ఎల్‌డీఎల్‌ ఒక్కటే కాదు..

గుండెజబ్బు ముప్పు అనగానే చెడ్డ కొలెస్ట్రాలే (ఎల్‌డీఎల్‌) ముందుగా గుర్తుకొస్తుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది మరి.

Published : 14 Mar 2023 01:27 IST

గుండెజబ్బు ముప్పు అనగానే చెడ్డ కొలెస్ట్రాలే (ఎల్‌డీఎల్‌) ముందుగా గుర్తుకొస్తుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది మరి. అందుకే డాక్టర్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను తెలిపే పరీక్ష చేస్తుంటారు. అయితే ఎల్‌డీఎల్‌ ఒక్కటే కాకుండా అపోలైపోప్రొటీన్‌ బి-100 (అపోబీ) అనే ప్రొటీన్‌ మోతాదులూ ముఖ్యమేనని జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. దీని ద్వారా గుండెజబ్బు ముప్పు గలవారిని మరింత స్పష్టంగా గుర్తించొచ్చని వివరిస్తోంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ మోతాదులు తక్కువగా ఉన్నట్టు కనిపించే వారిలో ముప్పును పట్టుకునే అవకాశముంది. అధ్యయనంలో భాగంగా 2010 నుంచి 2022 వరకు 705 మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించి వీరిలో ఎంతమంది ఎల్‌డీఎల్‌, అపోబీ పరీక్షలు చేయించుకున్నారో పరిశీలించారు. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ మోతాదులు నార్మల్‌గా ఉన్నవారిలోనూ 46% మందిలో అపోబీ స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అపోబీ చెడు కొలెస్ట్రాల్‌కు అంటుకొని ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కువగా ఉంటే రక్త ప్రసరణలో ఎల్‌డీఎల్‌ రేణువులు పెద్దమొత్తంలో ఉన్నట్టే. గుండెజబ్బు, పక్షవాతం, గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టే. కొలెస్ట్రాల్‌ మోతాదులు నార్మల్‌గా ఉన్నవారిలోనూ కొందరికి గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని