బంక విరేచనాలు తగ్గటం లేదేం?

నాకు 25 ఏళ్లు. గత నెల నుంచి విరేచనం జిగటగా వస్తోంది. నొప్పేమీ లేదు గానీ బాత్రూమ్‌కు వెళ్లాలంటే టెన్షన్‌గా ఉంది. ఇంతవరకు డాక్టర్‌కు చూపించుకోలేదు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపండి.           

Updated : 28 Mar 2023 02:20 IST

సమస్య సలహా 

సమస్య: నాకు 25 ఏళ్లు. గత నెల నుంచి విరేచనం జిగటగా వస్తోంది. నొప్పేమీ లేదు గానీ బాత్రూమ్‌కు వెళ్లాలంటే టెన్షన్‌గా ఉంది. ఇంతవరకు డాక్టర్‌కు చూపించుకోలేదు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపండి.            

అఖిలేశ్‌ యాదవ్‌

సలహా: రోజుకు ఎన్నిసార్లు బంక విరేచనాలు అవుతున్నాయి? విరేచనంతో పాటు రక్తం పడుతోందా? వాసన ఎక్కువగా వస్తోందా? బరువేమైనా తగ్గిందా? అనేది మీరు తెలియజేయలేదు. సమస్యను అంచనా వేయటానికివి ముఖ్యం. నిజానికి విరేచనాల సమస్య తరచూ చూసేదే. కలుషిత ఆహారం, నీరు తీసుకోవటం.. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, అమీబియాసిస్‌ వంటి ప్రొటోజోవా ఇన్‌ఫెక్షన్లు దీనికి కారణం కావొచ్చు. రక్తం పడుతుంటే డీసెంట్రీగా భావించాల్సి ఉంటుంది. కడుపునొప్పి, చీము, రక్తం పడటం వంటి లక్షణాలేవీ లేకపోతే సాధారణంగా బంక విరేచనాలు వారంలోపు తగ్గుముఖం పడతాయి. మీరు నెల రోజుల నుంచి బాధపడుతున్నారంటే ఇతరత్రా సమస్యలేవైనా ఉండే అవకాశముంది. కొన్నిసార్లు పేగుపూత (ఇన్‌ఫ్లమేటరీ బవల్‌ డిసీజ్‌- ఐబీడీ) మూలంగా బంక విరేచనాలు తలెత్తొచ్చు. కొవ్వు పదార్థాలు సరిగా జీర్ణం కాకపోయినా సమస్యకు దారితీయొచ్చు. ఇలాంటి స్వభావం గలవారు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు విరేచనం జిగటగా ఉండొచ్చు. కొవ్వు జీర్ణం కావటానికి క్లోమగ్రంథి నుంచి ఉత్పత్తయ్యే ఎంజైమ్‌లు చాలా ముఖ్యం. ఇవి లోపిస్తే విరేచనం జిగటగా వస్తుంది. అరుదుగా కొందరికి ఎలాంటి కారణం లేకుండా ఆందోళనతోనూ బంక విరేచనాలు పట్టుకోవచ్చు. ఏదేమైనా మీరు ముందుగా దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. చాలావరకిది మామూలు సమస్యే. విరేచనాలను తగ్గించే మందులు వాడితే ఫలితం కనిపిస్తుంది. పరిశుభ్రమైన ఆహారం తినటం, సురక్షిత నీరు తాగటం.. వేపుడు పదార్థాలు తినకపోవటం.. పెరుగు, మజ్జిగ తీసుకోవటం వంటి జాగ్రత్తలూ మేలు చేస్తాయి. ఒకవేళ మందులు వాడినా తగ్గకపోతే మలం పరీక్ష వంటి ఇతరత్రా పరీక్షలు అవసరమవుతాయి.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మా ఈమెయిల్‌ sukhi@eenadu.in  కు పంపొచ్చు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని