్యుపరంగా ముప్పు పొంచి ఉంటుంది. కొందరికి ఆర్థిక సమస్యలు, ఆత్మీయులను కోల్పోవటం, జీవితంలో పెద్ద ఇబ్బందులు ఎదురవ్వటం వంటి పరిస్థితులు కుంగుబాటును ప్రేరేపించొచ్చు. క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి తీవ్ర సమస్యలూ దీన్ని తెచ్చిపెట్టొచ్చు. ఇది ఆయా జబ్బులను మరింత ఎక్కువయ్యేలా చేస్తుంది కూడా. కాబట్టి కుంగుబాటు లక్షణాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండటం అవసరం.
*  అదేపనిగా విచారం, బాధ, ఆందోళన కలుగుతుండటం. మనసు వెలితిగా అనిపించటం.*నిరాశ, నిస్పృహకు లోనవ్వటం.* చిరాకు పడటం, విసుక్కోవటం, ప్రశాంతత కొరవడటం.* తమను తాము నిందించుకోవటం, దేనికీ పనికిరానని అనుకోవటం.* అభిరుచులు, పనుల్లో ఇష్టం, ఆనందం లేకపోవటం.* ఉత్సాహం తగ్గటం, నిస్సత్తువ కలగటం, హుషారుగా అనిపించకపోవటం.* ఏకాగ్రత కొరవడటం, జ్ఞాపకశక్తి తగ్గటం, నిర్ణయాలు తీసుకోలేకపోవటం.* నిద్ర పట్టకపోవటం, తెల్లవారుజామున్నే మెలకువ వచ్చేయటం. లేదూ అతిగా నిద్రపోవటం.* ఆకలి తగ్గటం లేదా పెరగటం. అకారణంగా బరువు పెరగటం లేదా తగ్గటం.* స్పష్టమైన కారణాలేవీ లేకుండా నొప్పులు, తలనొప్పి, కండరాలు పట్టేయటం, జీర్ణకోశ సమస్యలు తలెత్తటం. ఇవి చికిత్సతోనూ తగ్గకపోవటం.
* ఆత్మహత్య ఆలోచనలు రావటం. ఆత్మహత్యకు ప్రయత్నించటం.* తమను తాము గాయపరచుకోవాలని అనుకోవటం, గాయపరచుకోవటం.

- ఇలాంటి లక్షణాలతో రెండు వారాలకు పైగా బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, కుంగుబాటు ఉందేమో పరీక్షించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు