గుండెకు స్టాటిన్ల రక్ష

నిద్రలో శ్వాసకు అడ్డంకి కలిగే సమస్య (స్లీప్‌ అప్నియా) గలవారికి గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎక్కువ. అందుకే స్లీప్‌ అప్నియా తీవ్రంగా గలవారు పడుకున్నప్పుడు శ్వాస ఆగిపోకుండా చూసే సీప్యాప్‌ పరికరాన్ని వాడుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.

Published : 21 Mar 2023 00:36 IST

నిద్రలో శ్వాసకు అడ్డంకి కలిగే సమస్య (స్లీప్‌ అప్నియా) గలవారికి గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎక్కువ. అందుకే స్లీప్‌ అప్నియా తీవ్రంగా గలవారు పడుకున్నప్పుడు శ్వాస ఆగిపోకుండా చూసే సీప్యాప్‌ పరికరాన్ని వాడుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. దీంతో నిద్ర బాగా పడుతుంది. పగలు కునికిపాట్లు పడటం తగ్గుతుంది. ఇది గుండెకూ మేలు చేస్తుందని భావించినా అంతగా ఫలితం కనిపించటం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పద్ధతులు అత్యావశ్యకంగా మారాయి. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. సీప్యాప్‌ వాడినా, వాడకపోయినా ఇవి గుండె జబ్బు ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కొలంబియా యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది. స్లీప్‌ అప్నియా మూలంగా రక్తనాళాల్లో తలెత్తే హానికర వాపుప్రక్రియ మార్పుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తున్నట్టు వెల్లడైంది. రక్తనాళాల్లో సీడీ59 అనే ప్రొటీన్‌ వాపుప్రక్రియను అదుపులో ఉంచటానికి తోడ్పడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గినప్పుడు ఇది మరింత స్థిరంగా పనిచేస్తుండటం విశేషం. ఇక్కడే స్టాటిన్లు ఉపయోగపడుతున్నాయి. వీటిని నాలుగు వారాల పాటు వేసుకున్నవారిలో సీడీ59 స్థిరంగా ఉన్నట్టు తేలింది. గుండెజబ్బు ముదరటంలో రక్తనాళాల్లో వాపుప్రక్రియ కీలకపాత్ర పోషిస్తుంది కాబట్టి సీడీ59 స్థిరంగా పనిచేసేలా చూస్తే మంచి ఫలితం కనిపిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని